తమిళనాట త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలు రాష్ట్రంలోని అధికార పార్టీ డీఎంకేకు.. అత్యంత కీలకంగా మారున్నాయి. ఒకవైపు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే, మరోవైపు డీఎంకే, ఇంకోవైపు నటుడు విజయ్ సొంత పార్టీ వెరసి.. మొత్తంగా ఈ ఎన్నికలు అత్యంత సంక్లిష్టంగా.. అదేసమయంలో ప్రతిష్టాత్మకంగా జరగనున్నాయి. మొత్తం 234 అసెంబ్లీ స్థానాలు ఉన్న తమిళనాడు.. దక్షిణాది రాష్ట్రాల్లో అతి పెద్ద సంఖ్యలో అసెంబ్లీస్థానాలు ఉన్న రాష్ట్రంగా గుర్తింపు పొందింది.
దీంతో ఇక్కడ పాగా వేయాలన్నది బీజేపీ ప్రధాన వ్యూహం. ఈ క్రమంలోనే ఇప్పటికే చిన్నాచితకా పార్టీలను తన పంచన చేర్చుకుంది. చివరకు ఏమాత్రం ఓటు బ్యాంకు లేని టీటీవీ దినకరన్ పార్టీనికూడా ఇటీవల తన బృందంలో చేర్చుకుంది. అదేసమయంలో సెంటిమెంటును కూడా రాజేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. తాజాగా ఆదివారం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఇక్కడ ఎన్నికల ప్రచారాన్ని కూడా అనధికారికంగా ప్రారంభించేశారు. దీంతో అధికార పార్టీ డీఎంకే తన పట్టు నిలుపుకొనేందుకు .. ప్రయత్నాలు ముమ్మరం చేసింది.
దీనిలో భాగంగా తమకు కలసి వచ్చే పార్టీలను కలుపుకొని పోవాలని నిర్ణయించుకుంది. ఇక, ఏపీకి చెందిన వైసీపీ కూడా ఇప్పుడు డీఎంకేకు అనుకూలంగా మారనుంది. ఆ పార్టీ తరఫున ప్రచారానికి దాదాపు వైసీపీ నేత జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఆదివారం సీఎం స్టాలిన్ పుట్టిన రోజును పురస్కరించుకుని జరిగిన కార్యక్రమానికి వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి రోజా హాజరయ్యారు. ఆమె అధికారికంగానే ప్రచారం ప్రారంభించేశారు. దీంతో డీఎంకేకు.. వైసీపీ మద్దతు ఇస్తుందన్న వాదనను బలోపేతం చేసింది.
బీజేపీ సహిస్తుందా?
వాస్తవానికి బీజేపీ.. తమిళనాడులో అధికారం దక్కించుకునేందుకు శాయశక్తులా కృషి చేస్తోంది. ఈ క్రమంలో హిందూత్వ నుంచి అనేక అంశాలను తెరమీదికి తెచ్చింది. ముఖ్యంగా డీఎంకే అవినీతిపై యుద్ధం చేస్తామని కూడా ప్రధాని మోడీ ప్రకటించారు. ఇంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న తమిళనాడులో తమకు వ్యతిరేకంగా, డీఎంకేకు అనుకూలంగా వైసీపీ ప్రచారం చేయడాన్ని బీజేపీ సహిస్తుందా? అనేది ప్రధాన ప్రశ్న.
ఇదేసమయంలో వైసీపీ కూడా బీజేపీని ఎదిరించి..ఇక్కడ డీఎంకేకు ప్రచారం చేసేందుకు ముందుకు రావడం చర్చకు దారితీసింది. ఇటీవల ఓ పెళ్లి వేడుకలో సీఎం స్టాలిన్‌తో జగన్ చర్చలు జరిపారని వార్తలు వచ్చాయి. చెన్నైలో జరిగిన వేడుకకు ఇద్దరూ హాజరయ్యారు. అనంతరం.. రోజా స్టాలిన్ పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొని డీఎంకే తరఫున ప్రచారం ప్రారంభించడం చర్చకు దారి తీసింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates