పది రోజుల స్టాక్ మాత్రమేనా? తర్వాత ఏమవుతుంది?

అదును చూసుకుని వ్యాపార సంస్థలు తమ నైజాన్ని బయట పెట్టుకుంటాయి. పది రూపాయలు పోగేసుకునేందుకు ప్రయత్నిస్తాయి. ఇప్పుడు చమురు విషయంలోనూ అదే పరిస్థితి నెలకొంది. ఇరాన్ యుద్ధం సహా పాకిస్థాన్ – అఫ్ఘానిస్థాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రపంచ దేశాలకు చమురు సమస్య తలెత్తే ప్రమాదం పొంచి ఉందని అంతర్జాతీయ పరిణామాలు సూచిస్తున్నాయి.

ముఖ్యంగా భారత్ వంటి అతి పెద్ద జనాభా ఉన్న దేశంలో చమురు వినియోగం తారస్థాయిలో ఉంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చమురు ఎక్కువగా వినియోగిస్తున్న దేశాల్లో భారత్ మూడవ స్థానంలో ఉంది. రోజుకు మన దేశంలో సుమారు 55 లక్షల బ్యారెళ్ల చమురును వినియోగిస్తున్నారు. ఇందులో డీజిల్, పెట్రోల్ రెండూ ఉన్నాయి. ఒక్క బ్యారెల్‌కు 159 లీటర్లు ఉంటాయి. ఆ లెక్కన దేశానికి ఎంత పెద్ద స్థాయిలో చమురు అవసరమో అర్థమవుతుంది.

ఈ డిమాండ్‌ను తట్టుకునేందుకు భారత్ ప్రపంచ దేశాల నుంచి నిరంతరం చమురును దిగుమతి చేసుకుంటోంది. తాజాగా ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో హోర్మోజ్ జలసంధిని ఇరాన్ మూసివేసినట్టు సమాచారం. దీంతో ఆ మార్గం ద్వారా భారత్‌కు చేరాల్సిన చమురు నౌకలు నిలిచిపోయాయి.

మరోవైపు రష్యా నుంచి కొనుగోలు చేయాలని అనుకున్నా అమెరికా అధ్యక్షుడి ఆంక్షల నేపథ్యంలో ఆ దిగుమతులను కూడా తగ్గించినట్టు తెలుస్తోంది. దీంతో ఇప్పుడు చమురు సరఫరా విషయంలో భారత్ పునరాలోచనలో పడింది.

ప్రస్తుతం దేశంలో ఉన్న చమురు నిల్వలు దాదాపు పది రోజుల వరకు సరిపోతాయని అంచనా. అత్యవసర నిల్వలను ఉపయోగించినా అవి సుమారు 20 రోజులకే పరిమితం కావచ్చు. అందులోనూ దాదాపు 60 శాతం నిల్వలు రక్షణ అవసరాలకు కేటాయించబడతాయి. దీంతో సాధారణ వినియోగానికి ఎంత చమురు అందుబాటులో ఉంటుంది అన్నది కీలకంగా మారింది.

ఇప్పటికే దేశంలో చమురు నిల్వలపై కలకలం మొదలైంది. ఫలితంగా సాధారణ వస్తువుల నుంచి అన్ని రకాల ధరలు పెరిగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు హెచ్చరిస్తున్నాయి. రవాణాతో ముడిపడిన ప్రతి వస్తువు ధర పెరగవచ్చని అంచనా వేస్తున్నారు.