కులాల మధ్య ఘర్షణ రావణకాష్ఠం లాంటిదని.. కులాల గొడవలు జరిగితే రాష్ట్ర అభివృద్ధి సాధ్యం కాదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. కోనసీమ ఘటనకు వైసీపీ ప్రభుత్వం బాధ్యత వహించాలన్నారు. యువత ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలపై ప్రభుత్వాన్ని అడగాలని సూచించారు. ఇలాంటి వారి ఉచ్చులో పడవద్దని మనవి చేస్తున్నానన్నారు. వైసీపీ నేతలు గొడవలు తగ్గించే ప్రయత్నం చేయాలని కోరారు. సజ్జల వంటి పెద్దల అనుభవం కులాల మధ్య గొడవలకు కారణం కాకూడదని హితవు పలికారు.
కోడికత్తి కేసు ఏమైంది?
కోడి కత్తి ఘటన విచారణ ఎంతవరకు వచ్చిందో చెప్పాలని పవన్ ప్రశ్నించారు. కోడి కత్తి కేసు సమయం లో ఏపీ పోలీసులను నమ్మేది లేదని చెప్పి హైదరాబాద్ వెళ్లారన్నారు. మరి ఇప్పుడు ఈ కోడికత్తి కేసు ఎంత వరకు వచ్చిందన్నారు. వైఎస్ వివేకా హత్య విషయంలో వాస్తవాలేంటని నిలదీశారు. ఇప్పుడు పోలీస్ వ్యవస్థ తమ చేతిలో ఉంటే ఎందుకు విచారించట్లేదని నిలదీశారు. తమపై హత్యాయత్నంతో సానుభూతి సంపాదించి ఎన్నికల్లో గెలిచారని అన్నారు. రాందాస్ అథవాలే ఏపీలో అత్యధికంగా 557 అట్రాసిటీ కేసులు ఉన్నాయని చెప్పారని పవన్ తెలిపారు.
డెడ్ బాడీ డోర్ డెలివరీ!
మరోవైపు ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ హత్యపై పవన్ స్పందించారు. 3 రోజుల క్రితం వైసీపీ ఎమ్మెల్సీ డ్రైవర్‌ను చంపారని.. మృతదేహాన్ని ఇంటికి తెచ్చి .. డోర్ డెలివరీ చేశారని.. ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్సీ వ్యక్తి కావడంతో వ్యతిరేకత వచ్చిందన్నారు. ప్రజల దృష్టి మరల్చేందుకే కోనసీమలో గొడవలు రేపారని మండిపడ్డారు. కోనసీమకు పేరు మార్చడం వెనుక ప్రభుత్వ ఆలోచనేంటని నిలదీశారు. కడప జిల్లాకు అంబేడ్కర్ పేరు పెట్టవచ్చు కదా? అని పవన్ ప్రశ్నించారు.
కోనసీమ ఘటనపై హోంమంత్రి మాట్లాడారని… జనసేన మరికొందరి పాత్ర ఉందని హోంమంత్రి చెప్పారని పవన్ అన్నారు. అత్యాచారాలకు పాల్పడేవారు తల్లి పెంపకం సరిగా లేకపోవడం వల్లేనని మాట్లాడారని చెప్పారు. రేపల్లె రైల్వే స్టేషన్‌లో నిండు గర్భిణిపై అత్యాచారం జరిగిందని గుర్తుచేశారు. అమరావతి ఎస్సీ రైతులపై ఎస్సీ అట్రాసిటీ కేసులు పెట్టారని ధ్వజమెత్తారు.
కడప జిల్లా ప్రొద్దుటూరులో బాలికపై అత్యాచారం జరిగిందని… హైకోర్టు ఏదైనా తీర్పు ఇస్తే న్యాయమూర్తులను తిట్టేస్తారని మండిపడ్డారు. ఉద్యోగులు జీతాల కోసం రోడ్డుపైకి వస్తే వాళ్లను బెదిరిస్తారని పవన్ విమర్శించారు. రాష్ట్రంలో పాలన ఇలా ఉంటే.. ఎవరిపై ఎవరు విమర్శలు చేయాలని ప్రశ్నించారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates