ఎన్టీఆర్‌కు భారతరత్న వచ్చేలా పోరాటం

ఎన్టీఆర్‌ శత జయంతిని పురస్కరించుకుని తొలిసారి.. తెలంగాణ అధికార పార్టీ.. టీఆర్ ఎస్‌కు చెందిన‌ పలువురు రాజకీయ ప్రముఖులు నివాళులర్పించారు. హైదరాబాద్ ఎన్టీఆర్ ఘాట్ వద్ద మంత్రులు మల్లారెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్‌తోపాటు ఎంపీ నామ నాగేశ్వరరావు శ్రద్ధాంజలి ఘటించారు. ప్రపంచ ఖ్యాతి గడించిన ఏకైక తెలుగు బిడ్డ ఎన్టీఆర్ అని మంత్రులు కొనియాడారు. ఎన్టీఆర్‌కు భారతరత్న ఇచ్చేలా కృషి చేస్తామని ఎంపీ నామ తెలిపారు.

ఎన్టీఆర్ ఘాట్ వద్దకు చేరుకుని.. తెలంగాణ మంత్రులు మల్లారెడ్డి, పువ్వాడ అజయ్‌ కుమార్‌, ఎంపీ నామనాగేశ్వరావు, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు బక్కని నరసింహులు, మోత్కుపల్లి నర్సింహులు, మాజీ మంత్రి పరిటాల సునీత, ఇతర టీడీపీ నాయకులు, అభిమానులు ఎన్టీఆర్ ఘాట్ వద్దకు చేరుకుని నివాళులు అర్పించి ఎన్టీఆర్‌ను స్మరించుకున్నారు.

ఒక తెలుగు బిడ్డగా ప్రపంచ ఖ్యాతి గడించిన వ్యక్తి ఎన్టీఆర్. ఆయన ఆదేశాల మేరకే ఇప్పటికీ ఆయన అభిమానులు పని చేస్తున్నారు. ఆయన ప్రధాన మంత్రి అవ్వాల్సింది.. జస్ట్‌లో మిస్ అయింది. అని మంత్రి మల్లారెడ్డి అన్నారు. ‘ఎన్టీఆర్‌కు భారతరత్న వచ్చేలా కృషి చేస్తాం. రాజకీయాల్లో, సినిమాల్లో ఆయనకు తారాస్థాయిలో అభిమానులున్నారు. పేదల కష్టం తెలుసుకున్న నాయకుడు ఎన్టీఆర్’ అని ఎంపీ నామ నాగేశ్వరరావు అన్నారు.

ఎన్టీఆర్‌ను స్ఫూర్తిగా తీసుకుని ఆయన బాటలోనే కేసీఆర్ నడుస్తున్నారని మోత్కుపల్లి నర్సింహులు అన్నారు. మధ్య దళారులు లేకుండా ప్రజలకు అన్ని రకాల సంక్షేమం చేరుకోవాలని ఆకాంక్షించారు. తన వద్ద అర్ధరూపాయి కూడా లేకున్నా.. తనని మంత్రి చేసి.. తనకు పెళ్లి చేసిన గొప్ప మనసున్న వ్యక్తి ఎన్టీఆర్ అని కొనియాడారు.

శత జయంతి ఉత్సవాలు ఘనంగా జరుపుకుంటున్నామని ఏపీ మాజీ మంత్రి పరిటాల సునీత అన్నారు. ఇవాళ తాను ఈ స్థాయిలో ఉన్నానంటే దానికి ఆయనే కారణమని తెలిపారు. ఆయన తన అభిమానుల గుండెల్లో ఎల్లప్పుడు బతికే ఉంటారని చెప్పారు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ఎన్టీఆర్ అన్న పరిటాల సునీత.. మహిళలకు ఆస్తిలో హక్కు కల్పించిన మహనీయుడు అని కీర్తించారు.

ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించిన టీడీపీ తెలంగాణ అధ్యక్షుడు బక్కని నరసింహులు.. ఆయన పటేల్ పట్వారీ వ్యవస్థను రద్దు చేసి.. బడుగు బలహీన వర్గాలకు నిజమైన స్వేచ్ఛా స్వాతంత్య్రాలను కల్పించారని కొనియాడారు. కేసీఆర్, జగన్‌లు ప్రతిపక్ష పార్టీలను ఎదగనీయడం లేదని విమర్శించారు. ప్రపంచంలోని తెలుగు వారందరి కోసం టీడీపీ పని చేస్తుందని తెలిపారు.