తెలంగాణ‌లోనూ బాదుడే బాదుడు !

వార్షికాదాయం పెంపున‌కు ముఖ్యంగా ఆదాయం తీసుకు వ‌చ్చే స్టూడెంట్ పాస్-ల‌పై ఉన్న రాయితీని తొల‌గించేందుకు తెలంగాణ ఆర్టీసీ కొన్ని అడ్డ‌దారుల‌ను వెదుకుతోంది. సంస్థ‌ను లాభాల బాట ప‌ట్టించేందుకు నిన్న‌టి దాకా ఎండీ స‌జ్జ‌నార్ టికెట్ రేట్లు పెంచ‌మ‌ని, ఛార్జీల వ‌డ్డ‌న ఉండ‌దని చెబుతూ వచ్చి సడెన్-గా రివ‌ర్స్ గేర్ వేశారు. దీంతో విద్యార్థుల‌పై ఊహించ‌ని రీతిలో భారం ప‌డ‌నుంది. ఈ చ‌ర్య వారికి అస్స‌లు మింగుడు ప‌డ‌కుండా ఉండ‌నుంది. పెంచిన ధర కార‌ణంగా నెల‌కు ఏడు కోట్లకు పైగా అద‌నంగా ఆర్జించ‌నుంది.ఏడాదికి చూసుకుంటే పెంపు భారం ఎలా లేద‌న్నా 84 కోట్ల‌కు పైగా అద‌నంగా ఉండనుంది.

ఇప్ప‌టిదాకా ఉన్న స్టూడెంట్ పాస్ ధ‌ర 195 నుంచి 450 కు పెంచారు. అంటే 255 రూపాయ‌లు ఒక్క‌సారిగా పెంచారు. అదేవిధంగా డీజిల్ సెస్ పేరిట కూడా బాదుడు షురూ చేశారు. ఇదే కాకుండా డీజిల్ సెస్ పేరిట పల్లె వెలుగు ఛార్జీలు కూడా పెంచేశారు. ఇప్ప‌టిదాకా ఉన్న వివ‌రం ప్ర‌కారం.. పెరిగిన ధ‌ర‌లు ఈ విధంగా ఉన్నాయి.ఈ నిర్ణ‌యం ఐదు ల‌క్ష‌ల మంది విద్యార్థులపై ప్ర‌భావం చూప‌నుంది. అంటే.. గ్రేట‌ర్-తో పాటు ఇత‌ర ప్రాంత విద్యార్థులు ఇక‌పై వేరే ప్ర‌త్యామ్నాయం చూసుకోవాల్సిందేన‌ని ప‌లువురు త‌ల్లిదండ్రులు అంటున్నారు. కొత్త విద్యా సంవ‌త్స‌రం నుంచి ఈ నిర్ణ‌యం అమ‌లులోకి రానుంది. జూన్ ప‌ది నుంచి పాసుల కోసం ద‌ర‌ఖాస్తులు స్వీక‌రించి, అక్క‌డికి ఐదు రోజుల వ్య‌వ‌ధిలో పాస్ – లు ఇష్యూచేస్తారు. ఇప్ప‌టికే ఆర్టీసీ ప్ర‌యాణం అన్న‌ది చాలా మందికి బాగా అల‌వాట‌యిన వ్య‌వ‌హారం.

సిటీల్లో సెట్విన్ బ‌స్సులు కొన్ని న‌డిచినా, మారుమూల ప్రాంతాలకు, న‌గ‌ర శివార్ల‌కు పోయేది ఆర్టీసీ బ‌స్సే ! పేద విద్యార్థుల‌కు ఆర్టీసీ బ‌స్సు క‌ల్ప‌త‌రువు. కానీ ప‌రిణామాలు మారిన రీత్యా ధ‌ర‌లు పెంచక త‌ప్ప‌డం లేద‌ని ఆర్టీసీ అధికారులు నచ్చ‌జెప్పే ధోర‌ణిలో త‌మ వాద‌న‌ను వినిపిస్తున్నారు. మ‌రోవైపు 3 నెల‌ల‌కు ఒక‌సారి ఇష్యూ చేసే క్వార్టర్లీ పాస్‌ ధర రూ.490 నుంచి రూ.1200కు, ప్రతి రోజు ఒకే మార్గంలో రాకపోకలు సాగించేందుకు వీలుగా తీసుకొనే రూట్‌పాస్ ధ‌ర రూ.200 నుంచి రూ.600కు పెంచారు అని ప్ర‌ధాన మీడియా అందించిన వివ‌రం ఆధారంగా తెలుస్తోంది (రూట్ పాస్ లు అన్న‌వి 8 కిలోమీటర్ల వరకు చెల్లుబాటు అవుతాయి) .

ఈ నేప‌థ్యంలో ఆర్టీసీ క‌న్నా చౌక‌గా తిరుగాడే కొన్ని షేర్ ఆటోల‌కు మ‌ళ్లీ గిరాకీ రానుంది. సిటీ ప‌రిధిలో ఇప్ప‌టిదాకా కాలం నెట్టుకువ‌స్తున్న వీటికి ఇక‌పై మ‌ళ్లీ డిమాండ్ వ‌చ్చినా రావొచ్చు. ఈ ద‌శ‌లో స‌జ్జ‌నార్ త‌న నిర్ణ‌యాల అమ‌లును స‌మ‌ర్థించుకుని ఏ విధంగా ఓఆర్ అన‌గా ఆక్యుపెన్సీ రేట్ ను త‌ద్వారా ఏ విధంగా సంస్థ ఆదాయాన్ని పెంచుతారో అన్న‌ది ఆస‌క్తిక‌రంగా ఉంది.