వైసీపీ సీనియ‌ర్ల.. రాజ‌కీయం గ‌రంగ‌రం

వైసీపీ సీనియ‌ర్ నాయ‌కులు, పైగా.. సీఎం జ‌గ‌న్‌కు అత్యంత స‌న్నిహితులుగా పేరున్న‌వారు.. ఇప్పుడు రోడ్డున ప‌డ్డారు. ముఖ్యంగా జ‌గ‌న్ ఈ ఏడాది ఏప్రిల్‌లో చేప‌ట్టిన మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ త‌ర్వాత‌.. ఈ అసంతృప్తి మ‌రింత పెరిగిపోయింది. వీరిలో జ‌గ‌న్‌కు మామ వ‌ర‌స అయ్యే.. ఒంగోలు ఎమ్మెల్యే, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస‌రెడ్డి తెర‌మీదికి రాగా.. 24 గంట‌లు గ‌డ‌వ‌క ముందే.. నెల్లూరు రూర‌ల్ ఎమ్మెల్యే, జ‌గ‌న్‌కు మిత్రుడు కోటంరెడ్డి శ్రీధ‌ర్‌రెడ్డి వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లుచేశారు. దీంతో వైసీపీ సీనియ‌ర్ల అసంతృప్తి ప‌ర్వం.. రాజ‌కీయంగా ఆ పార్టీని కుదిపేస్తోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

ప్ర‌కాశం జిల్లాకు చెందిన వైసీపీ నేతలు, ప్రతిపక్ష తెలుగుదేశంతో కలిసి తనపై కుట్ర చేస్తున్నారని.. బాలినేని శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. తనకు సంబంధంలేని విషయాలను కూడా తనకు ఆపాదించి విమర్శలు చేయడం బాధగా ఉందన్నారు. ఇటీవల కొత్తపట్నం మండలం అల్లూరులో మహిళ విషయంలో జరిగిన వివాదంలో తనను అనవసరంగా లాగుతున్నారని అన్నారు. ఆమె కుటుంబ గొడవల విషయంలో టీడీపీ నేత‌లు ఆమెను వెనుకేసుకొచ్చి,.. తాను ఇబ్బంది పెట్టినట్లు రాద్ధాంతం చేశారన్నారు. తెలుగుదేశం నేతలు, వైసీపీ నేతలు కూడా.. ఆమెతో రోజూ మాట్లాడుతున్నారని ఆరోపించారు.

ఏం అన్యాయం చేశానని తనపై ఇంత కుట్ర చేస్తున్నారని బాలినేని ప్రశ్నించారు. కుట్రపై పవన్‌కల్యాణ్‌ కూడా వాస్తవాలు తెలుసు కోవాలని.. ఒకవేళ తన తప్పు ఉందని తేలితే.. రాజకీయాల నుంచే శాశ్వతంగా తప్పుకుంటానని తేల్చిచెప్పారు. అన్ని ఆధారాలు తన వద్ద ఉన్నాయన్న ఆయన.. వాటిని ఎస్పీకి ఇచ్చి విచారణ చేయమని కోరతానని చెప్పారు. అన్ని విషయాలను సీఎం దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు. దీంతో వైసీపీలో తీవ్ర క‌ల‌క‌లం రేగింది. బాలినేనికి వ్య‌తిరేక వ‌ర్గంపై తీవ్ర‌స్తాయిలో చ‌ర్చ జ‌రుగుతోం ది.

క‌ట్ చేస్తే.. ఈ వివాదం తెర‌మీదికి వ‌చ్చి 24 గంట‌లు కూడా గ‌డ‌వ‌క‌ముందే.. నెల్లూరు రూర‌ల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి తెర‌మీదికి వ‌చ్చారు. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తరహాలోనే తనకూ ఇంటిపోరు తప్పడం లేదని శ్రీధర్‌రెడ్డి.. వాపోయారు. నెల్లూరు జిల్లాకు చెందిన వైసీపీ ముఖ్యనేతలు వారి నియోజకవర్గాల్లో కాకుండా తన నియోజకవర్గంలో జోక్యం చేసుకుంటున్నారని ఆక్షేపించారు.

“బాలినేని మూడు జిల్లాలకు ఇన్‌ఛార్జి. పార్టీలో కీలక నేత. అంతటి వ్యక్తికి స్థానిక నాయకులు అండగా ఉండాలిగానీ సమస్యగా మారకూడదు. ఆయన ఆవేదన చాలా బాధ కలిగించింది. బాలినేని ఆత్మస్థైర్యం దెబ్బతినేలా పార్టీ నేతలు ఎవరూ ప్రవర్తించకూడదు. నెల్లూరులో నేనూ అలాంటి సమస్యే ఎదుర్కొంటున్నాను. కొంత మంది పార్టీ ముఖ్యనేతలు వారి నియోజకవర్గాల్లో మరోసారి ఎలా గెలవాలో ఆలోచించకుండా ఇతర నియోజకవర్గాల వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నారు. ఇది పార్టీకి మంచిది కాదు” అని కోటంరెడ్డి వాపోయారు. ఈ ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తే.. వైసీపీలో వ‌ర్గ పోరు ఏ రేంజ్‌లో ఉందో అర్దం అవుతోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.