దేశంలోనే అత్యంత సంపన్న పార్టీగా బీజేపీ అగ్రస్థానంలో నిలిచింది. రెండో స్థానంలో కాంగ్రెస్ ఉంది. 2020-21 సంవత్సర ఆదాయానికి సంబంధించిన గణాంకాలను అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) విడుదల చేసింది. గతేడాదితో పోలిస్తే పార్టీల ఆదాయం భారీగా తగ్గిందని చెప్పడం గమనార్హం
జాతీయ పార్టీల ఆదాయ వివరాల నివేదికను అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) శుక్రవారం విడుదల చేసింది. 2020-21 సంవత్సరానికి గానూ ఎనిమిది జాతీయ పార్టీలు రూ.1,373.78 కోట్ల ఆదాయాన్ని పొందాయని నివేదిక వెల్లడించింది. ఇందులో ఒక్క భారతీయ జనతా పార్టీ వాటానే 55 శాతమని పేర్కొంది.
రూ.752.33 కోట్లతో బీజేపీ మొదటి స్థానంలో ఉండగా, రూ.285.76 కోట్లతో కాంగ్రెస్ రెండో స్థానంలో ఉంది. 2019-20 ఆర్థిక సంవత్సరంతో పోల్చుకుంటే 79.24 శాతం మేర బీజేపీ ఆదాయం తగ్గింది. అప్పట్లో రూ.3,623 కోట్లు కాగా తాజాగా రూ.752.33 కోట్లు మాత్రమే వచ్చాయి. కాంగ్రెస్ ఆదాయం కూడా అప్పటితో పోల్చితే 58.11 శాతం తగ్గింది.
టీఎంసీ, ఎన్‌సీపీ, బీఎస్పీ, ఎన్పీపీ, సీపీఐ ఆదాయం కూడా భారీగానే తగ్గింది. అన్ని పార్టీల కంటే గరిష్ఠంగా బీజేపీ ఖర్చు చేసింది. సుమారు రూ.566 కోట్ల మేర ప్రచారానికి వెచ్చించింది. రూ.180 కోట్ల ఖర్చుతో కాంగ్రెస్ తరువాతి స్థానంలో ఉంది. తృణమూల్ కాంగ్రెస్ రూ.93 కోట్లు ఖర్చు చేసింది.