వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీజేపీ దూసుకెళుతోందా..? ఆ కీలక స్థానాల్లో గెలుపే ధ్యేయంగా ముందుకు కదులుతోందా..? ఆ పార్టీ అగ్రనేతల పర్యటనల ఉద్దేశం అదేనా..? అంటే బీజేపీ శ్రేణులు అవుననే సమాధానం ఇస్తున్నాయి. ఆ కీలక స్థానాలు ఏవో కావు.. ఆ పార్టీకి పట్టున్న అర్బన్ నియోజకవర్గాలు. వీటిల్లో విజయం సాధిస్తే సులువుగా అధికారంలోకి రావచ్చొని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు.
తన రెండో విడత పాదయాత్ర ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నుంచి మొదలు పెట్టిన తెలంగాణ బీజేపీ శాఖ అధ్యక్షుడు బండి సంజయ్ వ్యూహాత్మకంగా రంగారెడ్డి జిల్లాలో ముగించారు. ఆయన పాదయాత్రకు ప్రజల నుంచి ముఖ్యంగా.. యువత నుంచి మంచి స్పందన లభించింది. ఈ టెంపోను ఇలాగే కొనసాగించాలని భావించిన బండి ఆ పార్టీ అగ్రనేతలు రాష్ట్ర పర్యటనకు వచ్చేలా ప్లాన్ చేసుకున్నారు.
పలువురు బీజేపీ అగ్ర నేతలు, కేంద్ర మంత్రులు బండి యాత్రకు సంపూర్ణ మద్దతు తెలిపారు. అలాగే ఇటీవల ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా కూడా బండిని అభినందించి వెళ్లారు. మూడు రోజుల క్రితం తుక్కుగూడలో నిర్వహించిన బహిరంగ సభకు ఏకంగా ఆ పార్టీ ఫైర్ బ్రాండ్ హోంమంత్రి అమిత్ షాను రప్పించారు. అమిత్ షా రాష్ట్ర నేతలతో నిర్వహించిన సమావేశంలో పార్టీ అధికారంలోకి వచ్చేందుకు పలు కీలక సూచనలు చేశారట.
అందులో ముఖ్యమైన అంశాలో ఒకటి అసెంబ్లీ ఎన్నికల టార్గెట్ 61 సీట్లు అట. 2018లో గెలిచిన ఒక స్థానం నుంచి ఈసారి 61 సీట్లు సాధించి అధికారంలోకి వచ్చేందుకు ప్రణాళికలు రచించాలని సూచించారట. ఇందులో మెజారిటీ స్థానాలు అంటే దాదాపుగా సగం సీట్లు అర్బన్ నుంచే గెలవాలని లక్ష్యం విధించారట. ఇక్కడే 30 కి పైగా సీట్లు సాధిస్తే మిగతా సీట్లు రూరల్ నియోజకవర్గాల నుంచి గెలవడం పెద్ద కష్టం కాబోదని హితబోధ చేశారట.
యువత ఎక్కువగా ఉన్న అర్బన్ స్థానాల్లో మెజారిటీ సీట్లపై కమలం నేతలు కన్నేశారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అత్యధిక సీట్లు సాధించిన అసెంబ్లీ నియోజకవర్గాలను టార్గెట్ చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. గ్రేటర్ హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచే 20 సీట్లను లక్ష్యంగా పెట్టుకున్నారు. వీటిలో శేరిలింగంపల్లి, ఎల్బీనగర్, మహేశ్వరం, రాజేంద్రనగర్, మేడ్చల్, ఉప్పల్, మల్కాజిగిరి, కుత్బుల్లాపూర్, కూకట్ పల్లి, వికారాబాద్, ముషీరాబాద్, అంబర్‌పేట, ఖైరతాబాద్, గోషామహల్, సికింద్రాబాద్ స్థానాల్లో గెలుపు అవకాశాలను గుర్తించారట.
ఇవే కాకుండా.. మిగతా జిల్లాల్లో ఉన్న అర్బన్ స్థానాలు.. భువనగిరి, సూర్యాపేట, వరంగల్, భూపాలపల్లి, నిజామాబాద్ అర్బన్, రూరల్, కామారెడ్డి, కరీంనగర్, ఆదిలాబాద్, మహబూబ్ నగర్ తదితర స్థానాలు కూడా తమకు అనుకూలంగా ఉన్నాయని.. కొద్దిగా కష్టపడితే వీటిల్లో గెలుపు సులభమని అంచనాలు వేస్తున్నారు. వీటితో పాటు ఇతర గ్రామీణ నియోజకవర్గాల్లో తమ పట్టును నిలుపుకోవాలని భావిస్తున్నారు. బీజేపీ వ్యూహాలు బాగానే ఉన్నా ఆచరణలో ఎంతవరకు అమలు చేస్తారో.. ప్రజలు ఎలా రిసీవ్ చేసుకుంటారో వేచి చూడాలి.