మెగా బ్రదర్స్… చిరంజీవి, పవన్ కళ్యాణ్, నాగబాబులకు ప్రత్యేకంగా అభిమానులు ఉన్న విషయం తెలిసిందే. ఇక, యువ మెగా స్టార్ రామ్ చరణ్‌కు కూడా ప్రత్యేకంగా లక్షల సంఖ్యలో అభిమానులు ఉన్నారు. అయితే.. ఇప్పటి వరకు వీరు సినిమాలకు మాత్రమే పరిమితమయ్యారు. మెగా కుటుంబం నుంచి వచ్చే సినిమాలను హిట్ చేయడం.. సందడి చేయడం.. పంక్షన్లు పెట్టడం.. జై కొట్టడం వరకే పరిమితమయ్యారు. పైగా ఇందులోనూ.. పవన్ అభిమానులు వేరు. చిరు అభిమానులు వేరే.. అనే గీతలు కూడా ఉన్నాయి.
ఇప్పటి వరకు ఇలానే వ్యవహరించిన..ఈ మెగా అభిమానులు.. ఇప్పుడు సంచలన నిర్ణయం తీసుకున్నా రు. తాజాగా ఆదివారం విజయవాడలో చిరంజీవి, పవన్ కల్యాణ్, రామ్ చరణ్ అభిమానులు సమావేశం అయ్యారు. నగరం నడిబొడ్డున ఉన్న మురళీ ఫార్చున్ హోటల్ లో జరిగిన ఈ సమావేశంలో ఏపీలోని అన్ని జిల్లాల నుంచి పరిమిత సంఖ్యలో మెగా అభిమానులు పాల్గొన్నారు. గతంలో పవన్ అభిమానులు వేరేగా.. చిరు అభిమానులు వేరేగా, చరణ్ అభిమానులు వేరేగా వ్యవహరించినా.. ఇప్పుడు అందరూ ఒకే గొడుగు కిందకు చేరుకున్నారు.
ఈ భేటీలో కీలకమైన అంశంగా జనసేన పార్టీకి మద్దతు విషయాన్నే వారు చర్చించారు. వచ్చే 2024 ఎన్నికల్లో మెగా అభిమానులు అందరూ కూడా ఒకేతాటిపైకి వచ్చి.. పవన్‌కు అండగా నిలవాలని నిర్ణయించారు. ఈ అంశంపైనే అభిమానులు ప్రధానంగా చర్చిస్తున్నారు. ఏపీలో ముగ్గురు హీరోల అభిమానులు కలిసి సంయుక్తంగా పనిచేసి, జనసేన పార్టీని బలోపేతం చేయడం, సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం వంటి అంశాలపై చర్చించి, ప్రణాళిక వేసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో జనసేనను గెలిపించే లక్ష్యం తప్ప మరోకటి లేదన్నట్టుగా ఈ సమావేశం ఉండడం గమనార్హం.
Gulte Telugu Telugu Political and Movie News Updates