కోనసీమ జిల్లా పేరు మారనుంది. ఆ జిల్లా పేరును డా.బీఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లాగా మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై త్వరలోనే ప్రాథమిక నోటిఫికేషన్ విడుదల కానుంది. అమలాపురం కేంద్రంగా ఏర్పాటు చేసిన కోనసీమ జిల్లాకు డా బీఆర్.అంబేడ్కర్ పేరు పెట్టాలని దళిత, ప్రజాసంఘాలు, వివిధ పార్టీలు కోరాయి. దీనికోసం పలుచోట్ల ఆందోళన కార్యక్రమాలు కూడా జరిగాయి. ఈ నేపథ్యంలో కోనసీమ జిల్లా పేరులో డా.బీఆర్.అంబేడ్కర్ పేరును చేరుస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
కోనసీమ జిల్లా పేరును అంబేడ్కర్ జిల్లాగా మార్చాలని డిమాండ్ చేస్తూ గోదావరి జిల్లా అమలాపురంలో చాలా కాలం నుంచి ఉద్యమాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రభుత్వం ముసాయిదా నోటిఫికేషన్ జారీ చేసిన దగ్గర నుంచి కూడా దీనిపై డిమాండ్లు వస్తున్నాయి. అంబేడ్కర్ జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నిరసనలకు వేలాదిగా ప్రజల నుంచి మద్దతు లభించింది. అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని వివిధ ప్రాంతాలకు చెందిన అంబేడ్కర్ అభిమానులు , జిల్లా మద్దతుదారులు అనేక రూపాల్లో పోరాటాలు చేశారు.
అదేసమయంలో మంత్రి పినిపే విశ్వరూప్‌కు కూడానిరసన కారులు విన్నవించారు. రెండోసారి కేబినెట్‌కు ఎన్నికైన ఆయనకు ఈ జిల్లాపై మరిన్ని డిమాండ్లు వచ్చాయి. అయితే.. మొదట్లో పట్టించుకోని వైసీపీ సర్కారు.. ఇటీవల కాలంలో ఎస్సీల నుంచి వ్యతిరేకత వస్తుండడంతో .. వారిని ప్రసన్నం చేసుకునేందుకు ఎట్టకేలకు తన నిర్ణయాన్ని మార్చుకుంది. ఈ క్రమంలోనే తాజాగా కోనసీమ జిల్లా పేరును బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాగా మారుస్తూ.. నిర్ణయించింది. త్వరలోనే దీనికి సంబంధించి గెజిట్ నోటిఫికేషన్ విడుదల కానుంది.