జగన్ ఫాలో అయ్యేది ఈ రెండే

తాజాగా వైసీపీ తరపున ఎంపికైన నలుగురు రాజ్యసభ అభ్యర్ధుల్లో ఇద్దరు తెలంగాణా వాళ్ళే కావటం గమనార్హం. నలుగురు ఎంపీ అభ్యర్ధుల్లో రెండు అగ్రకులాలకు, మరో రెండు వెనుకబడిన కులాలకు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి. మొదటి నుంచి కూడా పదవుల పంపిణీలో కానీ, ఎంపికలో కానీ జగన్ సోషల్ ఇంజనీరింగ్ పాటిస్తున్న విషయం తెలిసిందే. ప్రతీ పదవిని జాగ్రత్తగా లెక్కలేసి మరీ సోషల్ ఇంజనీరింగ్ అమలుచేస్తున్నారు. సరే ఏది చేసిన అంతిమంగా రాజకీయంగా లబ్ది పొందడానికి అన్నది వాస్తవం.

రాజకీయంగా లబ్ది పొందడానికి ఒక్కొక్క వ్యూహం అమలు చేస్తారు. ఇందులో భాగంగా జగన్ సంక్షేమ పథకాల అమలు మ్యాగ్జిమమ్ చేస్తునే సోషల్ ఇంజనీరింగ్ కూడా పాటిస్తున్నారు. రాజకీయంగా ఈ రెండు అంశాలు జగన్ వ్యూహమనే అనుకోవాలి. కాకపోతే ఇక్కడ ఒక ఇంట్రస్టింగ్ పాయింట్ ఉంది. అదేమిటంటే తాజాగా ఎంపికైన నలుగురు రాజ్యసభ అభ్యర్ధుల్లో ఇద్దరు తెలంగాణా వాళ్ళు కావటం. తెలుగురాష్ట్రాలు విడిపోయిన తర్వాత ఏపికి సంబంధించిన వాళ్ళు తెలంగాణా రాజకీయాల్లో జోక్యం చేసుకోవటం లేదు.

అలాగే తెలంగాణా నేతలు కూడా ఏపీ వ్యవహారాల్లో ఎక్కడా కనబడటం లేదు. అంటే స్పష్టమైన విభజన ఉంది కాబట్టి ఒక రాష్ట్ర రాజకీయాల్లో మరొకరు జోక్యం చేసుకోవటం లేదు. అలాంటిది తెలంగాణాకు చెందిన న్యాయవాది నిరంజన్ రెడ్డి, బీసీ సంక్షేసంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్, కృష్ణయ్యలను ఏపీ కోటాలో రాజ్యసభకు ఎంపిక చేయడమే ఆశ్చర్యంగా ఉంది. ఈ మాత్రం వ్యక్తులు ఏపీలో అందులోను పార్టీలో లేరా అంటే కచ్చితంగా ఉండే ఉంటారు.

అయితే ఎవరిని ఎంపిక చేయాలనేది పూర్తిగా జగన్ ఇష్టమే కాబట్టి ఎంపికను ప్రశ్నించేందుకు లేదు. గతంలో ఉత్తరాదికి చెందిన పరిమళ్ నత్వానీకి కూడా రాజ్యసభ అవకాశం ఇచ్చిన విషయం తెలిసిందే. ఒకేసారి ఇద్దరు తెలంగాణా వ్యక్తులకు కాకుండా ఒక్కోసారి ఒక్కరికి అవకాశం ఇచ్చుంటే బాగుండేదని చర్చ పార్టీలో నడుస్తోంది. ఏదేమైనా తెలంగాణా వాళ్ళకు కూడా ఏపీ రాజకీయాల్లో కీలక అవకాశాలు ఇవ్వటం అన్నది ఆశ్చర్యంగానే ఉంది.