తెలంగాణ సీఎం కేసీఆర్‌తో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ ఆదివారం భేటీ అయిన విషయం తెలిసిందే. కేసీఆర్‌తో భేటీ తర్వాత ఉండవల్లి మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ 10 రోజుల క్రితం తన ఫోన్ చేశారని, ఆయన ఆహ్వానం మేరకే కలిశానని తెలిపారు. పదేళ్ల కిందట ఆయనతో మాట్లాడానని గుర్తు చేశారు. తమ మధ్య భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) గురించి ఎలాంటి చర్చ జరగలేదని ఆయన తెలిపారు.
బీజేపీ విషయంలో కేసీఆర్ ఆలోచనలు, తన ఆలోచనలు ఒక్కటేనని పేర్కొన్నారు. కేసీఆర్‌తో దాదాపు 3 గంటల పాటు చర్చ జరిగిందన్నారు. ఈ సమావేశంలో తనతో పాటు ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌కిషోర్ కూడా ఉన్నారని తెలిపారు. కేసీఆర్‌పై ఉండవల్లి ప్రశంసలు కురిపించారు. “కేసీఆర్ చెప్పిన విషయాలు విని నేను ఆశ్చర్యపోయాను. కేసీఆర్‌కు ఫుల్ క్లారిటీ ఉంది. పక్కా ఎజెండాతో కేసీఆర్ ముందుకు వెళ్తున్నారు. కేసీఆర్ ఎప్పుడు పిలిచినా వెళ్లి కలుస్తా. నేను రాజకీయాల నుంచి రిటైర్డ్ అయ్యాను.” అని తెలిపారు.
“బీజేపీయేతర పార్టీలను కేసీఆర్ లీడ్ చేయగలరు. దేశ రాజకీయాలపై కేసీఆర్ నాకంటే ఎక్కువ స్టడీ చేశారు. కేసీఆర్ మంచి కమ్యూనికేటర్. పశ్చిమబెంగాల్ సీఎం మమతాబెనర్జీ కన్నా కేసీఆర్ బాగా కమ్యూనికేట్ చేయగలరు. బీజేపీ విధానాలు దేశానికి ప్రమాదకరం. దేశంలో కాంగ్రెస్ బలహీనపడిందని అనిపిస్తోంది. దేశంలో ప్రత్యామ్నాయం అవసరం” అని ఉండవల్లి అరుణ్‌కుమార్ అభిప్రాయపడ్డారు.
నిజానికి, పది రోజుల కిందట ఉండవల్లికి కేసీఆర్ ఫోన్ చేసి.. హైదరాబాద్‌కు వచ్చినప్పుడు తనను కలవాలని కోరారని తెలిపారు. ఆదివారం హైదరాబాద్ వచ్చిన ఉండవల్లి తాను నగరానికి వచ్చానంటూ కేసీఆర్‌కు సమాచారం ఇచ్చారు. దీంతో కేసీఆర్ ఆయన్ను భోజనానికి ఆహ్వానించారు. ప్రగతి భవన్‌లో భోజన సమయంలోనే.. జాతీయ రాజకీయాలపై ఆయన చర్చించారు. అనంతరం, పీకే, ఉండవల్లి, సీఎం కేసీఆర్ కలిసి జాతీయ రాజకీయాలపై చర్చించినట్లు తెలిసింది.
ప్రధానంగా పీకే, ఉండవల్లిలకు కేసీఆర్ ప్రెజెంటేషన్ ఇచ్చినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. పార్టీ విధానం కింద దక్షిణాది సెంటిమెంట్‌ను ప్రధానంగా తీసుకుంటే ఎలా ఉంటుందనే అంశంపైనా చర్చ జరిగినట్లు తెలిపాయి. దక్షిణాది రాష్ట్రాలకు మోడీ పాలనలో జరిగిన అన్యాయాన్ని ప్రధానంగా తెరపైకి తీసుకెళ్లాలని చర్చించినట్లు సమాచారం.
Gulte Telugu Telugu Political and Movie News Updates