‘కోనసీమ’ లో రాజకీయ మంటలు: అమలాపురం తగలబడింది

ఏపీ అట్టుడుకుతోంది. రాష్ట్రం ఒక్క‌సారిగా భ‌గ్గుమంది. కోనసీమ జిల్లా అమలాపురం ఆందోళనలతో అట్టుడికింది. కోనసీమ జిల్లా పేరు మార్పును వ్యతిరేకిస్తూ.. కోనసీమ జిల్లా సాధన సమితి చేపట్టిన ఆందోళన తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. కలెక్టరేట్ కార్యాలయానికి వందలాదిగా చేరుకున్న నిరసన కారులు బస్సులను దగ్ధం చేశారు. పోలీసులపై రాళ్లు రువ్వారు. మంత్రి విశ్వరూప్, ఎమ్మెల్యే సతీశ్ ఇంటికి నిప్పు పెట్టారు. ఈ ఘటనలో పోలీసులతో పాటు పలువురు నిరసనకారులకు గాయాలయ్యాయి.

‘కోనసీమ ముద్దు – వేరే పేరు వద్దు’ అనే నినాదంతో కోనసీమ జిల్లా సాధన సమితి చేపట్టిన ఆందోళన తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. ఆందోళకారులు అన్ని వైపుల నుంచి పట్టణంలోకి చొచ్చుకొచ్చారు. బస్టాండ్‌తో పాటు ముమ్మిడివరం వైపు నుంచి గడియారం స్తంభం వద్దకు ప్రదర్శనగా చేరుకున్నారు. పోలీసులు వారిని నియంత్రించేందుకు యత్నించారు. అయినా నిరసనకారులు వెనకడుగు వెయ్యలేదు. సమయం గడిచేకొద్దీ వందల సంఖ్యలో రోడ్లపైకి వచ్చి నినాదాలు చేస్తూ ముందుకు సాగారు.

క్షేత్ర స్థాయిలో పరిస్థితిని సమీక్షిస్తున్న జిల్లా ఎస్పీ.. రోడ్లపైకి వచ్చిన నిరసనకారుల్ని వాహనాల్లో తరలించేందుకు యత్నించగా వారిని ఆందోళనకారులు అడ్డుకున్నారు. కొందరు యువకులను అరెస్టు చేసి బస్సుల్లో తరలిస్తుండగా.. బస్సును వెంబడించి ధ్వంసం చేశారు. ఈ క్రమంలో నల్లవంతెన వద్ద ఆందోళనకారులపై లాఠీలు ఝళిపించారు. దీంతో రెచ్చిపోయిన యువకులు పోలీసులపై రాళ్లు రువ్వారు.

రాళ్లదాడిలో జిల్లా ఎస్పీ సుబ్బారెడ్డి తృటిలో తప్పించుకున్నారు. ఘటనలో పలువురు పోలీసులతో పాటు ఆందోళనకారులకు గాయాలయ్యాయి. అనంతరం కలెక్టరేట్‌లోకి చొచ్చుకెళ్లేందుకు ఆందోళనకారులు యత్నించారు. వారిని నియంత్రించడం పోలీసులకు కష్టంగా మారింది. రెచ్చిపోయిన ఆందోళన కారులు రెండు బస్సులకు నిప్పు పెట్టారు. మరో బస్సు అద్దాలు ధ్వసం చేశారు.

పూర్తిగా త‌గ‌ల‌బ‌డిన మంత్రి ఇల్లు

అనంతరం అమలాపురం బ్యాంకు కాలనీలోని మంత్రి విశ్వరూప్‌ ఇంటికి వేలాదిగా తరలివచ్చిన నిరసన కారులు ఇంటిపై రాళ్ల దాడి చేశారు. ఇంటి అద్దాలు, ఫర్నీచర్‌ ధ్వంసం చేశారు. మంత్రి ఇంటి వద్ద ఉన్న పోలీస్‌ ఎస్కార్ట్‌ వాహనం, ఓ ద్విచక్రవాహనాన్ని తగులబెట్టారు. అనంతరం మంత్రి ఇంటికి కూడా నిప్పుపెట్టారు. దాడికి ముందే మంత్రి కుటుంబసభ్యులను పోలీసులు అక్కడి నుంచి తరలించారు. మంత్రి విశ్వరూప్‌ సతీమణి, పిల్లలను కారులో వేరే ప్రాంతానికి తరలించారు. హౌసింగ్‌బోర్డు కాలనీలోని ముమ్మిడివరం ఎమ్మెల్యే సతీశ్ ఇంటికి కూడా ఆందోళన కారులు నిప్పు పెట్టారు.

ప్ర‌భుత్వ వైఫ‌ల్యంమే: జ‌న‌సేన

అమలాపురం ఘటనను జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఖండించారు. ప్రజలందరూ సంయమనం పాటించాలని.. శాంతియుత పరిస్థితుల కోసం ప్రతి ఒక్కరూ సహకరించాలని సూచించారు. అంబేడ్కర్ పేరును వివాదాల్లోకి తెచ్చినందుకు ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. హోంమంత్రి ప్రకటనలో జనసేన పేరు ప్రస్తావనను పవన్కల్యాణ్ ఖండించారు. అంబేడ్కర్ పేరును వివాదాలకు కేంద్ర బిందువుగా మార్చడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. మహనీయుడి పేరును వివాదాల్లోకి తెచ్చినందుకు ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు.

అమలాపురంలో శాంతిభద్రతలు నెలకొల్పడంలో ప్రభుత్వం విఫలమైందని దుయ్యబట్టారు. పాలనా లోపాలను కప్పిపుచ్చు కోవడానికి సమస్యలు సృష్టిస్తున్నారని ఆరోపించారు. పాలకుల వైఫల్యాలను పార్టీలకు ఆపాదిస్తున్నారని మండిపడ్డారు. ఉద్రిక్త పరిస్థితులకు కారణం ఎవరనేది రాష్ట్ర ప్రజలందరికీ తెలుసన్నారు. హోంమంత్రి ప్రకటనలో జనసేన పేరు ప్రస్తావనను ఖండించారు. ప్రభుత్వ లోపాలు, వైసీపీ ప్ర‌భుత్వం వైఫల్యాలను జనసేనపై రుద్దకూడదని పవన్ హెచ్చరించారు.