ఇరు రాష్ట్రాల్లోని సమకాలీన రాజకీయ నాయకుల్లో మాజీ ఎంపీ, సీనియర్ పొలిటిషియన్ ఉండవల్లి అరుణ్ కుమార్ కు ఉన్న ప్రత్యేకత వేరు. సుత్తి లేకుండా …ముక్కు సూటిగా …చెప్పదలుచుకున్న విషయాన్ని కన్విన్సింగ్ గా చెప్పగలిగిన నేర్పు ఉన్న నేత ఉండవల్లి. అంతటి వాగ్ధాటి…విషయ పరిజ్ఞానం ఉన్న ఉండవల్లిని సీఎం నుంచి సీనియర్ నాయకుల వరకు గౌరవిస్తారు. టీడీపీ హయాంలో బాబు సీఎంగా ఉన్నపుడు పోలవరం లెక్కలపై….టీడీపీ, చంద్రబాబులను విమర్శించిన ఉండవల్లిని, స్వయంగా చంద్రబాబు పిలిచి పోలవరంపై సలహా అడిగారంటే ఉండవల్లి విషయ పరిజ్ఞానం ఏమిటన్నది అర్థం చేసుకోవచ్చు. అధికార పక్షం, విపక్షం అన్న తేడా లేకుండా దాదాపుగా చాలా మందికి ఉండవల్లిపై ఓ సాఫ్ట్ కార్నర్ ఉంది.
ఏపీలో పూర్తిగా…దేశంలో పాక్షికంగా కాంగ్రెస్ పార్టీ అంతర్థానం అయిపోవడంతో…ఉండవల్లి ప్రత్యక్ష రాజకీయాల్లో యాక్టివ్ గా లేరు. అయితే, అడపాదడపా…ఏపీలోని సమకాలీన అంశాలపై తన గళం విప్పుతుంటారు ఉండవల్లి. తాజాగా మరోసారి ఏపీ పాలిటిక్స్ పై తనదైన మార్క్ కామెంట్స్ చేశారు ఈ సీనియర్ సర్కాస్టిక్ పొలిటిషియన్. తనకు వైఎస్ రాజశేఖర రెడ్డి కొడుకుగా వైఎస్ జగన్ అంటే అభిమానమని…అయితే, ఏపీ సీఎం జగన్ ను మాజీ సీఎం చంద్రబాబును విమర్శించినట్లే విమర్శిస్తానని పంచ్ వేశారు ఉండవల్లి. తన ప్రెస్ మీట్లకు మిలియన్లలో వ్యూస్ రావడానికి టీడీపీ, చంద్రబాబు అభిమానులే కారణమంటూ ఉండవల్లి సెటైర్లు వేశారు.
తనకు చంద్రబాబు, జగన్ ఒక్కటేనని….ఏపీ సీఎంగా పాలనలోని లోపాలను ఎత్తిచూపడం తన నైజం అని అన్నారు ఉండవల్లి. గతంలో చంద్రబాబు సీఎంగా ఉన్నపుడూ ప్రెస్ మీట్లు పెట్టి విమర్శించానని…ఇపుడు జగన్ సీఎంగా ఉన్నా….అదే చేస్తున్నానని క్లారిటీ ఇచ్చారు. అయితే, కొందరు టీడీపీ అభిమానులు మాత్రం…తాను జగన్ కు అనుకూలమనే భావనలో ఉన్నారని….వారి కోసం ఈ క్లారిటీ ఇస్తున్నానని అన్నారు. తాను గతంలో ఎంపీని కాబట్టి ఓ వెయ్యి మంది వరకు పరిచయం ఉన్నారని….ప్రెస్ మీట్ పెడితే వెయ్యి, రెండు వేలు వ్యూస్ వస్తాయనుకున్నానని అన్నారు. కానీ, తన ప్రెస్ మీట్లకు గతంలోనూ.. ఇప్పుడూ మిలియన్ల కొద్దీ వ్యూస్ వస్తున్నాయని…దానికి చంద్రబాబునాయుడు గారి అభిమానులు, కార్యకర్తలే కారణమని అన్నారు ఉండవల్లి.
సోషల్ మీడియాలో టీడీపీ, చంద్రబాబు ఫాలోయర్లు మిలియన్లలో ఉన్నారని, వారంతా ఫాలో అవడం వల్లే అన్ని వ్యూస్ వచ్చేవని తనకు తర్వాత తెలిసిందని అన్నారు. అప్పుడు, ఇప్పుడు వారే తన వీడియోలకు వ్యూవర్స్ అని అన్నారు. ఎప్పటి నుంచో చెబుతున్నా...జగన్ ఘోస్ట్ వి నువ్వు....బయట ఉండి రాజకీయం చేస్తున్నావు...అని టీడీపీ అభిమానులు తనను విమర్శించారని అన్నారు. సహజంగా తనకు పరిచయమున్నవారి మీద అభిమానం ఉంటుందని చెప్పారు. తనకు వైఎస్ రాజశేఖర రెడ్డి అంటే అభిమానమని, ఆయన కొడుకుగా వైెఎస్ జగన్ అన్నా అభిమానమేనని చెప్పారు. అయితే, జగన్ తనకు దగ్గరే అని…కానీ, ఏపీ సీఎం తనకు దగ్గర కాదని చెప్పారు. ప్రభుత్వంలో లోపాలను ఎత్తి చూపేందుకు బాబు టైంలో ప్రెస్ మీట్ లు పెట్టానని, ఇపుడు కూడా ప్రెస్ మీట్లు పెట్టి అంతకన్నా గట్టిగా విమర్శిస్తానని అన్నారు.
తాను ఎందుపు ప్రెస్ మీట్ పెడుతున్నానో తనకు తెలీదని…ఎందుకు కవర్ చేస్తున్నారో మీడియాకు తెలీదని…ఎందుకు చూస్తున్నారో జనాలకు తెలీదని చమత్కరించారు ఉండవల్లి. రాజకీయం, సమకాలీన అంశాలపై చర్చించడం అంటే తనకు వ్యసనం అని….తనకు తెలిసిన ఒకే ఒక విద్య ఇదని అన్నారు. తనను మీడియా చూపించడం మానేస్తే…తాను మాట్లాడడం మానేస్తానని చెప్పారు ఉండవల్లి. మొత్తానికి ఉండవల్లి ప్రెస్ మీట్ వెనుక టీడీపీ ఫ్యాన్స్ ఉన్నారని సోషల్ మీడియాలో కామెంట్స్ వస్తున్నాయి.
Gulte Telugu Telugu Political and Movie News Updates