కలియుగ ధర్మం అంటే ఇదేమోనో. ఎమ్మెల్సీ అనంతబాబుకు ఏజెన్సీ వాసులు ఎందుకు పాలాభిషేకం అంట. అల్లూరు సీతారామ రాజు జిల్లా, దేవీపట్నం మండలం, ఇందుకూరుపేటలో నిర్వహించిన గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించిన అనంతరం ఈ వైనం చోటుచేసుకుంది. స్థానిక ఆర్ అండ్ బీ ప్రధాన రహదారిపై ఆయన చిత్ర పటానికి పాలాభిషేకం చేయడం ఇప్పుడొక చర్చకు తావిస్తోంది.
దళిత యువకుడు, ఆయన డ్రైవర్ అయిన సుబ్రహ్మణ్యం హత్యకు కారణం అయిన అనంతబాబు ప్రస్తుతం రాజమండ్రి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. కానీ “అనుచరులు మాత్రం ఆయనపై ప్రేమ ఒలకబోస్తున్నారు.. కాదు కాదు పాలు ఒలకబోస్తున్నారు అని రాయాలి..ఇదీ నేటి రాజకీయ పంథా ఎవ్వరూ ఎవ్వరినీ ఏమీ అనకండి.. అనేందుకు సాహసం కూడా చేయకండి” అంటున్నారు సామాజిక వేత్తలు.
ఒక దళిత యువకుడి హత్య రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం అయింది. తానే చంపానని ఎమ్మెల్సీ అనంతబాబు ఒప్పుకున్నారు. పార్టీ నుంచి సస్పెండ్ అయ్యారు కూడా ! కానీ ఆయన అనుచరులు మాత్రం విభిన్న ధోరణిలో ఆయన చిత్ర పటానికి పాలాభిషేకం చేయడం అంటే ఏం అనుకోవాలి.. అంటే ప్రాణం విలువ వీరికి తెలియదా ? లేదా అనంతబాబు హీరోను చేయాలని మరో ప్రయత్నమా ? ఈ కార్యక్రమానికి రంపచోడవరం ఎమ్మెల్యే నాగులాపల్లి ధనలక్ష్మి హాజరుకావడం గమనార్హం. అంటే చావు బతుకుల కొట్లాటలో మన రాజకీయాలు ఎంతగా దిగజారిపోతున్నాయో అర్థం చేసుకునేందుకు ఈ ఒక్క ఘటన చాలు అని సామాజిక వేత్తలు నెత్తీ నోరూ కొట్టుకుంటున్నారు. ఇంతకుమించిన అన్యాయం ఉంటుందా అన్నది వారి ప్రశ్న.