రాష్ట్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘అమ్మ ఒడి’ పథకం నిధులను ఈ నెల 27న విడుదల చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. అయితే.. ఈ పథకం అందుకుంటున్న వారిలో.. ఈ ఏడాది లక్ష మందికి పైగా లబ్ధిదారులను ప్రభుత్వం అనర్హులుగా తేల్చింది..! దీంతో లక్ష మంది అమ్మలకు ‘అమ్మ ఒడి’ పథకం దూరం అయిపోయింది.
నవరత్నాల్లో ప్రతిష్టాత్మక పథకమైన “అమ్మఒడి” పథకం నిధులను ఈ నెల 27న విడుదల చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. అయితే.. ఈ పథకం కింద లబ్ధిదారుల ఖాతాల్లో రూ.13 వేలు మాత్రమే ప్రభుత్వం జమచేయనుంది. అమ్మఒడి కోసం ఈ ఏడాది బడ్జెట్‌లో రూ.6,500 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది.
ఇదిలా ఉంటే.. ఈ పథకం అందుకుంటున్న లబ్ధిదారుల్లో ఏ ఏడాది భారీగా కోత విధించింది సర్కారు. ఏకంగా.. లక్ష మందికిపైగా లబ్ధిదారులను అనర్హులుగా తేల్చింది. పాఠశాలలకు గైర్హాజరు కావడంతో 51 వేల మందిని ఈ పథకం నుంచి తప్పించిన సర్కారు.. వేర్వేరు కారణాలతో మరో 50 వేల మందికి అమ్మఒడి నిలిపివేసింది.
“విద్యుత్తు వాడకం నెలకు 300యూనిట్లు దాటితే అమ్మఒడి పథకం అందదు. నవంబరు 8 నుంచి ఏప్రిల్ 30 వరకు విద్యార్థి హాజరు 75శాతం లేకపోయినా.. అమ్మఒడి ప్రయోజనం పొందలేరు. బియ్యం కార్డు కొత్తది ఉండాలి. కొత్త జిల్లాల నేపథ్యంలో ఆధార్‌లో జిల్లా పేరును మార్చుకోవాలి. బ్యాంకు ఖాతాలకు ఆధార్ లింకు చేసుకోవడం, బ్యాంకు ఖాతాలు పని చేస్తున్నాయో లేవో విద్యార్థుల తల్లిదండ్రులు తనిఖీ చేసుకోవాలి” అంటూ.. ఈ పథకానికి సంబంధించిన అర్హతలను ఇటీవల పాఠశాల విద్యాశాఖ జారీ చేసింది.
ఈ నిబంధనల ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా లక్షమందికి పైగా విద్యార్థులు అమ్మఒడి పథకానికి అనర్హులయ్యారు. నిజానికి మహిళా ఓటు బ్యాంకుపై భారీగా ఆశలు పెట్టుకున్న సీఎం జగన్.. ఇలాంటి నిర్ణయం తీసుకోవడం పట్ల.. వైసీపీలోనే విస్మయం ఎదురవుతోంది. ఎందుకంటే.. గత ఎన్నికల సమయంలో ‘అమ్మ ఒడి’ ప్రచారానికే మహిళలు వైసీపీ వైపు మొగ్గు చూపారనే విశ్లేషణలు వున్నాయి. అర్ధరాత్రి వరకు కూడా పోలింగు బూతుల ముందు నిలబడి మరీ మహిళలు ఓటేశారు. ఇప్పుడు వారిని దూరం చేసుకుంటున్నారనే వాదన సొంత పార్టీలోనే వినిపిస్తోంది. మరి జగన్ ఏమంటారో చూడాలి. మహిళలు మాత్రం ఈ నిర్ణయం పై ఫైర్ అవుతున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates