నందమూరి నట సింహం బాలకృష్ణ చిన్న అల్లుడు భరత్ వచ్చే ఎన్నికల్లో ఎక్కడి నుంచి పోటీ చేయనున్నారు అన్నది స్పష్టం అయిపోయింది. గతంలో ఆయన విశాఖ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ రోజు జరిగిన త్రిముఖ పోటీలో ఆయన పరాజితులయ్యారు. వైసీపీ హవాలో ఆయన కొట్టుకుపోయారు. ఫలితంగా స్థానికేతరుడు అయిన ఎంవివి సత్యనారాయణ అనూహ్య రీతిలో ఎంపీ అయ్యారు. అయితే తాజా పరిణామాల నేపథ్యంలో విశాఖ ఎంపీకి కొత్త ముఖం వెతుకులాట చేస్తున్నారని కూడా తెలుస్తోంది.
ఆ ప్రతిపాదన ఎలా ఉన్నా కూడా త్వరలో జరిగే ఎన్నికలకు ఎంపీ కాకుండా భీమిలి ఎమ్మెల్యే గా పోటీ చేయమని అధిష్టానం ఆదేశించిందని తెలుస్తోంది. దీంతో బాలయ్య అల్లుడు తన మకాం భీమిలికి మార్చేందుకు సిద్ధం అవుతున్నారని సమాచారం.ప్రస్తుతం ఉన్న స్థానాలలో స్వల్ప మార్పులు ఉండనున్నాయి. విశాఖ ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావును గాజువాక నుంచి పోటీ చేయించాలని యోచిస్తున్నారు అని కూడా తెలుస్తోంది.
గాజువాక అసెంబ్లీ నియోజకవర్గ ఇంఛార్జ్ ఉన్న పల్లా శ్రీనివాసులును విశాఖ ఎంపీ బరిలో దించాలి అని భావిస్తున్నారు. ఇది కూడా కన్ఫం కాలేదు కానీ ఆ విధంగా కొన్ని ప్రతిపాదనలు అయితే సిద్ధం అయ్యాయని ప్రాథమిక సమాచారం. అయితే విశాఖ ఎంపీ స్థానాన్ని మళ్లీ బీజేపీ కైవసం చేసుకుని తీరాలని యోచిస్తోంది. 2014లో గెలిచినా, 2019లో ఇక్కడ ఓడిపోయింది. అందుకే ఈ సారి విశాఖ లోక్ సభ సీటును గెలుచుకోవాలని బీజేపీ ఆరాటపడుతోంది. ఒకవేళ పొత్తులు కన్ఫం అయితే చిన్నమ్మే (దగ్గుబాటి పురంధేశ్వరి) అభ్యర్థి అయినా ఆశ్చర్యపోనవసరం లేదు.
విశాఖ ఎంపీ స్థానం పై ఇప్పటికిప్పుడు క్లారిఫికేషన్ రావడం కష్టమే కానీ గంటా స్థానం మార్పు మాత్రం కాస్త నమ్మొచ్చు. విశాఖ ఉత్తర నియోజక వర్గం నుంచి గంటా శ్రీను మేనల్లుడు పోటీ చేయడం తథ్యమని కూడా తెలుస్తోంది. ఆ విధంగా గంటా కోటాలో రెండు ఎమ్మెల్యే సీట్లు కన్ఫం కావొచ్చు. భీమిలి, గాజువాక, విశాఖ ఉత్తర, విశాఖ దక్షిణ నియోజకవర్గాలతో పాటు విశాఖ ఎంపీ ని కూడా గెలిపించుకునే సత్తా గంటాకు ఉందా? ఒకవేళ పొత్తులు లేకుండా ఉంటే టీడీపీ ఇక్కడ సత్తా చాటుకోవాలంటే గంటా శ్రీను శక్తికి మించి పనిచేయాల్సిందే !