ఏబీవీని వీడ‌ని ఏపీ స‌ర్కారు.. మ‌రోసారి స‌స్పెన్ష‌న్ వేటు

ఏపీ స‌ర్కారు.. సీనియ‌ర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంక‌టేశ్వ‌ర‌రావును వెంటాడుతూనే ఉంది. ఏబీ వెంకటేశ్వరరావుపై మరోసారి సస్పెన్షన్ వేటు వేసింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో సస్పెన్షన్ తొలగించిన ఏపీ ప్రభుత్వం ఇటీవల పోస్టింగ్ ఇచ్చింది. ప్రింటింగ్ అండ్ స్టేషనరీ డీజీగా వైసీపీ ప్రభుత్వం ఆయనను నియమించింది. అయితే ఇప్పుడు సర్వీసు నిబంధనలకు విరుద్ధంగా ఏబీ వెంకటేశ్వరరావు క్రమశిక్షణారహిత వ్యాఖ్యలు చేశారని పేర్కొంటూ ప్రభుత్వ సీఎస్ సమీర్ శర్మ మరోసారి సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేశారు.

ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారనే అభియోగంపై ఆయన్ను సస్పెండ్‌ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు ఆయనపై ఉన్న సస్పెన్షన్‌ను ఎత్తివేయడంతో.. మే 19న సాధారణ పరిపాలనశాఖకు ఏబీవీ రిపోర్టు చేశారు. దీంతో ప్రింటింగ్‌ అండ్‌ స్టేషనరీ కమిషనర్‌ బాధ్యతలు పర్యవేక్షిస్తున్న జి.విజయ్‌కుమార్‌ను రిలీవ్‌ చేసిన ప్రభుత్వం ఆ స్థానంలో ఏబీవీని నియమించింది. తాజాగా మరోసారి ఏబీవీని సస్పెండ్‌ చేస్తూ ఆదేశాలు జారీ చేయడం చర్చనీయాంశంగా మారింది.

ఏబీ వెంకటేశ్వరరావు తెలుగుదేశం హయాంలో ఇంటెలిజెన్స్ చీఫ్‌గా వ్యవహరించారు. ఆ సమయంలో సర్వీస్ నిబంధలను ఉల్లంఘించారనే అభియోగాలతో వైసీపీ ప్రభుత్వం ఆయనను సస్పెండ్ చేసింది. ప్రభుత్వ చర్యను తప్పుబడుతూ ఏబీ వెంకటేశ్వరరావు హైకోర్టుని ఆశ్రయించారు. అయితే ఆయన సస్పెన్షన్‌ను ఎత్తివేస్తూ ఏపీ హైకోర్టు తీర్పు ఇవ్వగా.. ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. కానీ హైకోర్టు తీర్పు విషయంలో జోక్యం చేసుకోవడానికి సుప్రీం కోర్టు నిరాకరించింది.

ఈ కేసు విషయంలో హైకోర్టు ఉత్తర్వులే అమలవుతాయని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. దీంతో ఆయ‌న‌ను ప్ర‌భుత్వం ప్రాధాన్యం లేని ప్రింటింగ్‌, స్టేష‌న‌రీ విభాగంలో నియ‌మించింది. ఇప్పుడు ఇక్క‌డ కూడా ఆయ‌న‌ను స‌స్పెండ్ చేయ‌డం గ‌మ‌నార్హం. దీంతో ఈ విష‌యం.. ఉన్న‌తాధికారుల మ‌ధ్య తీవ్ర చ‌ర్చ‌నీయాంశంగా మారింది.