మహారాష్ట్రలో అధికార కూటమిలోని ప్రధాన భాగస్వామి శివసేనలో అసమ్మతి భగ్గుమంది. మంత్రి ఏక్నాథ్ షిండే తిరుగుబాటుతో.. ఉద్ధవ్ ఠాక్రే సర్కార్ పతనం అంచున నిలిచింది. నరేంద్ర మోడీ ప్రధానిగా, అమిత్ షా కేంద్ర హోం శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి పలు రాష్ట్రాల్లో బీజేపీయేతర ప్రభుత్వాలు కుప్పకూలాయి. బిహార్, మధ్యప్రదేశ్, కర్ణాటక సహా ఇలా ఎన్నో ఉన్నాయి. ఈ జాబితాలో ఇప్పుడు మహారాష్ట్ర కూడా చేరిపోతోందనే వాదన బలంగా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో మోడీ-షాల పదవీ దాహం.. ప్రాంతీయ పార్టీల ప్రభుత్వాలను కుప్ప కూల్చుతోందనే విమర్శలు వస్తున్నాయి.
ఎక్కడెక్కడ ఎలా ఎలా?!
నరేంద్ర మోడీ 2014లో తొలిసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా.. పలు రాష్ట్రాల్లో బీజేపీ యేతర ప్రభుత్వాలు కుప్పకూలాయి. ఫిరాయింపు ఎమ్మెల్యేల మద్దతుతో చాలా చోట్ల బీజేపీ అధికారం చేపట్టింది. కొన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అత్యధిక స్థానాలు చేజిక్కించుకుని అతిపెద్ద పార్టీగా అవతరించినా.. బీజేపీ చక్రం తిప్పి, తానే అధికారం చేపట్టిన సందర్భాలూ లేకపోలేదు. దీంతో ప్రజాస్వామ్యానికి, ప్రజలు ఇచ్చిన మ్యాండేట్‌కు విలువ లేకుండా పోవడం గమనార్హం.
బిహార్: 2015 శాసనసభ ఎన్నికల అనంతరం నీతీశ్‌కుమార్ నేతృత్వంలో జేడీ(యూ), ఆర్జేడీ, కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటైంది. ఈ కూటమిలో చీలికలు తెచ్చేందుకు బీజేపీ గట్టిగానే కృషి చేసింది. ఫలితంగా 2017లో జేడీ(యూ) కూటమి నుంచి బయటకు వచ్చి, బీజేపీతో చేతులు కలిపింది. దీంతో నీతీశ్ నేతృత్వంలోనే జేడీ(యూ)-బీజేపీ సంకీర్ణ సర్కారు ఇక్కడ కొలువుదీరింది. లాలూ ప్రసాద్ పార్టీ ప్రతిపక్షంలో చేరిపోయింది.
అరుణాచల్‌ప్రదేశ్: ఈశాన్య రాష్ట్రం అరుణాచల్ ప్రదేశ్‌లో 2014లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో మొత్తం 60 సీట్లకు గాను కాంగ్రెస్ పార్టీ 42 స్థానాల్లో గెలుపొంది అతిపెద్ద పార్టీగా అవతరించింది. అప్పుడు కేవలం 11 స్థానాల్లోనే బీజేపీ అభ్యర్థులు విజయం సాధించారు. ఈ క్రమంలోనే 2016లో ముఖ్యమంత్రి పెమా ఖండూ సహా మొత్తం 41 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆ పార్టీ నుంచి ఫిరాయించి, బీజేపీ నేతృత్వంలోని ‘నార్త్-ఈస్ట్ డెమోక్రటిక్ అలయెన్స్’కు చెందిన పీపుల్స్ పార్టీ ఆఫ్ అరుణాచల్‌ప్రదేశ్‌లో చేరారు. తర్వాత వారంతా బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో ఇక్కడ బీజేపీ సర్కారు కొలువుదీరింది.
మధ్యప్రదేశ్: 2018 అసెంబ్లీ ఎన్నికల అనంతరం కాంగ్రెస్ పార్టీ కమల్‌నాథ్ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటు చేసింది. పార్టీ ఎమ్మెల్యేలు, స్వతంత్రులు కలిపి మొత్తం 121 మంది సభ్యుల మద్దతును ఆయన కూడగట్టారు. అయితే, జ్యోతిరాదిత్య సింధియా సహా మొత్తం 26 మంది కాంగ్రెస్ శాసనసభ్యులు తిరుగుబాటు ప్రకటించారు. దీంతో 2020 మార్చిలో కాంగ్రెస్ సర్కారు కుప్పకూలి, శివరాజ్‌సింగ్ చౌహాన్ నేతృత్వంలో బీజేపీ సర్కారు ఏర్పడింది.
మణిపుర్: ఈ శాన్య రాష్ట్రం మణిపూర్‌లో 2017లో ఇక్కడ జరిగిన ఎన్నికల్లో మొత్తం 60 స్థానాలకు గాను కాంగ్రెస్ 28 చోట్ల విజయం సాధించి, అతిపెద్ద పార్టీగా అవతరించింది. 21 స్థానాల్లో మాత్రమే గెలుపొందిన బీజేపీని ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందిగా గవర్నర్ నుంచి పిలుపు వచ్చింది. 9 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల మద్దతుతో బీజేపీ నాడు అధికారం చేపట్టింది.
