ఆంధ్రావని అప్పులపై మళ్లీ కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు పబ్లిక్ కోసం చేసిన అప్పును పబ్లిక్ గానే తెలియజేయాలని, దాచేందుకు వీల్లేదని చెబుతూ, బడ్జెట్ లో లెక్క చూపని అప్పుల లెక్క తేల్చాలని ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ (ఏపీజీ) ఓ లేఖ రాసింది. దీంతో ఇప్పుడు జగన్ సర్కారు మరోసారి డైలామాలో పడిపోయింది.
ఇప్పటికే ఏపీ చేసిన లేదా చేస్తున్న అప్పులపై తామేమీ షూరిటీ ఉండమని, ఆ అప్పులకు తమకూ ఏ సంబంధం లేదని చెప్పేసింది కేంద్రం. ఇప్పుడిదే మాటను కేంద్ర ఉన్నతాధికారుల వర్గం కూడా మరో సారి చెబుతున్నారు.
బడ్జెట్ లో లెక్కలు లేకుండా దాదాపు లక్ష కోట్ల అప్పు ఏ విధంగా చేశారో అన్నది ఎప్పటి నుంచో వివిధ ఆర్థిక వర్గాలను వేధిస్తున్న ప్రశ్న. దీనినే హైలెట్ చేస్తూ గతంలో విపక్ష పార్టీలు నానా యాగీ చేశాయి. నానా రాద్ధాంతం చేశాయి.కానీ మా అప్పు మా ఇష్టం అన్న విధంగా మాట్లాడిన వైనం ఒకటి వెలుగులోకి రావడంతో అప్పట్లో దీనిపై పెద్ద చర్చే సాగింది.
తరువాత ఏపీకి అప్పులు పుట్టకపోవడానికి కారణం కూడా ఇదే ! ఇదే విషయమై బాబు కూడా కేంద్రాన్కి ఫిర్యాదులు చేశారు. అదేవిధంగా రెబల్ ఎంపీ రఘు రామ కూడా లేఖల ద్వారా, ప్రెస్మీట్ల ద్వారా ఇదే విషయమై పోరాడారు. ఇక తాజాగా కేంద్ర ఉన్నతాధికారులు ఏపీ సర్కారుకు లేఖ రాయడంతో ఇప్పుడీ వివాదం ఎటు తిరిగి ఎటుపోతుందో అన్న ఆందోళన వెన్నాడుతోంది జగన్ వర్గాలను!
ఇప్పటికే ఏపీలో కొన్ని కార్పొరేషన్ల పేరిట లోన్లు తీసుకున్నారు. మన మాదిరిగానే తెలంగాణలో కూడా వివిధ కార్పొరేషన్ల పేరిట అక్కడి ప్రభుత్వ వర్గాలు కూడా లోన్లు తీసుకున్నాయి. వీటన్నింటికీ ఇచ్చిన హామీ పత్రాల మాటేంటి? వీటిని ఎలా తీరుస్తారు? వివిధ సొసైటీల కోసం, వివిధ కార్పొరేషన్ల కోసం చేసిన అప్పులు వాటికే వెచ్చించారా లేదా నిధుల మళ్లింపు చేశారా?
వీటిపై కూడా వివరాలు ఇవ్వాలని కేంద్రం పట్టుబడుతోంది. ఈ పరిణామాలన్నీ ఏపీ లోనే కాదు టీజీలోనూ ఉన్నాయని వైసీపీ అంటోంది కానీ అప్పుల లెక్కలు, బడ్జెటేతర రుణాల కూర్పు అన్నవి ఎలా చేశారో..అసెంబ్లీ ఆమోదం లేకుండా బడ్జెట్ లో పొందుపరచని, ఆర్థిక శాఖ సమర్పించే పద్దుల్లో ప్రస్తావించని వాటికి అప్పులు ఎలా చేశారో లెక్క చెప్పాలని కేంద్రం అంటోంది.