భారీ అధికార బలం ఉంది.. ఏమైనా చేస్తాం.. అంటే.. రాజకీయాల్లో కుదరదు. పైగా సెంటిమెంటుకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చే ఏపీలో ఇది అసలే కుదరదు. ఇంకా.. కులాల ప్రాతిపదికన విడిపోయిన ఏపీ సమాజంలో అసలే నడవదు. ఇవన్నీ ఎందుకుచెప్పాల్సి వస్తోందంటే.. అనేక రాష్ట్ర ప్రభుత్వాలు.. ప్రజా వ్యతిరేకతను దృష్టిలో పెట్టుకుని.. పక్కన పెట్టిన అనేక కార్యక్రమాలను.. అదే ప్రజా బలం తనకు ఉందని.. వైసీపీ అధినేత.. సీఎం జగన్ అమలు చేస్తున్నారు. ఇవే.. ఇప్పుడు ఆయనకు ప్రమాదాన్ని కొని తెస్తున్నాయి.
మచ్చుకు కొన్ని విషయాలను పరిశీలిస్తే.. జగన్‌పై ఎంత వ్యతిరేకత ఉందో.. ఆ విధానాలను గత ప్రభుత్వాలు ఎందుకు పక్కన పెట్టాయో తెలుస్తుంది. అయితే.. ఈ విషయాన్ని ఉన్నతాధికారులు.. ప్రతిపక్షాలు కూడా.. పదే పదే మొత్తుకున్నా.. సీఎం జగన్ వినిపించుకోలేదు. వాటిని అమల్లోకి కూడా పెట్టేశారు. దీంతో ఇప్పుడు ఎంత సంక్షేమం అమలు చేస్తున్నా.. కడివెడు పాలలో చిన్న ఉప్పు గల్లు మాదిరిగా.. ఈ విధానాలు జగన్‌కు మైనస్‌గా మారాయి.
చెత్తపై పన్ను: రాష్ట్ర వ్యాప్తంగా చెత్తపై పన్ను రూపంలో ఇంటినుంచి నెలకు రూ.30 , రూ.40 వసూలు చేస్తున్నారు. ఇది వాస్తవానికి ప్రజలకు భారం కాదు. కానీ.. సెంటిమెంటుతో కూడుకుంది. చెత్తకు కూడా పన్నేస్తారా? ఉప్పుపై పన్నేస్తే.. పోరాడిన సమాజం మనది.. ఇప్పుడు మన పాలనలో చెత్తకు కూడా పన్ను కట్టాల్సివస్తోందని అంటున్నారు. ఇది మహిళల్లో మరింత వ్యతిరేకత పెంచుతోంది. వాస్తవానికి వైఎస్ హయాంలోనే దీనిని విధించాల్సి వచ్చినా.. ప్రజాగ్రహానికి, సెంటిమెంటుకు ఆయన తలొగ్గి.. పక్కన పెట్టారు.
రైతు విద్యుత్ మీటర్లు: సాగు కోసం విద్యుత్ వినియోగించే రైతన్నలకు ఉచిత విద్యుత్ ఇస్తున్నారు. కానీ, ఇది ప్రభుత్వానికి ఎంత మైలేజీ ఇస్తోందో తెలియదు కానీ.. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలకు.. అప్పుల కోసం.. తలొగ్గి.. ఇప్పుడు అదే విద్యుత్‌కు మీటర్లు బిగిస్తున్నారు. దీంతో రైతులు .. మున్ముందు.. తమకు ఉచిత విద్యుత్ ఎత్తేసే కుట్రలో భాగంగానే.. ఇది చేస్తున్నారని.. గ్రామాల్లో చెప్పుకొంటున్నారు. ఫలితంగా.. వైసీపీకి వ్యతిరేకత పెరిగిపోతోంది.
రహదారులు: రాష్ట్రంలో రహదారులు బాగాలేవు. ఈ విషయం సర్కారుకు కూడా తెలుసు. సంక్షేమ ఎలా ఉన్నా.. రోడ్లు బాగుంటే.. ప్రజలు ఏదో జరిగిపోతోందని.. అభివృద్ధి కనిపిస్తోందని అంటారు. ఇదే.. గతంలో బీజేపీ హయాంలో స్వర్ణ చతుర్భుజి పథకం కింద.. రహదారులకు ప్రాధాన్యం ఇచ్చారు. పలితంగా బీజేపీలో వాజ్ పేయికి అత్యంత పేరు వచ్చింది. ఇప్పుడు ఏపీలో ఎన్ని చేస్తున్నా.. రోడ్లు బాగోలేవనే టాక్.. పెద్ద ఎత్తున వినిపిస్తోంది. మొత్తంగా.. ఇలాంటి చిన్న చిన్న విషయాలే.. జగన్‌కు పెద్ద పెద్ద సమస్యలు సృష్టిస్తున్నాయి. మరి ఆయన వెనక్కి తగ్గుతారా? ముందుకే వెళ్తారా..? చూడాలి.