రుషికొండ `రంగు` తేలుస్తాం: సుప్రీంకోర్టు

విశాఖ రుషికొండ తవ్వకాలపై రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. తమ వాదనలు వినకుండా, కనీసం నోటీసులు ఇవ్వకుండా ఎన్జీటీ స్టే ఉత్తర్వులు ఇచ్చిందని కోర్టుకు ఏపీ స‌ర్కారు. వివరించింది. అయితే.. పిటిషన్‌పై విచారణను సుప్రీం ధర్మాసనం బుధవారానికి వాయిదా వేసింది. రిషికొండ వ‌ద్ద వైసీపీ ఎంపీ సాయిరెడ్డికి చెందిన కొంద‌రు వ్య‌క్తులు జ‌రుపుతున్న‌ తవ్వకాలపై అభ్యంతరం తెలుపుతూ వైసీపీ రెబల్‌ ఎంపీ రఘురామకృష్ణరాజు రాసిన లేఖను జాతీయ హరిత ట్రైబ్యనల్‌(ఎన్జీటీ) సుమోటోగా తీసుకుంది. రిషికొండ తవ్వకాలను నిలుపుదల చేయాలని, ఈ వ్యవహారంపై పూర్తిస్థాయిలో అధ్యయనం చేసి నెల రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఈనెల 6న ఎన్జీటీ ప్రిన్సిపల్‌ బెంచ్‌ మధ్యంతర స్టే విధించింది.

ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ.. రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిపై సుప్రీంకోర్టులో విచారణ సందర్భంగా.. రాష్ట్ర ప్రభుత్వ తరపు సీనియర్‌ న్యాయవాది అభిషేక్‌ మను సింఘ్వి వాదనలు వినిపించారు. ఈ ప్రాజెక్టును అన్ని అనుమతులతోనే చేపట్టామన్నారు. గత ఏడాది డిసెంబర్‌లో ఎన్జీటీ, రాష్ట్ర ప్రభుత్వంతో సంబంధంలేకుండా నియమించిన కమిటీ.. ఎక్కడా పర్యావరణ ఉల్లంఘనలు లేవని క్లీన్‌ చిట్‌ ఇచ్చింది. అయినప్పటికీ మరోసారి అధ్యయనం కోసం మరో కమిటీ ఏర్పాటు చేయడమే కాకుండా పనులు నిలుపుదల చేసింది. తమ వాదనలు వినకుండా, కనీసం నోటీసులు ఇవ్వకుండా స్టే ఇవ్వడం సహజ న్యాయసూత్రాలకు విరుద్దం. తొలుత నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదికను పక్కన పెట్టారని సింఘ్వి పేర్కొన్నారు.

రిషి కొండ వద్ద చేపట్టింది పర్యాటక ప్రాజెక్టు అని.. దీని అభివృద్ధి కోసం ఇప్పటికే రూ. 180 కోట్ల ఖర్చు చేశామన్నారు. 40-50 శాతం పనులు పూర్తయ్యాయని కోర్టుకు వివరించారు. మూడు వందల మందికి ఉద్యోగ, ఉపాధి లభిస్తుందని… వర్షాకాలం సమీపిస్తున్నందున స్టే ఎత్తివేయాలని ధర్మాసనానికి రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. సీఆర్‌జెడ్‌-2 పరిధిలోకి రుషికొండ ప్రాజెక్టు వస్తుందని ఎన్జీటీ మొదటి కమిటీ చెప్పిందని.. ఇప్పడు సీఆర్‌జెడ్-3 నిబంధనలు అమలు అవుతుందా? లేదా? అన్న అంశాన్ని పరిశీలించాలని ఎన్జీటీ కోరుతొందని ధర్మాసనానికి సింఘ్వీ వివరించారు. రెండు సార్లు హైకోర్టు ఈ అంశంపై జోక్యం చేసుకునేందుకు నిరాకరించిందన్నారు.

తుది తీర్పుకు కట్టుబడి ఉంటారా… తీర్పు తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి క్లైమ్‌ చేసుకోదని హామీ ఇవ్వగలరా అని ధర్మాసనం రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించగా.. అందుకు అవసమైన హామీ పత్రం ఇచ్చేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు సీనియర్‌ న్యాయవాది అభిషేక్‌ సింఘ్వి తెలిపారు. ఈ క్రమంలో ప్రతివాది ఎంపీ రఘురామ తరపు న్యాయవాది.. తనకు రేపటి వరకు సమయం ఇవ్వాలని కోరారు. అందుకు అంగీకరించిన జస్టిస్‌ ఎఆర్‌ గవాయ్‌, జస్టిస్‌ హిమ కోహ్లి ధర్మాసనం.. విచారణను బుధవారంకి వాయిదా వేసింది. అయితే.. ఈసంద‌ర్భంగా అస‌లు రుషి కొండ అంటే ఏంటి.. దాని సంగ‌తి చూస్తామ‌ని ధ‌ర్మాస‌నం వ్యాఖ్యానించ‌డం గ‌మ‌నార్హం.