తెలంగాణ ప్ర‌జ‌లు ఓటేస్తే.. సీఎం అయ్యారా? జ‌గ‌న్ సార్‌..


వైసీపీ ప్ర‌భుత్వంపై ఎవ‌రైనా విమ‌ర్శుల చేస్తే.. కుట్ర‌లు అంటున్నారు. వారిని ఏకేస్తున్నారు. కొంద‌రు నోటికి ఎంత మాట వ‌స్తే.. అంత మాటా అనేస్తున్నారు. నీచులు, ప్ర‌జ‌లు ఛీకొట్టారు.. అయినా.. బుద్ధి రాలేదు. అందుకే మాపై ప‌డి ఏడుస్తున్నారు.. అంటూ.. ప్ర‌తిప‌క్ష నేత‌ల‌పై విరుచుకుప‌డుతున్నారు. క‌ట్ చేస్తే.. ముఖ్య‌మంత్రిగా జ‌గ‌న్ తీసుకుంటున్న నిర్ణ‌యాల‌ను సొంత పార్టీ నేత‌లే.. విమ‌ర్శిస్తున్నారు. గ‌తంలో ఆనం రామ‌నారాయ‌ణ‌రెడ్డి వంటివారు తీవ్రంగా విమ‌ర్శించిన విష‌యం తెలిసిందే.

స‌రే! ఆయ‌నేదో ప‌ద‌వి ఆశించారు.. ద‌క్క‌లేదు కాబ‌ట్టి.. స‌ర్కారుపై విమ‌ర్శ‌లు చేస్తున్నారు.. అని వైసీపీ నేత‌లు స‌రిపుచ్చుకున్నారు.కానీ, ఇప్పుడు.. సొంత పార్టీకి చెందిన అది కూడా ఒక కీల‌క ప‌ద‌విలో ఉన్న నాయ‌కుడు జ‌గ‌న్‌ను ఆయ‌న నిర్ణ‌యాల‌ను ఏకేశారు. ప్ర‌తిప‌క్షాలు త‌ర‌చుగా అనే.. జ‌గ‌న్ తుగ్ల‌క్ అనే మాట‌ను కూడా అనేశారు. మ‌రి దీనిని జ‌గ‌న్ కానీ, వైసీపీ నాయ‌కులు కానీ ఏం స‌మాధానం చెబుతారు? అనేది కీల‌క ప్ర‌శ్న‌.

ఏం జ‌రిగింది?

బీసీల పట్ల సీఎం జగన్‌ తుగ్లక్‌లా వ్యవహరిస్తున్నారని జాతీయ బీసీ సంఘం అధ్యక్షుడు, వైసీపీ నేత దేరంగుల ఉదయ్‌కిరణ్‌ విమర్శించారు. “వెనుకబడిన వర్గాలవారి బాధలు తీర్చకపోతే బీసీలు వైసీపీని వీడతారు. రాబోయే రోజుల్లో వైసీపీకి గడ్డుకాలం తప్పదు” అని హెచ్చరించారు. అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణంలోని తన కార్యాలయంలో మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా వైసీపీపై ఆయ‌న నిప్పులు చెరిగారు. ముఖ్యంగా తాజాగా రాజ్య‌స‌భ సీట్ల‌ను ఖ‌రారు చేయ‌డం.. వాటిని పొరుగు రాష్ట్రాల‌కు చెందిన వారికి క‌ట్ట‌బెట్టంపై విర‌చుకుప‌డ్డారు.

“రాష్ట్రానికి చెందని, రాష్ట్రంలో ఓటు హక్కులేని ఆర్‌ కృష్ణయ్యను సీఎం జగన్‌ రాజ్యసభకు ఎంపిక చేయడం ఏమిటి? రాష్ట్ర ప్రజలు ఓట్లు వేస్తే సీఎం అయ్యారో లేక తెలంగాణ ప్రజలు ఓట్లు వేస్తే సీఎం అయ్యారో జగన్‌ తెలపాలి. గతంలో రిలయన్స్‌కు చెందిన వ్యక్తికి రాజ్యసభ సీటును ధారాదత్తం చేశారు. ఇప్పుడు రాష్ట్రానికి చెందని వ్యక్తులకు ఇచ్చారు. జగన్‌ వద్ద తుగ్లక్‌ సలహాదారులు ఉన్నారు. వీరివల్ల పార్టీ భ్రష్టుపడుతోంది” అని మండిపడ్డారు. మ‌రి దీనికి జ‌గ‌న్ ఏం చెబుతారో చూడాల‌ని అంటున్నారు విశ్లేష‌కులు.