అమ‌రావ‌తి భూములు ఎక‌రం 10 కోట్లు.. జ‌గ‌న్ వ్యూహం ఏంటి?

ఏపీ క‌ల‌ల రాజ‌ధాని అమ‌రావ‌తి విష‌యంలో ప్ర‌స్తుతం సీఎం జ‌గ‌న్ ఏం చేస్తున్నారు. ఆయ‌న ఎలాంటి వ్యూహంతో ముందుకు సాగుతున్నారు..? ఇదీ..ఇప్ప‌డు జ‌రుగుతున్న చ‌ర్చ‌. ఎందుకంటే.. తాను ప‌ట్టిన కుందేలుకు మూడేకాళ్ల‌న‌ట్టుగా.. ఏపీలో మూడు రాజ‌ధానులు ఏర్పాటు చేసి తీరుతామ‌ని.. ఈ విష‌యంలో వెన‌క్కి త‌గ్గేదిలేద‌ని.. ప‌దే ప‌దే చెప్పారు. ఈ విష‌యంలో ఏకంగా.. శాస‌న మండ‌లిని ర‌ద్దు చేసేందుకు కూడా వెనుకంజ వేయ‌లేదు. రాత్రికి రాత్రి.. మండ‌లి ర‌ద్దుకు నిర్ణ‌యం తీసుకున్నారు కూడా!

అయితే.. ఈ క్ర‌మంలో రైతులు చేసిన ఆందోళ‌న‌.. హైకోర్టు, సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుల‌తో ప్ర‌భుత్వం వెన‌క్కి త‌గ్గ‌క త‌ప్ప‌ని ప‌రిస్థితి ఏర్ప‌డింది. దీంతో హైకోర్టు ఆదేశాల మేర‌కు అమ‌రావ‌తిలో మౌలిక స‌దుపాయాలు క‌ల్పించాల్సి వ‌చ్చింది. అయితే.. దీనికి సంబంధించి.. నిధులు కేటాయించాల్సిన ప్ర‌భుత్వం అప్పులు చేసుకోవాల‌ని.. రాజ‌ధాని ప్రాంత అభివృద్ది అథారిటీ(సీఆర్ డీఏ)ను ఆదేశించింది. దీంతో ఇక్క‌డ కొన్ని సంస్థ‌ల‌కు కేటాయించిన భూముల‌ను వెన‌క్కి తీసుకుని.. వాటిని విక్ర‌మ‌యించాల‌ని సీఆర్ డీఏ నిర్ణ‌యించింది.

ఈ క్రమంలో స‌ర్కారు.. వ్యూహాత్మ‌కంగా ముందుకు వెళ్లింది. ఇక్క‌డి ఎక‌రా భూమికి 10 కోట్ల రూపాయ‌లు ధర నిర్ణ‌యించింది. వాస్త‌వానికి ఇప్పుడు అంత ధ‌ర పెట్టి..ఇక్క‌డ భూములు కొనుగోలు చేసేందుకు ఎవ‌రూ ముందుకు రారు. ఎందుకంటే.. మ‌ళ్లీ వ‌చ్చే ప్ర‌భుత్వాన్ని బ‌ట్టే ఎవ‌రైనా.. ఇక్క‌డ నిర్ణ‌యం తీసుకుంటారు. ప్ర‌స్తుతం జ‌గ‌న్‌.. అమ‌రావ‌తిని మ‌న‌స్పూర్తిగా అభివృద్ధి చేస్తార‌ని.. ఎవ‌రూ భావించ‌డం లేదు. దీంతో ఇప్పుడు అంత ధ‌ర‌పోసి కొన్నా.. ప్ర‌యోజ‌నం లేద‌ని.. వెన‌క్కి త‌గ్గుతారు.

ఇదే జ‌రిగితే.. ‘చంద్ర‌బాబు ఎంపిక రాంగ్‌’ అనే ప్రచారం చేసేందుకు.. జ‌గ‌న్ టీం రెడీ అవుతుంది. “అది శ్మ‌శాన‌మ‌ని ముందే చెప్పాం. ఇప్పుడు ఎవ‌రూ కొనేందుకు కూడా ముందుకురావ‌డం లేదు. రాష్ట్రంలో ఓమూల‌కు ఉన్న ప్రాంతం కాబ‌ట్టి.. ఒక్క‌రు కూడా కొన‌డం లేదు. చంద్ర‌బాబు ఈ విష‌యంలో ఫెయిల్‌. అందుకే మేం మూడు రాజ‌ధానులు ప్ర‌క‌టిస్తున్నాం” అని పాజిటివ్ యాంగిల్‌లో త‌మ‌కు, నెగిటివ్ యాంగిల్‌లో విప‌క్షంపైనా విరుచుకుప‌డేందుకు వైసీపీకి ఒక ఛాన్స్ వ‌చ్చిన‌ట్టు అవుతుంది.

అలా కాకుండా..ఒక‌వేళ‌.. ఎవ‌రైనా ఇక్క‌డి భూముల‌ను కొనుగోలు చేసేందుకు ముందుకు వ‌స్తే.. “ఇది మా ఘ‌న‌త‌. మేం అన్నీ ఆచితూచే ధ‌ర‌లు నిర్ణ‌యించాం. జ‌గ‌న్‌పై ఉన్న న‌మ్మ‌కంతోనే కొన్నారు” అని ఇప్పుడు కూడా ప్ర‌చారం చేసుకునేందుకు వ్యూహం సిద్ధం చేసుకున్న‌ట్టు తెలిసింది. అంతేకాదు.. రాజ‌ధానిని తాము అభివృద్ది చేయ‌మ‌ని చెప్ప‌లేదు క‌దా.. ఇక్క‌డ ‘శాస‌న రాజ‌ధాని’ ఉంటుంద‌ని చెప్పాం క‌దా.. అందుకే.. కొన్నారు అని ప్ర‌చారం చేసుకునే ప్లాన్ కూడా రెడీగా ఉంద‌ని అంటున్నారు.

ఇవ‌న్నీ ఇలా ఉంటే.. ఈ అప్పులు చేయ‌డం ద్వారా.. ప్ర‌భుత్వంపై రాజ‌ధాని మౌలిక స‌దుపాయాల ఏర్పాటుకు అవ‌స‌ర‌మైన క‌నీస మొత్తం రూ.5000 కోట్ల భారం త‌ప్పిపోతుంది. పైగా.. అప్పులు చేసుకునేందుకు బ్యాంకు ల‌కు కూడా ప్ర‌భుత్వం ఎలాంటి హామీ ఉండ‌డం లేదు. దీంతో ఏదైనా ఉంటే.. సీఆర్డీఏనే భ‌రించాలి. అంటే.. మొత్తానికి రాజ‌ధాని విష‌యంలో జ‌గ‌న్ ఆది నుంచి చెబుతున్న వాద‌ననే లోపాయికారీగా వైసీపీ స‌ర్కారు అమ‌లు చేస్తోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.