మాజీ సీఎం న‌ల్లారి రీఎంట్రీ.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీ?

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి త్వ‌ర‌లోనే మ‌ళ్లీ ఏపీలో అడుగు పెట్ట‌నున్నారా? ఆయ‌న వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఏపీ నుంచే పోటీ చేయ‌నున్నారా? అంటే.. ఔన‌నే అంటున్నారు ఆయ‌న స‌హ‌చ‌రులు.. కాంగ్రెస్ పార్టీ నాయ‌కులు.. తాజాగా ఆయ‌న చిత్తూరు జిల్లా కలికిరిలో ప‌ర్య‌టించారు. కలికిరి లో అందరినీ పలకరించిన ఆయన ‘త్వరలో వస్తా.. అందరితో కలుస్తా.. అందుబాటులో ఉంటా.. అప్పుడు అందరం కూర్చోని మాట్లాడుకుందాం’ అని చెప్పారు.

ఈ వ్యాఖ్య‌లే ఇప్పుడు..ఇక్క‌డ రాజ‌కీయంగా కాక రేపుతున్నాయి. 2011-12 మ‌ధ్య ఉమ్మ‌డి ఏపీ సీఎంగా బాద్యతలు చేపట్టిన కిర‌ణ్ కుమార్‌.. స‌మైక్య రాస్ట్రం కోసం.. తీవ్రంగా శ్ర‌మించారు. తెలంగాణ విభ‌జ‌న జ‌రిగితే.. నీటి వివాదాలు..ఇరు రాష్రాల‌ను పాక్‌-భార‌త్ మాదిరిగా మారుస్తాయ‌ని పేర్కొన్నారు. ఈ క్ర‌మంలోనే తెలంగాణ‌కు వ్య‌తిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేసి పంపించారు. అయిన‌ప్ప‌టికీ.. కేంద్రం ఈ తీర్మానాన్ని ప‌క్క‌న పెట్టి.. రాష్ట్రాన్ని విభ‌జించింది. దీంతో కాంగ్రెస్‌ నుంచి కిర‌ణ్ బ‌య‌ట‌కు వ‌చ్చారు.

2014 ఎన్నిక‌ల స‌మ‌యంలో స‌మైక్యాంధ్ర పార్టీని స్థాపించారు. అయిన‌ప్ప‌టికీ.. తాను పోటీకి దూరంగా ఉండి ఆ ఎన్నిక‌ల్లో 70 స్థానాల్లో అభ్య‌ర్థుల‌ను పోటీకి నిల‌బెట్టారు. అయితే..ఒక్క చోట కూడ‌.. పార్టీ విజ‌యం ద‌క్కించుకోలేదు. త‌ర్వాత‌.. మౌనంగా ఉన్న కిర‌ణ్‌.. 2020లో తిరిగి కాంగ్రెస్ గూటికి చేరిపోయారు. ప్ర‌స్తుతం కాంగ్రెస్ నాయ‌కుడిగానే ఉన్నా.. ఎక్క‌డా యాక్టివ్‌గా మాత్రం క‌నిపించ‌డం లేదు. పార్టీ త‌ర‌ఫున దేశ‌వ్యాప్తంగా ఇటీవ‌ల నిర‌స‌న తెలిపినా.. కిర‌ణ్ క‌నిపించ‌లేదు.

అయితే.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆయ‌న తిరిగి ఏపీ నుంచి పోటీ చేస్తార‌నే వాద‌న వినిపిస్తోంది.ఉమ్మ‌డి చిత్తూరు జిల్లా పీలేరు నుంచి వ‌రుస విజ‌యాలు అందుకున్న కిర‌ణ్‌కుమార్‌రెడ్డి వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఇక్క‌డ నుంచే పోటీ చేసే అవ‌కాశం ఉందని తెలుస్తోంది. అయితే.. ఇప్పుడున్న ప‌రిస్థితిలో కాంగ్రెస్ పుంజుకునే ప‌రిస్థితి లేదు కాబట్టి.. వ్య‌క్తిగ‌త హోదాలోనే ఆయ‌న గెలుపు కోసం ప్ర‌య‌త్నాలు చేయాల్సి ఉంటుంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.