ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ వాతావరణం చాలా విచిత్రంగా మారిపోయింది. యావత్ దేశం ఉద్రిక్తతలకు కారణమైన అగ్నిపథ్ పథకంపై నోరెత్తటానికి అధికార వైసీపీతో పాటు ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశంపార్టీ, జనసేన అధినేతలు ఏమాత్రం ఇష్టపడటంలేదు. దాదాపు 13 రాష్ట్రాల్లో పథకం తాలూకు ప్రకంపనలు స్పష్టంగా కనబడుతున్నాయి. దాదాపు ఎనిమిది రాష్ట్రాల్లో ఆందోళనకారులు పథకానికి వ్యతిరేకంగా ఆకాశమేహద్దుగా చెలరేగిపోతున్నారు.
బీహార్, తెలంగాణా, హర్యానా, ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో రైల్వే స్టేషన్లపై దాడులుచేసి మంటలుపెట్టేశారు. ఆస్తులను ధ్వంసంచేశారు. కొన్ని వేలమందిని రైల్వేపోలీసులు అదుపులోకి తీసుకోవటం, అరెస్టులు చేశారు. కేంద్రప్రభుత్వం కూడా ఈ ఆందోళనలను చాలా సీరియస్ గా తీసుకున్నది. ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్ పార్టీతో సహా చాలా పార్టీలు అగ్నిపథ్ పథకాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. పథకాన్ని తాము ఎందుకు వ్యతిరేకిస్తున్నాయో కూడా స్పష్టంగా ప్రకటించాయి.
ఈ నేపధ్యంలోనే అందరి దృష్టి ఆంధ్రప్రదేశ్ పైన పడింది. అయితే విచిత్రం ఏమిటంటే అధికార వైసీపీ అధినేత, సీఎం జగన్మోహన్ రెడ్డి గానీ లేదా ప్రతిపక్షాల అధినేతలు చంద్రబాబునాయుడు, పవన్ కల్యాణ్ కానీ అసలు పథకంగురించే నోరిప్పటంలేదు. పథకం మంచి చెడులపై మాట్లాడేందుకు ఎందుకు వెనకాడుతున్నారో ఎవరికీ అర్ధం కావటంలేదు. పథకం ఉద్దేశ్యం మంచిదే అనుకుంటే కేంద్రం తెచ్చిన అగ్నిపథ్ పథకం మంచిదనే చెప్పవచ్చు.
లేకపోతే ప్రతిపక్షాలు ఆరోపణలు, విమర్శలు చేస్తున్నట్లు పథకం వల్ల దేశానికి, యువతకు చాలా నష్టాలు, కష్టాలు వస్తాయని అనుకుంటే ఆ విషయాన్నే చెప్పవచ్చు. అంతేకానీ అసలు పథకం గురించి మాట్లాడటానికి ఇష్టపడకపోవటంలోనే అధినేతల వైఖరి చాలా విచిత్రంగా కనిపిస్తోంది. ఏ పథకం అమలులో అయినా మంచీ చెడ్డా రెండూ ఉంటాయని అందరికీ తెలిసిందే. మంచిని మంచిగా చెడును చెడుగా చూసేట్లయితే అగ్నిపథ్ పథకం గురించి పార్టీల అధినేతలు మాట్లాడటంలో తప్పేలేదు. కాకపోతే పథకం గురించి వ్యతిరేకంగా మాట్లాడితే నరేంద్రమోడికి ఎక్కడ కోపం వస్తుందో అని వెనకాడుతున్నట్లున్నారు. ఇదే సమయంలో పథకం మంచిదే అని చెబితే జనాలకు దూరమవుతామని భయపడుతున్నట్లుంది.