కరోనా మహమ్మారితో మృతి చెందిన వారి మృతదేహాలను ఎవరూ తాకవద్దు. మృతదేహాల నుండి కరోనా మరింతగా వ్యాప్తిస్తుందని తేలింది. కనీసం అయినవారు కూడా ముట్టుకోలేని దారుణ పరిస్థితి. ప్రపంచవ్యాప్తంగా ఈ వైరస్ కారణంగా మృతి చెందిన వారిని తీసుకెళ్లి ఖననం చేస్తోన్న విధానం అందరినీ కదిలిస్తోంది. ఎలాగూ చనిపోయాడు. పైగా ముట్టుకోవద్దు. కానీ ఖననం కోసం జాగ్రత్తలు తీసుకొని వెళ్లే అవకాశం ఉన్నప్పటికీ కనికరం చూపని ఘటనలు బయటపడుతున్నాయి.
తాజాగా శ్రీకాకుళం జిల్లాలో మనసును కదిలించే ఘటన చోటు చేసుకుంది. పలాస మున్సిపాలిటీలోని ఉదయపురానికి చెందిన ఓ వ్యక్తి స్థానిక మున్సిపాలిటీలో ఉద్యోగి. ఆరోగ్యం బాగా లేకపోవడంతో చికిత్స పొందుతూ శుక్రవారం కన్నుమూశాడు. పరీక్షల్లో కరోనా లక్షణాలతో చనిపోయినట్లు తేలింది. దీంతో అక్కడున్న జనం ఒక్కసారిగా పరుగులు తీశారు. కుటుంబ సభ్యులు, స్థానికులు అంతిమ సంస్కారాలు నిర్వహించేందుకు నిరాకరించారట. వైద్యులు నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. పీపీఈ కిట్స్ ధరించి అంత్యక్రియలు నిర్వహించాలని చెప్పారు. అయినప్పటికీ ఎవరూ ముందుకు రాలేదు.
దీంతో స్థానిక మున్సిపల్ అధికారులు… మృతదేహాన్ని జేసీబీ వాహనంలో తరలించి, అంతిమ సంస్కారాలు పూర్తి చేశారు. మున్సిపల్ అధికారుల తీరుపై విమర్శలు వ్యక్తమయ్యాయి. మృతుడి కుమారుడు స్పందిస్తూ.. అసలు తన తండ్రి చనిపోయింది బ్రెయిన్ స్ట్రోక్తో అని, కరోనా లక్షణాలు లేవని, అధికారులే హడావుడి చేసి అంత్యక్రియలకు ఆటంకం కలిగించారని చెబుతున్నాడట. కాగా, ఈ ఘటనకు సంబంధించి శానిటరీ ఇన్స్పెక్టర్ను సస్పెండ్ చేశారు.