రాష్ట్రంలో రెండు ప్రధాన పక్షాల మధ్యే వచ్చే ఎన్నికల్లో పోటీ ఉండనుంది. ఈ విషయం బహిరంగ రహస్యం. అవే.. టీడీపీ, వైసీపీ, మధ్యలో పొత్తు రాజకీయాలు పొడిచినా.. కొన్ని జిల్లాల్లోనే అవి పరిమితం అవుతాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. దీంతో.. ఈ రెండు పార్టీల విషయంలోనే క్రేజీ రాజకీయాలు జరుగుతున్నాయి. అంటే.. వచ్చే ఎన్నికల్లో ఎవరికి ఎక్కడ టికెట్ ఇవ్వాలనే విషయంలో నాయకులు నోరు విప్పడం లేదు. పైగా.. నియోజకవర్గాల్లో పోటీకి లెక్కకు మించి నాయకులు తెరమీదికి వస్తున్నారు. ఇటు టీడీపీ అయినా.. అటు వైసీపీ అయినా.. అలానే ఉంది.
మరోవైపు.. ఎవరికి టికెట్ ఇస్తే.. ఏం జరుగుతుందో.. ప్రత్యర్థి పార్టీ ఎలా పుంజుకుంటుందో.. ఎవరిని నిలబెడుతుందో.. అని ఏ పార్టీకి ఆపార్టీ ఆలోచన చేస్తున్నాయి. అంటే.. ఇది వ్యూహాత్మక రాజకీయాలకు తెరదీస్తోందన్న మాట. ఉదాహరణకు ఏ నియోజకవర్గంలో అయినా.. ముందుగానే అభ్యర్థిని ప్రకటిస్తే.. ప్రత్యర్థిపార్టీ అంతకు మించిన బలమైన నాయకుడిని ఎంచుకునే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. దీంతో పార్టీలు.. ఎక్కడా కూడా అభ్యర్థులకు కనీసం.. హామీలు ఇచ్చే పరిస్థితి లేకుండా.. ఎక్కడికక్కడ డిఫెన్స్‌లో పడేస్తున్నాయి.
మీరు ముందు ప్రజల్లో ఉండాలి. వారి సమస్యలు తెలుసుకోవాలి.. ప్రభుత్వం చేస్తున్న మంచిని వారికి వివరించాలి. సంక్షేమ పథకాలను వివరించాలి. ప్రజలకు మనకు మధ్య గ్యాప్ రాకుండా చూసుకోవాలి. ముఖ్యంగా ప్రజల్లో ఉన్న అసంతృప్తిని తొలగించాలి.. అని అధికార పార్టీ నాయకులకు సెలవిస్తోంది. దీంతో ప్రస్తుత ఎమ్మెల్యేలు సరే.. అంటున్నారు. ఈ పరిణామాలతో సిట్టింగులకే టికెట్ లు వస్తాయని భావిస్తున్న కొందరు నాయకులు .. తటస్థంగా మారతుఉన్నారు. దీనిని గ్రహించిన వైసీపీ.. ఆ వెంటనే మీ గ్రాఫ్ బాగోలేక పోతే.. మారుస్తామంటూ.. ప్రకటనలు చేస్తోంది.
ఇక, టీడీపీ విషయంలోనూ ఇదే పరిస్థితి ఉంది. ఎవరికి వారు.. టికెట్ ఆశిస్తున్నా.. పార్టీని లైన్‌లో పెడతామని చెబుతున్నా.. టికెట్ విషయం ఇప్పుడే కాదు.. ముందు ప్రజల్లో ఉండాలని ..అధినేత చెబుతున్నారు. దీంతో తీరా తాము కష్టపడి పార్టీని డెవలప్ చేస్తే.. తర్వాత వేరేవారికి టికెట్ ఇస్తే.. మా పరిస్థితి ఏంటని.. నాయకులు తల్లడిల్లుతున్నారు. దీంతో ఈ రెండు పార్టీల్లోనూ నాయకులు టికెట్లపై బెంగ పెట్టుకున్నారనేది వాస్తవం. ఇది.. నియోజకవర్గాల్లో నాయకుల మధ్య విభేదాలకు కూడా దారితీస్తోంది. ఎవరి దారి వారిదే అన్నట్టుగా పార్టీల్లో నాయకులు వ్యవహరిస్తున్నారు. దీంతో పార్టీలో నేతల మద్య సఖ్యత లోపిస్తోందనే వాదన వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికైనా.. పరిస్థితిని అంచనా వేసి.. దానికి అనుగుణంగా వ్యవహరిస్తే.. బెటర్ అంటున్నారు పరిశీలకలు.