మిత్రపక్షం జనసేన అధినేత పవన్ కల్యాణ్ వైఖరిపై బీజేపీ నేతల్లో అనుమానాలు పెరిగి పోతున్నాయా ? కమలనాథుల ప్రకటనలు చూస్తుంటే అందరిలోనూ ఇదే అనుమానాలు పెరిగిపోతున్నాయి. విషయం ఏమిటంటే బీజేపీ చీఫ్ సోమువీర్రాజు మాట్లాడుతు వచ్చే ఎన్నికల్లో పవన్ కల్యాణ్ తో కలిసే పోటీ చేస్తామని ప్రకటించారు. తమ రెండు పార్టీలే మిత్రపక్షాలుగా కంటిన్యూ అవుతాయన్నారు. మిత్రపక్షాలు ఎన్నికల్లో పోటీ చేయటంలో విశేషమేమీ లేదు.
కాకపోతే ఆ విషయాన్ని పదే పదే ప్రకటిస్తున్నారంటేనే అందరిలోను అనుమానాలు పెరిగిపోతున్నాయి. జనసేన+బీజేపీ మిత్రపక్షాలని అందరికీ తెలుసు. అయితే అదే విషయాన్ని సోము వీర్రాజు పదే పదే ఎందుకు ప్రకటించుకుంటున్నారో అర్థం కావడం లేదు. తాజా రాజకీయ వాతావరణం బాగా వేడిగా ఉంది. తెలుగుదేశం పార్టీతో పొత్తు విషయంలో ఇటు పార్టీలోనే కాకుండా అటు జనసేన, బీజేపీలో కూడా చర్చలు జరుగుతున్నాయి.
మిత్రపక్షంగా టీడీపీని కలుపుకోవటానికి బీజేపీ అంగీకరించకపోతే పొత్తు విచ్ఛినమైనా ఆశ్చర్యపోనక్కర్లేదని ప్రచారం జరుగుతోంది. అవసరమైతే బీజేపీని వదిలేసి ఎన్నికల నాటికి టీడీపీ-జనసేనలు పొత్తు పెట్టుకుంటాయనే ప్రచారం పెరిగిపోతోంది. పైగా పవన్ కూడా ఎక్కడ మాట్లాడినా ఇప్పటికైతే తమకు బీజేపీతో పొత్తుందని నొక్కి చెబుతున్నారు. ఇప్పటికైతే బీజేపీ మిత్రపక్షమే అని అంటున్నారంటే భవిష్యత్తు గురించి చెప్పలేమని చెప్పకనే చెబుతున్నారు.
దీంతోనే బీజేపీ నేతల్లో ఆందోళన మొదలైనట్లుంది. పవన్ వైఖరిపై సోము వీర్రాజుతో పాటు చాలామందిలో టెన్షన్ పెరిగిపోతోంది. ఇందులో భాగంగానే పవన్ పై మానసికంగా ఒత్తిడి పెంచేందుకు సోము వీర్రాజు పదే పదే పొత్తు విషయాన్ని ప్రకటిస్తున్నారట. పైగా 2024లో బీజేపీ+జనసేన అధికారంలోకి వచ్చేందుకు వీలుగా బ్లూ ప్రింట్ రెడీ చేస్తున్నట్లు ప్రకటించారు. పవన్ ఏమో ఢిల్లీ నుండి రోడ్ మ్యాప్ రావాలంటారు, వీర్రాజేమో బ్లూ ప్రింట్ రెడీ చేస్తున్నట్లు చెప్పారు. మరి రెండింటిలో ఎవరు చెప్పేది కరెక్టో అర్ధంకాక పార్టీ నేతలు, కార్యకర్తలతో పాటు జనాలు కూడా జుట్టు పీక్కుంటున్నారు. మరీ బ్లూ ప్రింట్ పై పవన్ ఎలా స్పందిస్తారో చూడాల్సిందే.
Gulte Telugu Telugu Political and Movie News Updates