జాతీయ రాజ‌కీయాల‌పై దేవెగౌడ‌తో సీఎం కేసీఆర్ చ‌ర్చ‌లు

బెంగళూరు చేరుకున్న సీఎం కేసీఆర్ కు.. మాజీ సీఎం కుమారస్వామి, తదితరులు ఘన స్వాగతం పలికారు. అనంతరం మాజీ ప్రధాని దేవెగౌడ నివాసానికి సీఎం కేసీఆర్ చేరుకున్నారు. జాతీయ రాజకీయాలపై జేడీఎస్‌ నేతలతో చర్చిస్తున్నారు. కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి, జేడీఎస్ నేతలు కేసీఆర్ కు ఘన స్వాగతం పలికారు. అనంతరం పద్మనాభనగర్లోని మాజీ ప్రధాని దేవెగౌడ నివాసంలో సీఎం కేసీఆర్, ఎంపీ సంతోష్ కుమార్ తో సహా పలువురు నేతలు మధ్యాహ్న భోజనం చేశారు. అనతరం దేవెగౌడ, కుమారస్వామితో కలిసి భేటీ అయ్యారు. కుమారస్వామి కుమారుడు నిఖిల్ గౌడ కూడా భేటీలో పాల్గొన్నారు.

దేశంలో ప్రస్తుతం నెలకొన్న పరిణామాలు, జాతీయ రాజకీయాలు, రాష్ట్రాల విషయంలో కేంద్ర ప్రభుత్వం అనురిస్తున్న విధానం సహా తాజా పరిణామాలు, భవిష్యత్ కార్యాచరణపై దేవెగౌడ, కుమారస్వామితో చర్చిస్తున్నారు. దేశంలో ప్రబల మార్పు రావాల్సిన అవసరం ఉందంటున్న కేసీఆర్… అందుకు సంబంధించిన అంశాలపై వారితో చర్చలు కొనసాగిస్తున్నారు.

రానున్న రోజుల్లో అనుసరించాల్సిన కార్యాచరణ, ప్రాంతీయ పార్టీల పాత్ర, తదితర అంశాలపై కూడా సమాలోచనలు చేస్తున్నారు. త్వరలో జరగనున్న రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల అంశం కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది. కేసీఆర్ పర్యటన నేపథ్యంలో బెంగళూరులో అభిమానులు ఇప్పటికే ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అటు ముఖ్యమంత్రి భద్రతా విభాగం అధికారులు, సిబ్బంది ఇప్పటికే బెంగళూరు చేరుకున్నారు. తిరిగి సాయంత్రం 4 గంటల‌కు బెంగళూరు నుంచి బయలుదేరుతారు. సాయంత్రం 5 గంట‌ల‌కు హైదరాబాద్ చేరుకుంటారు.

మోడీ వెళ్లిపోగానే..

ఇటు ఢిల్లీ నుంచి హైద‌రాబాద్ ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చిన న‌రేంద్ర మోడీ కూడా.. త‌న హైద‌రాబాద్ ప‌ర్య‌ట‌న‌ను ముగించుకుని మ‌ధ్యాహ్నం 4 గంట‌ల‌కే చెన్నై వెళ్లిపోయారు. ఈ నేప‌థ్యంలో కేసీఆర్ అటు బెంగ‌ళూరు నుంచి హైద‌రాబాద్‌కు బ‌య‌లుదేర‌నున్నారు. మొత్తానికి మోడీ హైద‌రాబాద్‌లో ఉన్న‌స‌మ‌యంలో కేసీఆర్ బెంగ‌ళూరుకు వెళ్లిపోవ‌డం.. ఆయ‌న వెళ్లిపోగానో.. ఇటు కేసీఆర్ రావ‌డం.. వంటివి రాజ‌కీయంగా చ‌ర్చ‌కు వ‌చ్చాయి.