బాబు -జగన్ – బాబు … ఈ సంప్రదాయం కొనసాగాల్సిందేనా?

Jagan

కొద్ది రోజుల క్రితం ఏపీలోని రాజకీయ పరిస్థితుల్ని గుర్తుకు తెచ్చేలా సోషల్ మీడియాలో పెట్టిన ఒక పోస్టు చాలా ఎక్కువగా వైరల్ అయ్యింది. ధాని సారాంశం ఏమంటే.. 151 మేకలు.. 23 పులులు.. అంటూ సింగిల్ లైన్ లో పెట్టిన ఈ పోస్టు ఎక్కువగా షేర్ అయ్యింది. తర్వాతేమైంది? అన్న విషయంలోకి వస్తే.. ఆ పోస్టు పెట్టిన వ్యక్తిని పోలీస్ స్టేషన్ కు పిలిపించారు. గంటల తరబడి కూర్చోబెట్టారు. అంతేనా.. అలాంటి ఉదాహరణలు ఇటీవల కాలంలో చాలానే చోటు చేసుకున్నట్లు చెబుతున్నారు.

విశాఖ ఎల్జీ పాలిమర్స్ వ్యవహారంలో పలు సందేహాల్ని వ్యక్తం చేస్తూ వచ్చిన సోషల్ మీడియా పోస్టును 65 ఏళ్ల మహిళ (ఆమె తెలుగుదేశం కార్యకర్త లేదంటే సానుభూతిపరురాలు అనుకుందాం) షేర్ చేసిన దానికి ఆమెపై సీఐడీ కేసు నమోదు చేయటమే కాదు.. విచారణను ఎదుర్కోవాల్సి వచ్చింది.

దీనికంటే సిత్రమైన విషయం మరొకటి ఉంది. ఎస్సీ వర్గానికి చెందిన మహిళతో తనకున్న బంధాన్ని తెంచుకొన్న బీసీ వర్గానికి చెందిన వ్యక్తి మరో పెళ్లి చేసుకోవాలనుకున్నారు. వివాహ ఆహ్వానాన్ని అందుకున్న టీడీపీ ముఖ్యనేతలు పెళ్లికి వెళ్లారు. వీరిపై పోలీసులు పెట్టిన కేసు ఏమిటో తెలుసా? ఎస్సీ.. ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం. ఇంతకూ.. ఆ కేసు పెట్టింది ఎవరి మీదనో తెలుసా? మాజీ మంత్రులు యనమల రామకృష్ణుడు, చినరాజప్పల మీదా.

అంతేకాదు..ఇటీవల కాలంలో ప్రెస్ మీట్లు కవర్ చేసిన మీడియా సంస్థలకు నోటీసులు అందుతున్నాయి. అయితే.. కవర్ చేసిన అందరికి కాకుండా.. కొందరికి మాత్రమే అన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సీఎం జగన్ కు చెందిన సరస్వతి పవర్ కు గనుల లీజును 50 ఏళ్లకు పొడిగింపుపై విపక్ష నేత చంద్రబాబు మాట్లాడారు. పలు విమర్శలు చేశారు. ఆ అంశంపై బాబుకు నోటీసులు ఇచ్చారు. అదే సమయంలో బాబు వ్యాఖ్యల్ని ప్రచురించిన ఈనాడు.. ఆంధ్రజ్యోతిలకు నోటీసులు ఇచ్చారు. బాబు ప్రెస్ మీట్ ను టెలికాస్ట్ చేసిన మిగిలిన మీడియా సంస్థల్ని వదిలేయటం గమనార్హం.

ఇప్పుడీ అంశాల ప్రస్తావన ఎందుకంటే.. చంద్రబాబు ప్రభుత్వంలో.. ఇదే సోషల్ మీడియాలో జగన్ అండ్ కో పెట్టిన పోస్టులు.. చేసిన వ్యాఖ్యలు తక్కువేం కావు. కొన్ని సందర్భాల్లో మితిమీరిన పోస్టులు పెట్టిన వారిపై అప్పట్లో కేసులు పెట్టారు. దానికి సైతం అభ్యంతరాలు వ్యక్తం చేసిన జగన్ అండ్ కో ఇప్పుడు మాత్రం.. చిన్న విషయాలకు కేసులు పెట్టటాన్ని పలువురు ప్రశ్నిస్తున్నారు.

పోస్టు పెడితే కేసులు.. కాస్త తీవ్రమైన వ్యాఖ్యానం జోడితే.. విచారణ తిప్పలు తప్పట్లేదన్న వాదన వినిపిస్తోంది. ఈ తీరు ఏ మాత్రం సరికాదన్న అభిప్రాయం పలువురిలో వ్యక్తమవుతోంది. అదే సమయంలో.. శ్రుతి మించి రాగాన పడేలా ఉండే పోస్టుల విషయంలో చూసిచూడనట్లుగా ఉండమని చెప్పట్లేదు. కాకుంటే..అన్నింటిని ఒకే గాటిన పెట్టటం సరికాదన్నదే చెప్పేది.

ఎందుకంటే.. అధికారం శాశ్వితం కాదు. ఇప్పుడు అలవాటు చేసిన తీరునే.. రేపొద్దున అధికారంలోకి వచ్చేవారు అనుసరించే ప్రమాదం ఉంటుందన్నది మర్చిపోకూడదు. అధికారంలో ఉన్నప్పుడు బాగానే ఉన్నా.. విపక్షంలో ఉన్నప్పుడు కష్టాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. చంద్రబాబు హయాంలో తప్పులు జరిగి ఉండొచ్చు. కక్ష సాధింపు చర్యల్లో భాగంగా కేసులు పెట్టి ఉండొచ్చు. బాబు బ్యాచ్ చేసిన తప్పుల్నే.. జగన్ పరివారం ఎందుకు చేయాలి?