దేశానికి మరోసారి కూడా.. దళిత సామాజిక వర్గానికి చెందిన వారే రాష్ట్రపతి కానున్నారా? పైగా.. 2024 సార్వత్రిక ఎన్నిక లనేపథ్యంలో కీలక పార్టీలు తీసుకునే నిర్ణయాలు అన్నీ కూడా.. ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే జరగనున్నాయా? అంటే.. ఔననే అంటున్నారు పరిశీలకులు. దేశంలో రాష్ట్రపతి ఎన్నికకు నగారా మోగింది. దీంతో కీలకమైన.. బీజేపీ, కాంగ్రెస్, ఇతర పార్టీలు ఎలాంటి వ్యూహాలతో ముందుకు సాగుతాయి..? ఏ విధంగా ముందుకు వెళ్తాయి? అనేది ఆసక్తిగా మారింది.
ముఖ్యంగా రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. గత ఎన్నికల సమయంలో బిహార్ గవర్నర్‌గా ఉన్న దళిత నేత రామ్‌నాథ్ కోవింద్‌ను ఎంపిక చేసి అందరినీ విస్మయపరిచారు. ఆయన బీజేపీలో వివిధ హోదాల్లో పనిచేసినా.. హిందూత్వకు దూరంగానే ఉన్నారు. ఇది దళితుల ఓట్లు పెద్దఎత్తున పొందడానికి ఆ తర్వాత బీజేపీకి పలు ఎన్నికల్లో బాగా కలిసి వచ్చింది. ఈసారీ ఇలాగే 2024 రాజకీయ ప్రయోజనాలకు అనుగుణంగా అభ్యర్థిని ఎంపిక చేస్తుందనే వాదన బలంగా వినిపిస్తోంది.
ఇక, ప్రస్తుతం ఉన్న అవకాశాల్లో ఈ దఫా గిరిజన మహిళకు అవకాశమిస్తారని చాలాకాలంగా ప్రచారం జరుగుతోంది. జార్ఖండ్ మాజీ గవర్నర్ ద్రౌపది ముర్ము పేరు వినిపిస్తోంది. ఈమె ఒడిసాకు చెందిన బీజేపీ గిరిజన నేత. జార్ఖండ్ గవర్నర్‌గా 2015 మే 18 నుంచి 2021 జూలై 12 వరకు పనిచేశారు. రాష్ట్రపతిని చేసేందుకే ఆమెకు పొడిగింపు ఇవ్వలేదన్న ప్రచారం ఉంది. ఆమెను ఎంపిక చేస్తే గిరిజన కోటాతో పాటు మహిళలకూ అవకాశం ఇచ్చినట్లవుతుందని, ఇది మోడీ సర్కారును మూడోసారి అధికారంలోకి తెచ్చేందుకు తమకు ఉపకరిస్తుందని బీజేపీ వర్గాలు భావిస్తున్నాయి.
అయితే అదేసమయంలో మోడీకి అత్యంత సన్నిహితంగా ఉండేవారు సహా.. కొందరు కీలక బీజేపీ నాయకులు మాత్రం ప్రస్తుత రాష్ట్ర పతి కోవింద్‌కు రెండో అవకాశం ఇస్తారని అంటున్నారు. ఈయన వివాదాలకు దూరంగా ఉండడం.. అన్ని పార్టీల నుంచి కూడా సానుకూల దృక్ఫథంతో ఉండడం.. పైగా కోవింద్‌ను ప్రకటిస్తే.. పోటీ కూడా తగ్గిపోయే అవకాశం ఉండడం వంటి అనేక కారణాలు కనిపిస్తున్నాయి. ఏదేమైనా రాష్ట్రపతి ఎన్నిక ద్వారా.. వచ్చే ఎన్నికల్లో గెలుపు గుర్రం ఎక్కాలనేది బీజేపీ వ్యూహంగా కనిపిస్తోందని అంటున్నారు పరిశీలకులు.