వైసీపీ వ్యతిరేక ఓటు చీలకుండా ఉండేందుకు బీజేపీని సైతం ఒప్పిస్తానని జనసేన అధినేత పవన్‌కల్యాణ్ అన్నారు. ఆ పార్టీ అధిష్టానంతో దీనిపై చర్చిస్తానని తెలిపారు. గతంలో అమరావతి విషయంలో అమిత్‌షాను ఒప్పించిన అనుభవం తనకు ఉందని పవన్ గుర్తుచేశారు. పొత్తుల విషయంలోనూ అదే విధంగా ఒప్పించగలనన్న నమ్మకం ఉందని పవన్ ధీమా వ్యక్తం చేశారు.
వైసీపీ వ్యతిరేక ఓటు చీలిపోకుండా ఉండేందుకు ఎవరితోనైనా పొత్తులు పెట్టుకునేందుకు సిద్ధమని ఇటీవల ప్రకటించిన పవన్‌కల్యాణ్….మరోసారి ఈ విషయాన్ని పునరుద్ఘాటించారు. వైసీపీ వ్యతిరేక ఓటు చీలిపోకుండా అవసరమైతే బీజేపీ అధిష్టానాన్ని సైతం పొత్తులకు ఒప్పిస్తానని ఆయన తేల్చి చెప్పారు.
రాష్ట్రంలో వైసీపీ అరాచక పాలనను వారికి అర్థమయ్యేలా వివరించి.. పొత్తుల విషయంలోనూ వారిని ఒప్పిస్తానన్నారు. రాష్ట్ర రాజధానిగా అమరావతే ఉండాలని వారిని ఏవిధంగా ఒప్పించానో….ఇప్పుడు కూడా అదే పంథాలో ముందుకు సాగుతానన్నారు. మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో వివిధ అంశాలపై ఆయన విలేఖర్లతో మాట్లాడారు.
కాపు రిజర్వేషన్లపై వైసీపీ నాయకులు చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే.. వారికి కాపులంటే ఎంత చులకనభావం ఉందో అర్థమవుతోందన్నారు. అందుకే రిజర్వేషన్లు ఇచ్చేది లేదని తెగేసి చెప్పారన్నారు. అదే విధంగా బీసీలను ప్రభుత్వం మోసం చేసిందన్నారు.
రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా దిగజారాయని పవన్ విమర్శించారు. జగన్‌పై కోడికత్తితో దాడి చేసిన వారికి పదవులివ్వడం.. సొంత బాబాయి హత్య కేసును ఇప్పటి వరకు తేల్చకపోవడం ద్వారా అసాంఘిక శక్తులకు ఎలాంటి సందేశం ఇస్తున్నారని పవన్ ప్రశ్నించారు. పవన్ విలేఖర్లతో మాట్లాడుతుండగానే విద్యుత్ పోయింది. సెల్‌ఫోన్ లైట్ వెలుతూరులోనే మాట్లాడిన పవన్….రాష్ట్రంలో పరిస్థితులకు ఇంతకన్నా ఉదాహరణ ఏముంటుందన్నారు.
‘వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వం’ అన్న నాలుగే నాలుగు పదాలు విని ఆ పార్టీ నాయకులు ఎందుకు అంత భయపడుతున్నారు. రాష్ట్రం బలంగా ఉండటమే ముఖ్యం. రాష్ట్రం బలమే జనసేనకు బలం. ఎక్కడ పోటీ చేసినా పవన్‌కల్యాణ్‌ను ఓడిస్తామంటున్న వైసీపీ నేతల సవాల్‌ను స్వీకరిస్తున్నా. బళ్లు ఓడలవుతాయి. ఓడలు బళ్లు అవుతాయి. నన్ను విమర్శించిన మాజీ మంత్రులకు ఈ విషయం ఇప్పటికైనా తెలుసుండాలి“ అని వ్యాఖ్యానించారు.