రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీకి వైసీపీ అవసరం ఉందని వైసీపీ ప్రముఖ నేత విజయసాయిరెడ్డి అన్నారు. సొంతంగా తమ అభ్యర్ధిని రాష్ట్రపతిగా గెలిపించుకునేందుకు 4 శాతం ఓట్ల లోటు ఉందట. వైసీపీ మద్దతు లేకుండా మిగిలిన పార్టీలతో సంప్రదింపులు చేస్తే ఏమి చేయాలో అప్పుడు తమ పార్టీ నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. రాష్ట్ర ప్రయజనాలను దృష్టిలో పెట్టుకుని ఎవరికి మద్దతివ్వాలనే విషయాన్ని జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకుంటారట. గతంలో ఎస్సీ వ్యక్తి అయిన కారణంగానే రామ్ నాథ్ కోవింద్ కు మద్దతిచ్చినట్లు సమర్ధించుకున్నారు.
ఇక్కడ గమనించాల్సిందేమంటే రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీకి మద్దతివ్వక జగన్ కు వేరేదారి లేదు. ఉంటే ఎన్డీయే కూటమి లేకపోతే యూపీఏ కూటమి తరపున మాత్రమే రాష్ట్రపతి అభ్యర్థిగా పోటీ చేసే అవకాశముంది. ఎలాగూ కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ కూటమికి మద్దతిచ్చే అవకాశం లేదు కాబట్టి ఎన్డీయే కూటమికి మద్దతివ్వాల్సిందే. అయితే తటస్తంగా కూడా ఉండిపోవచ్చు కానీ జగన్ అలా చేయరు.
ఎందుకంటే తన కేసుల నుండి బయటపడటానికి మాత్రమే జగన్ కేంద్రానికి లొంగి ఉన్నారన్న విషయం అందరికీ తెలిసిందే. దీనికి రాష్ట్ర ప్రయోజనాలనే ముసుగును విజయసాయి తొడిగారు. నిజంగా రాష్ట్ర ప్రయోజనాల కోసమే వైసీపీ కృషి చేస్తుంటే ప్రత్యేక హోదా, విశాఖ కేంద్రంగా ప్రత్యేక రైల్వే జోన్, పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి నిధుల విషయంలో కేంద్రం దెబ్బకొడుతున్నా జగన్ గట్టిగా నిలదీయలేదు. చివరకు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ పై పార్లమెంట్ వేదికగా గట్టిగా మాట్లాడలేకపోతున్నారు.
జగన్ లాంటి నమ్మకమైన మద్దతుదారుడిని నరేంద్ర మోడీ ఎందుకు వదులుకుంటారు ? కాబట్టి రాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతివ్వమని బీజేపీ అడగటం, జగన్ ఇవ్వటం ఎలాగూ జరుగుతుంది. మద్దతివ్వాలని బీజేపీ అడిగినపుడు సాధ్యం కాదని జగన్ అంటే అప్పుడు యావత్ దేశం ఆశ్చర్యపోతుంది. పోనీ మద్దతు అడిగినపుడైనా జగన్ షరతులతో కూడిన మద్దతిస్తానని చెప్పగలరా ? జగన్ కు అంత ధైర్యముందా అన్నదే సందేహం. కేంద్రంలో బీజేపీ బలంగా ఉన్నంతవరకు జగన్ అయినా మరెవరైనా కానీ మద్దతివ్వాల్సిందే వేరేదారిలేదు.
Gulte Telugu Telugu Political and Movie News Updates