మాజీ మంత్రి, ప్రస్తుతం కాంగ్రెస్ నాయకురాలిగా ఉన్న ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన కొండా సురేఖ.. దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కొండా దంపతుల యదార్థ జీవిత కథ ఆధారంగా.. డైరెక్టర్ రాంగోపాల్ వర్మ నిర్మించిన ‘కొండా’ మూవీ.. ప్రమోషన్ కోసం.. కొండా సురేఖ.. విజయవాడ వచ్చారు.
ఈ సందర్భంగా తొలుత ఆమె.. విజయవాడ బస్టాండ్ సమీపంలోని తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద ఉన్న వైఎస్ విగ్రహానికి పూల మాల వేసి నివాళలర్పించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ‘కొండ’ దంపతుల జీవిత చరిత్రను ప్రజలకు తెలిపేందుకు సినిమా తీసినట్టు వివరించారు. ఎన్ని ఒడుడుకులు ఎదురైనా నిజ జీవితంలో ఎదుర్కొని నిలబడినట్టు సురేఖ చెప్పారు.
దివంగత వైఎస్ఆర్ రాజకీయ బిక్షతోనే తాము ఈ స్థితిలో ఉన్నామని సురేఖ వెల్లడించారు. నేటి రాజకీయాల్లో విలువలు అనేవి లేవని విమర్శించారు. బీజేపీ ప్రభుత్వంలో డబ్బు రాజకీయాలు నడుస్తున్నాయని దుయ్యబట్టారు. ప్రజల అభివృద్ధి కోసం ప్రభుత్వాలు పని చెయ్యాలని సూచించారు. వైఎస్ఆర్ మరణం తరువాత వైఎస్ కుటుంబాన్ని కలిసింది లేదని, వైఎస్ఆర్ తోనే తమకు అనుబంధం ఉందని సురేఖ చెప్పారు.
వైఎస్ కుటంబ సభ్యులతో తనకు కానీ, తన కుటుంబానికి కానీ.. ఎలాంటి సంబంధం లేదన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసాక విజయమ్మ, షర్మిలమ్మతో కోర్టుకు అటెండ్ అయినప్పుడు మాత్రమే మాట్లాడినట్టు సురేఖ తెలిపారు. ఆ తర్వాత వైఎస్ కుటుంబ సభ్యులను కలిసింది లేదని, మాట్లాడింది కూడా లేదని చెప్పారు. వచ్చే 2024 ఎన్నికల్లో వరంగల్ ఈస్ట్ నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేయబోతున్నాని తెలిపారు.