నువ్వు మీ అన్న‌లా సంపాయించుకోవ‌డానికేనా షర్మిల?

ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ఆర్‌ అరాచకాలను తెలంగాణ ప్రజలు మర్చిపోలేదని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. షర్మిల చెప్పే సినిమా డైలాగ్‌లను ప్రజలు పట్టించుకోరని ఆయన ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పై వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత షర్మిల చేసిన విమర్శలకు మంత్రి స్పందించారు. షర్మిలకు దమ్ముంటే నాపై పోటీచేసి గెలవాలని పువ్వాడ సవాల్ విసిరారు. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా పరిపాలన సాగుతోందన్నారు.

వైఎస్‌ హయాంలో భూములెవరు కబ్జా చేశారో అందరికీ తెలుసునని, నేను ఉత్త పుణ్యానికి మంత్రి అయ్యాని పువ్వాడ పేర్కొన్నా రు. మీ అన్న, నాన్నలా డబ్బులు తీసుకొని ఎమ్మెల్యే టికెట్లు, మంత్రి పదవులివ్వడం కేసీఆర్‌కు తెలీదని పువ్వాడ నిప్పులు చెరిగారు. ఏపీలో నీకు అవ‌కాశం లేక‌.. తెలంగాణ‌కు వ‌చ్చి.. ప్రాధేయ ప‌డుతున్నావ‌ని విమ‌ర్శించారు.
అన్న నిన్ను ఛీత్క‌రించాడు.. ఇక్క‌డి ప్ర‌జ‌లు మాత్రం నెత్తిన పెట్టుకోవాలా? ఏం చేశావ‌ని నెత్తిన పెట్టుకోవాలి? ఎందుకు పెట్టుకోవాలి? అస‌లు నీకు రాజ‌కీయాలు ఎందుకు? నువ్వు కూడా మీ అన్న‌లా సంపాయించుకోవ‌డానికేనా? అని నిప్పులు చెరిగారు.

ఏం జ‌రిగిందంటే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం వందలాది మంది యువకులు బలిదానాలు చేసుకుంటే.. ఆవిర్భావం తర్వాత మాత్రం కేవలం కేసీఆర్ కుటుంబమే భోగాలు అనుభవిస్తోందని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల విమర్శించారు. ప్రజాప్రస్థానం పాదయాత్ర ఖమ్మం మీదుగా సాగింది. పాదయాత్రలో భాగంగా నగరంలో ప్రధాన మార్గంలో ప్రజలకు అభివాదం చేశారు. పాత బస్టాండ్ దగ్గర నిర్వహించిన సభలో షర్మిల పాల్గొన్నారు. ఈ క్రమంలో షర్మిల.. ఖాకీ చొక్కా వేసుకుని ఆటో నడుపుతూ కార్యకర్తల్లో ఉత్సాహం నింపారు. ఈ సంద‌ర్భంగా మంత్రి పువ్వాడ‌పైనా.. సీఎం కేసీఆర్‌పైనా ఆమె విమ‌ర్శ‌లు గుప్పించారు.

రాష్ట్రంలో సీఎం కేసీఆర్ మోసం చేయని వర్గంలేదు. 16 వేల కోట్ల రూపాయల మిగులు బడ్జెట్తో ఏర్పడ్డ రాష్ట్రాన్ని అప్పుల మయం చేసిన ఘనత కేసీఆర్దే. ఉమ్మడి రాష్ట్రాన్ని పాలించిన 16 మంది ముఖ్యమంత్రుల కన్నా.. ఒక్క కేసీఆర్ చేసిన అప్పులే ఎక్కువ అని షర్మిల అన్నారు.

టీఆర్ఎస్ బ్యాంకు ఖాతాలో రూ.860 కోట్లు ఉన్నాయి. వడ్డీ రూపంలో ఇప్పటికే రూ.25 కోట్లు వచ్చిందని ఆ పార్టీ చెబుతుంది. మరి పార్టీ దగ్గరే ఇన్ని వందల కోట్లు ఉంటే.. పార్టీ అధ్యక్షుడి దగ్గర, ఆయన కుటుంబ సభ్యుల దగ్గర ఎన్ని వేల కోట్లు ఉన్నాయో ప్రజలు అర్థం చేసుకోవాలి అని వ్యాఖ్యానించారు. పువ్వాడ అవినీతికి కేరాఫ్ అంటూ.. మంత్రిపైనా నిప్పులు చెరిగారు. దీంతో పువ్వాడ రియాక్ట్ అయ్యారు.