పీలేరులో మాజీ సీఎం కిర‌ణ్ త‌మ్ముడికి ఈ సారి ఛాన్స్‌..!

రాజ‌కీయాల్లో మార్పు స‌హ‌జం. అది ఎప్పుడు ఎలాగైనా.. మారే అవ‌కాశం ఉంటుంది. ఇప్పుడు ఇలాంటి చ‌ర్చే.. ఉమ్మ‌డి చిత్తూరు జిల్లాలోని పీలేరు నియోజ‌క‌వ‌ర్గంలో జోరుగా సాగుతోంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఇక్క‌డ మార్పు ఖాయ‌మ‌నే మాట వినిపిస్తోంది. దీనికి కార‌ణం.. మాజీ ముఖ్య‌మంత్రి, పీలేరు మాజీ ఎమ్మెల్యే.. న‌ల్లారి కిర‌ణ్‌కుమార్ రెడ్డి.. ఇక్క‌డ ప్ర‌జ‌ల నుంచి అభిప్రాయాలు తెలుసుకోవ‌డంతోపాటు.. స్థానిక కాంగ్రెస్ నేత‌ల నుంచి నివేదిక‌లు కూడా తెప్పించుకున్నార‌ని చ‌ర్చ జ‌రుగుతోంది.

ఇటీవ‌ల ఓ కార్య‌క్ర‌మం కోసం.. సొంత ప‌నిపై వ‌చ్చిన కిర‌ణ్‌కుమార్‌.. స్థానికంగా ఉన్న కాంగ్రెస్ నాయ‌కుల తోనూ.. త‌న‌కు ఆత్మీయంగా ఉన్న కొంద‌రితోనూ ఆయ‌న చ‌ర్చించారు. ఈ సంద‌ర్భంగానే వారి మ‌ధ్య రాజ‌కీయాలుచ‌ర్చ‌కు వ‌చ్చిన‌ట్టు తెలిసింది. అదేస‌మ‌యంలో ఇక్క‌డ జ‌రుగుతున్న అభివృద్ధి ప‌నులు.. ప్ర‌స్తుత వైసీపీ ఎమ్మెల్యే సీనియ‌ర్ నాయ‌కుడు చింత‌ల రామ‌చంద్రారెడ్డి వ్య‌వ‌హారంపైనా.. కిర‌ణ్ వారితో చ‌ర్చించిన‌ట్టు స‌మాచారం.

ఈ క్ర‌మంలో మెజారిటీ నాయ‌కులు.. కొంద‌రు అభిమానులు కూడా పీలేరులో ఈ ద‌ఫా.. చింత‌ల ఓట‌మి రాసిపెట్టుకోవ‌చ్చ‌ని చెప్పారట‌. అంతేకాదు.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో కిర‌ణ్ కుమార్ సోద‌రుడు.. కిశోర్ కుమార్ రెడ్డిని గెలిపించేందుకు ఇక్క‌డి ప్ర‌జలు సిద్ధంగా ఉన్న‌ట్టు చెప్పారు. వాస్త‌వానికి కిశోర్ కుమార్ ప్ర‌స్తుతం టీడీపీలో ఉన్నారు. అయితే.. పార్టీలోనూ.. ప్ర‌జ‌ల్లోనూ ఆయ‌న యాక్టివ్‌గానే ఉంటున్నారు. జిల్లాలో వైసీపీ మంత్రుల దూకుడును ఆయ‌న అడుగ‌డుగునా అడ్డుకుంటున్నారు.

దీనికి తోడు.. టీడీపీ నేత‌ల‌ను ఆయ‌న ద‌గ్గ‌ర‌కు చేర్చ‌కుంటున్నార‌ని.. కిర‌ణ్‌కుమార్‌రెడ్డి స‌న్నిహితులు.. ఆయ‌న‌కు చెప్పారు. ఈ ప‌రిణామాల‌ను బ‌ట్టి.. వైసీపీని ఈ ద‌ఫా బ‌లంగా ఆయ‌న ఢీ కొట్టే అవ‌కాశం ఉంద‌ని చెప్పిన‌ట్టు తెలిసింది. గ‌త ఎన్నిక‌ల్లో కేవ‌లం 7 వేల మెజారిటీ తేడాతోన చింతల గెలిచార‌ని. అయితే.. ఈ ద‌ఫా .. కిశోర్ కుమార్ క‌నీసం 10 వేల ఓట్ల మెజారిటీతో విజ‌యం ద‌క్కించుకుంటార‌ని ఆశాభావం వ్య‌క్తం చేశార‌ట‌. ఈ ప‌రిణామాల ప‌ట్ల ఒకింత ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేసిన కిర‌ణ్‌కుమార్‌రెడ్డి.. అవ‌స‌ర‌మైతే.. త‌న సొద‌రుడిని గెలిపించుకునేందుకు తాను కూడా ప్ర‌య‌త్నిస్తాన‌ని చెప్ప‌డం విశేషం. మ‌రి ఏం చేస్తారో చూడాలి.