పతంజలి వాళ్లు అసలు కరోనా వైరస్ పేరే ఎత్తలేదట

కరోనా వైరస్‌కు మందు కనిపెట్టేశామంటూ పతంజలి సంస్థ చేసిన ప్రకటన దేశంలో పెద్ద చర్చకే దారి తీసింది. ప్రపంచవ్యాప్తంగా కరోనాకు అలోపతి మందు కోసం లక్షల మంది శాస్త్రవేత్తలు పని చేస్తున్నారు. ఇప్పటిదాకా ఎవ్వరూ నిర్దిష్టమైన మందును కనిపెట్టలేదు. వైరస్‌ ప్రభావాన్ని కొంత మేర తగ్గించే మందులేవో తెచ్చారు తప్ప.. దీంతో వైరస్ పూర్తిగా తగ్గిపోతుందని ఎవ్వరూ చెప్పడం లేదు. ఇలాంటి తరుణంలో పతంజలి సంస్థ కేవలం 545 రూపాయల ధరతో ఒక కరోనా కిట్‌ను రిలీజ్ చేసి.. దీన్ని కేవలం రెండు వారాలు వాడితే కరోనా పరార్ అంటూ ఘనంగా ప్రకటించుకుంది. సంస్థ వ్యవస్థాపకుడు రామ్‌దేవ్ బాబా చాలా ధీమాగా ఈ విషయాన్ని ప్రకటించడంతో జనాల్లోనూ ఆశ పుట్టింది. కానీ వాళ్లు ఇలా ప్రెస్ మీట్ పెట్టిన కొన్ని గంటల్లోనే కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ లైన్లోకి వచ్చింది. ఇది కరోనా మందుగా ప్రచారం చేసుకోవద్దని.. దీని ప్రామాణికతను పరీక్షిస్తున్నామని ప్రకటించింది.

కరోనాకు మందు కనుగొనడం అంటే సంచలన విషయం కావడంతో ఈ వ్యవహారంపై ఇప్పుడు విచారణ కూడా మొదలుపెట్టింది మంత్రిత్వ శాఖ. అసలు ఈ ‘కరోనిల్’ ఔషధానికి ఎలా అనుమతి ఇచ్చారన్న దానిపై విచారణ మొదలైంది. ఈ మందుకు అనుమతులిచ్చిన ఉత్తారఖండ్ ప్రభుత్వ ఆయుర్వేద శాఖ అధికారులను వివరణ కోరగా.. ‘కరోనిల్’ మందును మార్కెట్లోకి తెచ్చేందుకు పతంజలి సంస్థ దరఖాస్తు చేసుకున్న సమయంలో ఎక్కడా ‘కరోనా వైరస్’ పేరే ప్రస్తావించలేదని స్పష్టం చేశారు. రోగ నిరోధక శక్తిని పెంచడానికి.. దగ్గు, జ్వరం నియంత్రణకు పని చేసే మందుగా మాత్రమే తాము దానికి అనుమతులు ఇచ్చామని తేల్చేశారు. దీనిపై పంతజలి సంస్థను వివరణ కోరుతామని.. నోటీసు జారీ చేస్తామని.. కోవిడ్-19 కిట్‌గా ప్రచారం చేసుకుంటున్న ఈ మందులకు ఎలా అనుమతి లభించిందో విచారణ జరుపుతామని కేంద్ర మంత్రిత్వ శాఖ అధికారులు అంటున్నారు. దీనిపై పతంజలి వ్యవస్థాపక అధ్యక్షుడు మాట్టాడుతూ.. తాము ఆయుష్ మంత్రిత్వ శాఖ నియమ నిబంధనలను వంద శాతం పాటించామంటూ అనుమతుల విషయాన్ని దాటవేశారు.