ఏపీలో బీజేపీ బలంగా ఉందని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ వ్యాఖ్యానించారు. ఇప్పుడున్న పరిస్థితిలో పార్టీని బలోపేతం చేస్తే.. వచ్చే ఎన్నికల్లో బీజేపీ 25 స్థానాల్లో విజయం దక్కించుకుంటుందని జోస్యం చెప్పారు. సోమవారం రాజమండ్రిలో మీడియాతో మాట్లాడిన ఉండవల్లి.. బీజేపీపై కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో ముఖ్యమంత్రి అభ్యర్థి విషయంలో జనసేనకు బీజేపీ ఛాన్స్ ఇచ్చే పరిస్థితి లేదని వ్యాఖ్యానించారు. అవసరమైతే.. బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తుందన్న ఉండవల్లి.. దీనికి సంబంధించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
బీజేపీ బలంగా ఉన్నది ఏపీలోనేనని.. కర్ణాటక, యూపీల్లో కాదని ఉండవల్లి వ్యాఖ్యానించారు. “ఏపీలో ఏ పార్టీ నెగ్గినా బీజేపీనే. జగన్ పార్టీ నెగ్గినా, చంద్రబాబు పార్టీ, పవన్ పార్టీ నెగ్గినా బీజేపీతోనే ఉంటాయి. వాళ్ల కు ఓట్లు లేకపోవచ్చు. ఇక్కడ నెగ్గే 25 ఎంపీ సీట్లూ వాళ్లవే” అని ఆయన చెప్పారు. కేసులకు భయపడే చంద్రబాబు మోడీని వ్యతిరేకించట్లేదని మొన్నటివరకూ జగన్ అనేవారని.. ఇప్పుడు చంద్రబాబు కూడా జగన్‌పై అదే ఆరోపణ చేస్తున్నారని.. ఇలా ఇద్దరూ కేంద్రాన్ని ఒక్క మాట కూడా అనట్లేదని అన్నారు.
ఇక పవన్ బీజేపీతోనే కలిసి ఉన్నారని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో 1 శాతం ఓట్లు వచ్చినా.. బీజేపీదే పైచేయి అవుతుందని ఉండవల్లి చెప్పుకొచ్చారు. “ప్రధాన మంత్రి మోడీ వచ్చి.. ఎవరికి ఓటేయమంటే వాళ్లకు వేస్తారు. దీంతో 25 ఎంపీ సీట్లు వాళ్లే తెచ్చుకుంటారు. ఇలాంటప్పుడు.. పదవుల విషయంలో బేరాలెందుకు? పవన్‌కు రాయబారాలెందుకు?” అని ఉండవల్లి వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో రాజకీయాలు మారినా.. నాయకులు మారినా.. కేంద్రంలో మోడీకే.. ఓటేస్తారని చెప్పారు.
ఏపీ సమస్యలపై తాను కేసీఆర్‌తో చర్చించలేదని ఉండవల్లి చెప్పారు. నిజానికి తనకు చర్చించాలనే ఉన్నప్పటికీ.. రాష్ట్ర ప్రభుత్వానికి లేని తొందర తనకెందుకని ఆయన వ్యాఖ్యానించారు. ఇదే విషయం కేసీఆర్ అంటే.. తాను చిక్కుల్లో పడనా? అని ప్రశ్నించారు. ఆదివారం తెలంగాణ సీఎం కేసీఆర్‌తో భేటీ అయిన.. ఉండవల్లి.. సోమవారం.. మీడియాకు పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. అయితే.. ఆయన మళ్లీ రాజకీయాల్లోకి రావాలని ఆసక్తి లేదని చెప్పడం గమనార్హం.
Gulte Telugu Telugu Political and Movie News Updates