కరోనాకు కనికరం లేదు….జాలి దయ అంతకన్నా లేదు…అందుకే కటిక పేదవాడి నుంచి కరోడ్ పతి వరకు ఎవరిపైనా వివక్ష చూపకుండా కాటేస్తోంది. రాజకీయ నేతలను…సామాన్యులను ….ఇలా తన బారినపడ్డవారిని కబళిస్తూ విలయతాండవం చేస్తోంది. దేశవ్యాప్తంగా చాలామంది ప్రజా ప్రతినిధులు కరోనా బారినపడి చికిత్స పొందుతున్నారు.
కొద్ది రోజుల క్రితం తమిళనాడులోని డీఎంకే ఎమ్మెల్యే అనబళగన్ కరోనా బారినపడి మరణించారు. ఇపుడు తాజాగా పశ్చిమ బెంగాల్ లోని తృణమూల్ కాంగ్రెస్ నేత, ఎమ్మెల్యే తమోనాష్ ఘోష్(60)ను మహమ్మారి వైరస్ కబళించింది. దేశవ్యాప్తంగా కరోనా బారిన పడి మరణించిన రెండో ఎమ్మెల్యే ఘోష్. తన పార్టీకి చెందిన సీనియర్ నేత ఘోష్ అకాల మరణంపై టీఎంసీ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సంతాపం వ్యక్తం చేశారు.
గత నెలలో ఘోష్ కు కరోనా సోకింది. అప్పటి నుంచి ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే, ఘోష్ కు ఇతర అనారోగ్య సమస్యలు కూడా ఉండడంతో కోలుకోలేకపోయారు. ఘోష్ హఠాన్మరణం చాలా దురదృష్టకరమని, తమ పార్టీ ఓ మంచి నేతను కోల్పోయిందని దీదీ ఆవేదన వ్యక్తం చేశారు. ఫాల్టా నుంచి 3 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన ఘోష్, 1998 నుంచి పార్టీ కోశాధికారిగా పనిచేశారని చెప్పారు.
గత 35 సంవత్సరాలుగా పార్టీ కోసం, ప్రజల కోసం ఘోష్ ఎంతో శ్రమించారని, ఎన్నో సామాజిక కార్యకలాపాల్లో పాల్గొన్నారని దీదీ కొనియాడారు. ఘోష్ మృతికి తన ప్రగాఢ సంతాపాన్ని తెలిపిన దీదీ…ఘోష్ భార్య ఝార్నా, బంధుమిత్రులకు భగవంతుడు ధైర్యాన్ని ప్రసాదించాలని కోరారు. ఘోష్ మృతిపట్ల పశ్చిమ బెంగాల్ తో పాటు పలువురు రాజకీయ నాయకులు సంతాపం తెలిపారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates