న్యాయవ్యవస్ధకే చుట్టుకుంటున్న నుపుర్ వ్యవహారం

అటు తిరిగి ఇటు తిరిగి చివరకు నుపుర్ శర్మ చేసిన వ్యాఖ్యల తాలూకు వివాదం చిరవకు న్యాయవ్యవస్ధకే చుట్టుకుంటోందా ? క్షేత్రస్థాయిలో మొదలైన వివాదం చూస్తే అలాగే అనిపిస్తోంది. మహమ్మద్ ప్రవక్తపై నుపుర్ చేసిన వ్యాఖ్యలతో దేశంలోనే కాకుండా అంతర్జాతీయంగా కూడా నిరసనలు వినిపించిన విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలోనే ఆమె చేసిన వ్యాఖ్యలపై కేసులు దాఖలై విచారణ జరిగింది. ఈ నేపధ్యంలోనే నుపుర్ చేసిన వ్యాఖ్యల వల్ల దేశంలో అరాచకం మొదలైందని ఘాటుగా కోర్టు వ్యాఖ్యానించింది.

ఉదయ్ పూర్లోని టైలర్ హత్యకు దీని పర్యవసానమే అని కోర్టు తీవ్రంగా ఆక్షేపించింది. దేశ ప్రజలకు వెంటనే ఆమె క్షమాపణలు చెప్పాలని కూడా ఆదేశించింది. సరే ఈ వివాదం ఇలా నడుస్తుండగానే హఠాత్తుగా 15 మంది విశ్రాంత న్యాయమూర్తులు తెరపైకి వచ్చారు. నుపుర్ శర్మ కేసు విచారణలో సుప్రీంకోర్టు లక్ష్మణరేఖ దాటినట్లు మండిపడ్డారు. సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. వీరికి 77 మంది విశ్రాంత ఉన్నతాధికారులు మరో 25 మంది వివిధ రంగాల్లో ప్రముఖులు కూడా తోడయ్యారు.

అయితే ఇక్కడ గమనించాల్సిందేమంటే వీళ్ళెవరూ నుపుర్ వ్యాఖ్యలను సమర్ధించలేదు. నుపుర్ విషయంలో సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలను మాత్రమే తప్పుపట్టారు. ఇదే సమయంలో బీజేపీ ఎంపీలు కూడా నుపుర్ కు బహిరంగంగా మద్దతు పలకడం మరో కీలక మలుపనే చెప్పాలి. నుపుర్ వ్యాఖ్యలపై స్వయంగా కేంద్రప్రభుత్వం సారీ చెప్పిన ఇన్నిరోజులకు బీజేపీ ఎంపీలు ఆమెకు మద్దతు పలకటం విచిత్రంగా ఉంది.

ఇదే సమయంలో ఆల్ ఇండియా బార్ అసోసియేషన్ మాత్రం సుప్రీంకోర్టుకు మద్దతుగా నిలబడింది. నుపుర్ కేసులో సుప్రీంకోర్టు జడ్జీల వ్యాఖ్యలు తప్పేమీలేదంటు బార్ అసోసియేషన్ ఒక ప్రకటన చేసింది. అంటే సుప్రింకోర్టు వ్యాఖ్యలపై అనుకూలంగాను, వ్యతిరేకంగాను న్యాయవ్యవస్ధలోనే పెద్ద చీలికవచ్చినట్లు అర్ధమైపోతోంది. తాజా వివాదం చివరకు ఏ మలుపు తీసుకుంటుందో ఏమో.