ఏపీలో బీజేపీ వ్యూహం ఏంటి? ఎలా ముందుకు వెళ్తుంది? ఏవిధంగా ఎన్నికల్లో విజయం దక్కించుకుంటుంది?.. ఇలాంటి అనేక ప్రశ్నలు ఇప్పుడు తెరమీదికి వస్తున్నాయి. ఎందుకంటే.. వచ్చే ఎన్నికల వరకు కూడా పొత్తులపై ఎవరూ మాట్లాడొద్దంటూ.. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తేల్చి చెప్పారు. అంటే.. పొత్తుల విషయంలో ఇప్పటి నుంచి ఎవరూ మాట్లాడకుండా.. ఆయన నోరు కట్టేశారు. ఇది.. రాజకీయంగానే కాకుండా.. పార్టీ పరంగా ఏమేరకు మేలు చేస్తుందో అనేది .. ఇప్పుడు కమల నాధుల్లో గందరగోళంగా మారింది.
క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసుకోవాలని, ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై ప్రజలను మేల్కొల్పాలని.. నడ్డా పార్టీ నాయకులకు సూచించారు. ఇది మంచి పరిణామమనే చెప్పాలి. ఏ పార్టీ అయినా.. ఒంటరిగానే పోటీ చేయాలని.. అధికారం చేజిక్కించుకోవాలని భావిస్తుంది.అయితే.. దీనికి ఏపీలో అంత సీన్ ఉందా? అనేదే ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న. పోనీ.. ప్రత్యేక హోదా ఇస్తామనో.. విశాఖ స్టీల్ ప్లాంటును ప్రైవేటీకరణ చేయబోమనే, పోలవరాన్ని వచ్చే ఏడాదిలో పూర్తి చేస్తామనో.. బీజేపీ చెప్పి ఉంటే.. పరిస్థితి వేరేగా ఉండేది.
కానీ, అలాంటి ప్రకటన ఏదీ కూడా బీజేపీ నేతల నుంచి రావడంలేదు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అన్ని పథకాలను కేంద్రంలోని మోడీ సర్కారు ప్రవేశ పెట్టినవేనని.. దీనినే ప్రజల్లోకి తీసుకువెళ్లాలని .. నడ్డా సూచించారు. ఈ పరిణామం.. పార్టీకి మేలు చేస్తుందా? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. ఎందుకంటే.. ఖచ్చితంగా చెప్పాలంటే.. క్షేత్రస్థాయిలో బలం లేనప్పుడు.. పుంజుకునే ప్రయత్నాలు చేయాలే తప్ప.. ప్రభుత్వ వ్యతిరేకతపై దృషష్టి పెట్టడం సరికాదని అంటున్నారు.
ఎందుకంటే.. ఇదే విషయంపై.. అన్ని ప్రధాన ప్రతిపక్షాలు ఫోకస్ పెంచుతున్నాయి. అలాంటప్పుడు.. ఒక్క బీజేపీకే ప్రజలు ఎందుకు వోటేయాలి? అసలు ఎందుకు వేయాలి? ఏం ఇచ్చారు..? ఏపీకి ఏం తెచ్చారు? అనే ప్రశ్నలు సహజంగానే తెరమీదకి వస్తున్నాయి. వీటిని ముందు సర్దుబాటు చేయాల్సిన అవసరం బీజేపీకి ఉంది. అంతేకాదు.. ఈ విషయంలో ముందు.. బీజేపీ నేతలపైనే ఒత్తిడి పెంచాల్సిన అవసరం కూడా ఉంది. మరి ఏం చేస్తారో చూడాలి. ఏదేమైనా.. వ్యూహం లేకుండానే నడ్డా చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా గరంగరంగా మారడం గమనార్హం.