గోవా: ఇక్కడ 2017 ఎన్నికల్లో 40 సీట్లకుగాను కాంగ్రెస్ 17 స్థానాలు గెలిచి అతిపెద్ద పార్టీగా అవతరించింది. బీజేపీ కేవలం 13 స్థానాలకే పరిమితమైంది. అయినప్పటికీ, ఇతర పార్టీలకు చెందిన పది మంది సభ్యులు, ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యే మద్దతుతో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ క్రమంలోనే 2019లో కాంగ్రెస్ నుంచి మరో 15 మంది శాసనసభ్యులు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో ఇక్కడ బీజేపీ సర్కారు ఏర్పడింది.
కర్ణాటక: 2018 ఎన్నికల్లో ఏ పార్టీకీ ఈ రాష్ట్రంలో స్పష్టమైన ఆధిక్యత లభించలేదు. 222 అసెంబ్లీ స్థానాలకు గానూ బీజేపీకి అత్యధికంగా 104 సీట్లు, కాంగ్రెస్‌కు 80, జేడీ(ఎస్)కు 37 సీట్లు వచ్చాయి. బీజేపీ నేత యడియూరప్ప ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా, విశ్వాస పరీక్షలో నెగ్గలేదు. దీంతో కుమారస్వామి నేతృత్వంలో కాంగ్రెస్-జేడీ(ఎస్) సంకీర్ణ ప్రభుత్వం కొలువుదీరింది. 2019లో కాంగ్రెస్, జేడీ(ఎస్)ల నుంచి 16 మందిని తమవైపు తిప్పుకొని బీజేపీ మళ్లీ అధికార పగ్గాలు చేపట్టింది.
ఉత్తరాఖండ్: దేవ భూమిగా ప్రసిద్ధి చెందిన ఈ రాష్ట్రంలో 2016 మార్చిలో 9 మంది శాసనసభ్యులు ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకోవడంతో నాడు హరీశ్ రావత్ నేతృత్వంలోని కాంగ్రెస్ సర్కారు సంక్షోభంలో పడింది. దీంతో అక్కడ రాష్ట్రపతి పాలన విధించారు. సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని ప్రభుత్వాన్ని పునఃస్థాపించింది. బీజేపీ ప్రయత్నాలు ఫలించలేదు.
జమ్ముకశ్మీర్: ఇక్కడ 87 స్థానాలకు 2014లో జరిగిన ఎన్నికల్లో ఏ పార్టీకీ స్పష్టమైన మెజార్టీ లభించలేదు. పీడీపీ 28 సీట్లు తెచ్చుకోగా, బీజేపీ 25 స్థానాలు సాధించింది. పార్టీల మధ్య సయోధ్య కుదరక ప్రభుత్వం ఏర్పాటు కాలేదు. ఎట్టకేలకు పీడీపీతో కలిసి అధికారం పంచుకునేందుకు బీజేపీ ముందుకొచ్చింది. పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ నేతృత్వంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటైంది. 2018లో బీజేపీ మద్దతు ఉపసంహరించుకోవడంతో ముఫ్తీ సర్కారు కుప్పకూలింది.
This post was last modified on June 23, 2022 9:36 am
వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు ఇక జైలు ఊచలు లెక్కపెట్టక తప్పేలా లేదు. ఎందుకంటే...తన వద్ద డ్రైవర్ గా పనిచేస్తున్న సుబ్రహ్మణ్యం అనే…
ప్రస్తుతం మంచి ఊపులో షూటింగ్ జరుపుకుంటున్న బాలకృష్ణ - గోపీచంద్ మలినేని మూవీలో ముందు తీసుకున్న హీరోయిన్ నయనతార. ఇది…
స్కూల్లో పాఠాలు నేర్చుకోవాల్సిన, పరీక్షలు రాయాల్సిన వయసులో ఐపీఎల్‌లో వైభవ్ సూర్యవంశీ అనే కుర్రాడు ఎలా చెలరేగిపోతున్నాడో చూస్తున్నాం. సినీ…
టాలీవుడ్ బాక్సాఫీస్ కు ఏప్రిల్ అంటే చాలా స్పెషల్. ఎందుకంటే చరిత్రలో చెప్పుకోదగిన ఎన్నో బ్లాక్ బస్టర్లు ఈ నెలలోనే…
కొన్ని కథలు ముగిసిపోవడాన్ని ప్రేక్షకులు అంతగా ఇష్టపడరు. వాటికి కొనసాగింపు ఉంటేనే బాగుంటుందని ఆశిస్తారు. వాటి మేకర్స్ కూడా ఆ…
నిందితులను పోలీసులు పబ్లిక్‌లో కొట్టడం వంటి ఘటనలు తరచుగా జరుగుతున్నాయి. అటువంటి సందర్భాల్లో అలా కొట్టడం మానవ హక్కుల ఉల్లంఘన…