అటువైపు నుంచి న‌రుక్కొస్తున్న రాజు గారు

త‌న కామెంట్లు, చ‌ర్య‌ల‌తో వైసీపీలో అగ్గి రాజేసి, అనంత‌రం ఆ పార్టీ పెద్ద‌ల నుంచి షోకాజ్ నోటీసులు అందుకున్న పార్టీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఇంకా ఆ దూకుడును కొన‌సాగిస్తున్నారు.

పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులపై ఇటీవల చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని కోరిన నేపథ్యంలో ఆయన తక్షణమే స్పందించడంతో పాటుగా వారం రోజులు గడువు ఇచ్చినా నోటీసు అందిన మర్నాడే సంజాయిషీ పంపించారు. పార్టీ పేరుపైనే అభ్యంతరం చెప్తూ నోటీస్‌కు రఘురామకృష్ణంరాజు సమాధానం ఇచ్చారు. దానికి కొన‌సాగింపుగా ఆయ‌న తాజాగా ఢిల్లీ చేరుకున్నారు.

వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ స‌న్నిహితుడు అయిన‌ ఎంపీ విజయసాయి రెడ్డి తనకు షోకాజ్‌ నోటీస్‌ ఇచ్చినందున ఆయ‌న‌ హోదాతో పాటు వైసీపీ అస్థిత్వాన్నే ప్రశ్నిస్తూ నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఘాటు రిప్లై ఇచ్చారు. పార్టీ పేరు వైఎస్సార్ కాంగ్రెస్సా యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీయా? అని ప్రశ్నించారు. జాతీయ ప్రధానకార్యదర్శిగా పేర్కొంటూ విజయసాయిరెడ్డి నోటీసు ఇవ్వడంపైనా ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు.

కేంద్ర ఎన్నికల సంఘం వద్ద రాష్ట్ర పార్టీగా గుర్తింపు ఉన్న దానికి జాతీయ ప్రధాన కార్యదర్శి ఎలా ఉంటారంటూ విజయసాయిరెడ్డికి సూటిగా ప్రశ్నించారు. తమది యువజన శ్రామిక రైతు కాంగ్రెస్‌ పార్టీ అని, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ అనే పార్టీ వేరే వాళ్లదని, వైఎస్‌ఆర్‌ అనే పేరు ఉపయోగించవద్దని గతంలోనే ఎలక్షన్‌ కమిషన్‌ స్పష్టం చేసిందని లేఖలో పేర్కొన్నారు.

అసలు పార్టీలో ఈసీ నిబంధనల ప్రకారం క్రమశిక్షణా కమిటీనే లేదన్నారు. అలాంటిది విజయసాయిరెడ్డి తనకు షోకాజ్‌ నోటీస్‌ ఇవ్వడం చట్టవిరుద్ధమంటూ ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఈసీకీ ఫిర్యాదు చేశారు.

ఇలా లేఖ‌, మీడియాలో మాట్లాడుతూ అనేక అంశాల‌ను ప్ర‌స్తావించిన ఎంపీ రఘురామ కృష్ణంరాజు హ‌ఠాత్తుగా ఢిల్లీకి చేర‌డం స‌హ‌జంగానే ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. త‌ను ప్ర‌స్తావించిన అంశాలన్నింటిని వివరించేందుకు ఆయ‌న‌ ఈసీని కలవనున్నారని స‌మాచారం. దీంతోపాటుగా బీజేపీ పెద్దలు, కేంద్ర మంత్రులను కూడా కలిసి రాష్ట్రంలో జరుగుతున్న పాలన స‌హా వివిధ విధానాలు, నిర్ణ‌యాల‌ను రఘురామకృష్ణంరాజు వివరించనున్నట్లు తెలుస్తోంది.

అయితే, ఓ వైపు వైసీపీ అధిష్టానం ఇచ్చిన షోకాజ్ నోటీస్ ఇచ్చి ఆయ‌న్ను దారిలోకి తెచ్చుకోవాల‌ని చూస్తుంటే ఎంపీ రఘురామకృష్ణంరాజు మాత్రం మ‌రింత దూకుడ‌గా ముందుకు వెళ్తుండ‌టం స‌హ‌జంగానే వైసీపీకి ఇర‌కాటంగా మారింది.