భాగ్యనగరానికి విచ్చేసిన భారత ప్రధాని నరేంద్ర మోడీ సీఎం కేసీఆర్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తొలుత ఆయనకు బేగంపేట ఎయిర్ పోర్టులో బీజేపీ కార్యకర్తలు, ముఖ్యనేతలు ఘన స్వాగతం పలికారు. ఎయిర్‌పోర్టులోనే బీజేపీ కార్యకర్తలతో మోడీ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కార్యక్రమంలో ఆయన.. తెలుగు మాటలతో ప్రసంగాన్ని ప్రారంభించారు. ‘తెలంగాణ ప్రజలకు నమస్కారం..’ అని ప్రసంగాన్ని ప్రారంభించి.. పట్టుదలకు, పౌరుషానికి తెలంగాణ ప్రజలకు పేరుందని చెప్పుకొచ్చారు.
తెలంగాణకు ఎప్పుడొచ్చినా ప్రజల రుణం పెరిగిపోతుందని అనిపిస్తోందన్నారు. ఇక్కడి ప్రజలు చూపించే అభిమానం, ఆప్యాయతలకు రుణపడి ఉంటానని మోడీ నమస్కరించి చెప్పారు. కుటుంబ పాలన చేసేవారు దేశ ద్రోహులు అని మోడీ తీవ్ర విమర్శలు గుప్పించారు. తెలంగాణ కుటుంబ పాలనతో అవినీతిమయం అయ్యిందని.. కేసీఆర్, కేటీఆర్‌పై డైరెక్ట్ ఎటాక్ చేశారు. తెలంగాణలో అధికారంలోకి వచ్చేది బీజేపీయేనని.. రాష్ట్రంలో మార్పు వస్తుందని మోడీ చెప్పుకొచ్చారు.
పేదల సమస్యలు కుటుంబ పార్టీలకు పట్టవని.. బీజేపీ పోరాటం తెలంగాణ అభివృద్ధి కోసమేనని ప్రధాని తెలిపారు. వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా పోరాడాలని బీజేపీ కార్యకర్తలకు మోడీ పిలుపునిచ్చారు. కేంద్ర పథకాల పేర్లు మార్చి తెలంగాణలో అమలు చేస్తున్నారని.. అయినా ప్రజల మనసులో బీజేపీని తీసేయలేరన్నారు. ఏ పార్టీకి గులాంగా మారి టీఆర్ఎస్ పనిచేస్తోందని ఈ సభావేదికగా మోడీ ప్రశ్నించారు.
“దేశ సమగ్రత మన చేతుల్లోనే ఉంది. మీ ప్రేమ నా బలం. ఇంత ఎండలోనూ మీరు నాకు ఘనస్వాగతం పలికారు. బీజేపీ చెందిన ఒక్కొక్క కార్యకర్త సర్ధార్ పటేల్ ఆశయాల కోసం పోరాడుతారు. భారతదేశానికి సేవ చేసేందుకు మనమంతా పనిచేస్తాం. తెలంగాణను టెక్నాలజీ హబ్‌గా చేశాం. బీజేపీ కార్యకర్తలపై దాడుల విషయం నా దృష్టికి వచ్చింది. ప్రాణత్యాగం చేసిన వాళ్లకు శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను. తెలంగాణలో వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా మనం పోరాడాలి“ అని మోడీ వ్యాఖ్యానించారు.
“తెలంగాణ పోరాటంలో వేలాది మంది త్యాగం చేశారు. తెలంగాణ ఉజ్వల భవిష్యత్ కోసం ఈ త్యాగాలు చేశారు. ఒక్క కుటుంబం కోసం తెలంగాణ ఉద్యమం జరగలేదు. తెలంగాణను విచ్ఛిన్నం చేసేవారు నాడు-నేడు కూడా ఉన్నారు. తెలంగాణ సౌభాగ్యం కోసం ముగ్గురు కార్యకర్తలు ప్రాణత్యాగం చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక రాష్ట్రాన్ని బంధించాలని కొందరు చూస్తున్నారు. తెలంగాణ అభివృద్ధి నిరోధకులు నాడే కాదు నేడు కూడా ఉన్నారు’ అని మోదీ తీవ్ర విమర్శలు గుప్పించారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates