కాక రేపుతున్న తెలంగాణ ఎటు చూసిన ఆందోళ‌న‌లే!

ఉద్య‌మాల గ‌డ్డ‌గా పేరొందిన తెలంగాణ‌లో గ‌డిచిన మూడు రోజులుగా అవే ఉద్య‌మాలు సెగ‌లు పుట్టిస్తున్నా యి. పోలీసుల‌కు కంటిపై కునుకు లేకుండా చేస్తున్నాయి. వ‌రుస ఉద్య‌మాల‌తో రాష్ట్రం అట్టుడుకుతోంది. ఒక‌వైపు కాంగ్రెస్‌.. మ‌రోవైపు.. బీజేపీ.. ఇంకో వైపు. నిరుద్యోగుల‌.. మ‌రోవైపు… విద్యార్థులు.. ఇలా.. రాష్ట్రం న‌లుచెర‌గ‌లా.. ఆందోళ‌న‌లు.. నిర‌స‌న‌లు కొన‌సాగుతున్నాయి. కార‌ణాలు ఏవైనా.. రాష్ట్రం ఇప్పుడు.. నిర‌స‌న‌ల‌కు కేంద్రంగా మారిపోయింది.

కాంగ్రెస్ విష‌యాన్ని చూస్తే.. నేష‌న‌ల్ హెరాల్డ్ కేసులో.. పార్టీ అధినేత సోనియా ఆమె కుమారుడు, ఎంపీ.. అగ్ర నేత రాహుల్ గాంధీల‌కు ఈడీ నోటీసులు ఇవ్వ‌డాన్ని నిర‌సిస్తూ.. రాష్ట్ర కాంగ్రెస్ నేత‌లు చేప‌ట్టిన‌.. నిర‌స‌న మార‌ణ హోమానికి దారితీసింది. ప్రైవేటు ఆస్తుల ధ్వంసం. రాజ్‌భవ‌న్ వ‌ద్ద ఉద్రిక్త‌త‌లు.. దాదాపు 200 మంది కాంగ్రెస్ నేత‌లు.. రేవంత్ , రేణుకా చౌద‌రి, భ‌ట్టి విక్ర‌మార్క వంటివారిపై కేసులు న‌మోద‌య్యాయి. అయిన‌ప్ప‌టికీ వీరు ఉద్య‌మాలు ఆప‌లేదు.

బీజేపీ విష‌యానికి వ‌స్తే.. బాస‌ర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు చేస్తున్న నిర‌స‌న‌కు సంఘీభావంగా.. బీజేపీ నాయ‌కులు కూడా ఉద్య‌మించారు. ఈ క్ర‌మంలో రాష్ట్ర వ్యాప్త ధ‌ర్నాలు, రాస్తారోకోలు.. నిర‌స‌నల‌కు పిలుపునిచ్చారు. ఈ క్ర‌మంలో బీజేపీ నాయ‌కులను పోలీసులు అరెస్టులు చేశారు. బాస‌లో అయితే.. బీజేపీ నేత‌ల‌ను పోలీసులు గృహ నిర్బంధాలు చేశారు. దీంతో రాష్ట్రంలోబీజేపీ నేత‌లు ఎక్క‌డిక‌క్క‌డ ఉద్య‌మాల‌కు పిలుపునిచ్చారు. బండి సంజ‌య్ అరెస్టును ఖండిస్తూ.. మ‌రింత తీవ్ర త‌రం చేశారు.

ఇక‌, కేంద్ర ప్ర‌భుత్వం తీసుకువ‌చ్చిన అగ్ని ప‌థ్‌ సైనిక నియామ‌కాల ప‌థ‌కానికి వ్య‌తిరేకంగా దేశ‌వ్యాప్తంగా జ‌రుగుతున్న నిర‌స‌న‌లు.. తెలంగాణ‌ను సైతం అట్టుడికించాయి. అగ్నిపథ్‌ను నిరసిస్తూ యువకులు ఆందోళనతో సికింద్రాబాద్‌లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో రాష్ట్రంలోని పలు రైల్వేస్టేషన్లలో హైఅలెర్ట్‌ ప్రకటించారు. ప్రధానమైన స్టేషన్లలో రైల్వే పోలీసులు భద్రత పెంచారు. రైల్వే పరిధిలోని ఆర్పీఎఫ్‌, జీఆర్పీ నుంచి అదనపు బలగాలను రప్పించారు. సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌కు వెళ్లే పలు మార్గాలను పోలీసులు మూసి వేశారు. ముందు జాగ్రత్తగా ఈ చర్యలు తీసుకున్నారు.

మ‌రోవైపు.. నిర్మల్‌ జిల్లా బాసర ఆర్జీయూకేటీ విద్యాలయంలో నెలకొన్న సమస్యలు, సౌకర్యాల కొరత, సామగ్రి సరఫరాలో యాజమాన్య నిర్లక్ష్యంపై విద్యార్థులు గళమెత్తారు. సుమారు ఆరు వేల మంది విద్యార్థు లు మంగళవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు పరిపాలన భవనం ఎదుట బైఠాయించారు. రెండు రోజుల కిందట విద్యాలయ అధికారులకు సమాచారం ఇచ్చినా స్పందించకపోవడంతో ఆందోళనకు దిగామన్నారు.

మ‌రి సీఎం ఏం చేస్తున్నారు?

రాష్ట్ర వ్యాప్తంగా న‌లువైపులా ఉద్య‌మాలు.. నిర‌స‌న‌లుసాగుతున్న క్ర‌మంలో సీఎం కేసీఆర్ ఏం చేస్తున్నార నే ప్ర‌శ్న‌లు వుత్ప‌న్న‌మ‌వుతున్నాయి. త‌న స్థాయిలో వాటిని నిలువ‌రించే ప్ర‌య‌త్నం చేస్తున్నారా? లేక పోలీసుల‌కే వ‌దిలేశారా? అనే సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయ‌ని మేధావులు అంటున్నారు. ఇప్ప‌టికైనా.. రాష్ట్రంలో జ‌రుగుతున్న మూకుమ్మ‌డి ఉద్య‌మాల‌ను అరిక‌ట్టేలా.. ఉద్య‌మ‌కారులు శాంతించేలా ఆయ‌న ప్ర‌క‌ట‌న చేయాల‌ని కోరుతున్నారు.