ఏపీలో ఆ ప‌రీక్ష‌లు కూడా ర‌ద్దు

క‌రోనా దెబ్బ‌కు ఈ ఏడాది అన్ని కార్య‌క‌లాపాలూ నిలిచిపోయాయి. స్కూళ్లు, కాలేజీలు ఏవీ ఇప్పుడిప్పుడే తెరుచుకునే ప‌రిస్థితి లేదు. చాలా త‌ర‌గ‌తుల‌వి ప‌రీక్ష‌లు కూడా నిర్వ‌హించుకోలేని ప‌రిస్థితి త‌లెత్తింది. మార్చిలో టెన్త్, డిగ్రీ ప‌రీక్ష‌ల‌కు స‌న్నాహాలు జ‌రుగుతున్న స‌మ‌యంలో క‌రోనా మ‌హ‌మ్మారి ప్ర‌భావం మొదలైంది. వైర‌స్ వ్యాప్తి చెంద‌కుండా లాక్ డౌన్ విధించ‌డం.. దాన్ని పొడిగించుకుంటూ వెళ్ల‌డంతో ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ సాధ్య‌ప‌డ‌లేదు.

ఈ నేప‌థ్యంలో ముందు తెలంగాణ‌లో ప‌దో త‌ర‌గతి ప‌రీక్ష‌లు ర‌ద్దు చేశారు. కానీ ఏపీలో మాత్రం ఎట్టి ప‌రిస్థితుల్లోనూ ప‌రీక్ష‌లు జ‌ర‌పాల్సిందే అని ప‌ట్టుద‌ల‌తో క‌నిపించిన సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి సైతం త‌ర్వాత మ‌న‌సు మార్చుకోక త‌ప్ప‌లేదు. ఇటీవ‌లే అక్క‌డ కూడా టెన్త్ ప‌రీక్ష‌లు ర‌ద్దు చేసిన సంగ‌తి తెలిసిందే.

ఇప్పుడు మ‌రికొన్ని త‌ర‌గ‌తుల ప‌రీక్ష‌ల‌ను కూడా ర‌ద్దు చేస్తూ ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది. క‌రోనా వ్యాప్తి రాష్ట్రంలో అంత‌కంత‌కూ పెరుగుతున్న నేప‌థ్యంలో డిగ్రీ, పీజీ, వృత్తి విద్యా కోర్సుల చివ‌రి సెమిస్ట‌ర్ ప‌రీక్ష‌ల‌ను ర‌ద్దు చేయాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. అలాగే డిగ్రీ మొద‌టి, రెండో ఏడాది విద్యార్థుల‌ను ప‌రీక్ష‌లు లేకుండానే ప్ర‌మోట్ చేయాల‌ని కూడా ఆదేశాలు జారీ చేసింది.

డిగ్రీ, పీజీ విద్యార్థుల ఫైన‌ల్ సెమిస్ట‌ర్ ర‌ద్దయిన నేప‌థ్యంలో గ్రేడింగ్ లేదా మార్కుల విష‌యంలో ఏం చేయాలో స్థానిక విశ్వ‌విద్యాల‌యాల ఎగ్జిక్యూటివ్ క‌మిటీలు చ‌ర్చించి నిర్ణ‌యిం తీసుకోవాల‌ని ప్ర‌భుత్వం సూచించింది. టెన్త్ ప‌రీక్ష‌లు ర‌ద్ద‌యినప్ప‌టి నుంచి డిగ్రీ, పీజీ విద్యార్థులు త‌మ ప‌రిస్థితేంట‌ని అడుగుతున్నారు. ఇప్పుడు వారికీ ఉప‌శ‌మ‌నం ల‌భించింది. తెలంగాణ‌లోనూ ఇదే నిర్ణ‌యం తీసుకోవ‌డం లాంఛ‌న‌మే అని భావిస్తున్నారు.

CLICK HERE!! For the Latest Updates on all the OTT Content