‘నేను స్థానికుడినే. కుప్పంలో ఇల్లు కడతాను. దానికోసం రెండెకరాలు స్థలం కొన్నా. త్వరలోనే ఇంటినిర్మాణం చేపడతా’ అని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు చెప్పారు. శాంతిపురం మండలం బోయనపల్లెలో జరిగిన ‘బాదుడే బాదుడు’ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. పార్టీ నేతలు, కార్యకర్తలతో కలిసి లాంతర్లు, కొవ్వొత్తులు, విసనకర్రలతో ఆయన వీధుల్లో తిరిగారు. అనంతరం ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ.. తాను ఎప్పటికీ కుప్పానికి చెందిన వాడేనని స్పష్టంచేశారు.
తనను కుప్పం నుంచి వేరు చేసే శక్తి ఎవరికీ లేదన్నారు. రాష్ట్రంలో విద్యుత్ కోతలు, వైసీపీ అరాచకపాలనతో అంధకారం నెలకొందన్నారు. ప్రజలపై విద్యుత్, బస్‌చార్జీల పెంపు, పెట్రో ఉత్పత్తుల భారం మోపా రన్నారు. భారాలు మోపి ప్రజలకు గుద్దుల రుచి చూపిస్తున్నారన్నారు. విశాఖలో హుద్‌హుద్ తుఫాను సంభవిస్తే తాను సీఎంగా అక్కడే ఉండి రెండు రోజుల్లో సాధారణ పరిస్థితులు నెలకొల్పానన్నారు. కుప్పం నియోజకవర్గంలో గాలీవానకు భారీ ఆస్తి నష్టం కలిగితే రైతులు, ప్రజలను కనీసం పరామర్శించేవారే లేకుండా పోయారని ఆవేదన వ్యక్తం చేశారు.
మరోవైపు పార్టీ నేతలకూ చురకలంటించారు. తనకు గట్టి నాయకులు కావాలే తప్ప, వట్టినాయకలు అవసరం లేదన్నారు. కష్టకాలంలో పార్టీకి పనిచేయని వారిని మార్చేందుకూ వెనకాడేది లేదన్నారు. అధికార పార్టీ ఆగడాలు, ఒత్తిళ్లకు బెదరకుండా పార్టీ కార్యక్రమాల్లో భాగస్వాములవుతున్న యువ కార్యకర్తలను గుర్తు పెట్టుకుంటానని, భవిష్యత్‌లో వారికి తగు గుర్తింపునిస్తానని చెప్పారు. ఒకవైపు వర్షం పడుతున్నా.. చంద్రబాబు తన ప్రసంగం కొనసాగించడం గమనార్హం.
సుప్రీం తీర్పుపై బాబు రియాక్షన్ ఇదే
రాజద్రోహం చట్టం(124 ఏ) అమలును నిలిపివేస్తూ, దేశ అత్యున్నత ధర్మాసనం తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయాన్ని చంద్రబాబు స్వాగతించారు. ఈ సెక్షన్ కింద ప్రభుత్వాలు కొత్త కేసులు నమోదు చేయొద్దని చెప్పడంతోపాటు ఇప్పటికే పెట్టిన కేసులపై తదుపరి చర్యలు వద్దని స్పష్టం చేయడం హర్షణీయమన్నారు. నియంతృత్వ పోకడలు అనుసరించే ప్రభుత్వాలు తమ రాజకీయకక్షలు తీర్చుకోవడానికి ఈ చట్టాన్ని ఒక అస్త్రంగా మార్చుకుంటున్న ఈ తరుణంలో.. ప్రజా హక్కుల పరిరక్షణకు సుప్రీంకోర్టు తీసుకున్న ఈ నిర్ణయం దోహదం చేస్తుందని ట్విట్టర్ వేదికగా చంద్రబాబు అభిప్రాయపడ్డారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates