రాజకీయ పార్టీ అంటే.. ప్రజలకు గుర్తుండి పోవాలి. పార్టీ నాయకులు అంటే.. ప్రజల్లో ముద్రపడిపోవాలి. అయితే.. ఈరెండింటికీ భిన్నంగా.. జనసేన వ్యవహారం ఉందనే చర్చ జోరుగా సాగుతోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నేతృత్వంలో ప్రారంబించిన జనసేన పార్టీపై ప్రజల్లో ఎక్కడా చర్చ సాగడం లేదు. పార్టీ పెట్టి 8 ఏళ్లు దాటుతున్నా.. ఇప్పటి వరకు జనసేన నాయకులు జెండా లేకుండా వెళ్లినా.. పవన్ ఫొటో లేకుండా వెళ్లినా.. ప్రజలు గుర్తు పట్టే పరిస్థితి లేదు.
ఇటీవల ఉభయ గోదావరి జిల్లాల్లోనే ఇలాంటి సంఘటన ఎదురైంది. దీంతో ఖంగుతిన్న నాయకులు ఈ విషయంపై పవన్‌కు సమాచారం అందించారు. “సార్ మనల్ని ఎవరూ గుర్తు పట్టడం లేదు సార్” అంటూ.. ఆయన ముందు ఆవేదన వ్యక్తం చేశారట. అయితే.. దీనిని పవన్ ఎలా తీసుకున్నారో తెలియదు.. కానీ.. మళ్లీ పరిస్థితి మాత్రం మామూలే! కట్ చేస్తే.. ఈ ఎనిమిదేళ్లలో పట్టుమని.. మూడు మాసాలు కూడా ప్రజల్లో జనసేన గురించి చర్చ అయితే.. జరగేలేదనేది వాస్తవం.
ఎలా చూసుకున్నా.. పవన్ ప్రజల మధ్య ఒక్క మూడు మాసాలు లేదా.. కనీసం 50 రోజలు పాటు.. ఆయన పర్యటించింది లేదు. హడావుడిగా రావడం.. ఓ మూడు రోజులు మురిపించడం.. వెంటనే వెళ్లిపోవడం. ఇదే తంతు కొనసాగుతోంది. ఉన్న మూడు రోజులు కూడా.. నిర్మాణాత్మక రాజకీయాలు చేస్తున్నారా? అంటే.. అది కూడా కనిపించడం లేదు. ఈ మాట ఎవరో అనడం కాదు.. నేరుగా.. పవన్ సామాజికవ ర్గానికి చెందిన నాయకులే వ్యాఖ్యానిస్తున్నారు. ఎందుకంటే.. ఎంత సామాజిక వర్గం అభిమానం ఉన్నా.. ప్రజలు ఓట్లు వేయాలంటే.. నాయకులను గుర్తు పట్టాలి.
నాయకులు తమ మధ్య ఉండాలని కోరుకుంటారు. ఈ రెండు విషయాల్లోనూ జనసేన ఫుల్లుగా ఫెయిల్ అయింది. కేడర్ లేదు. నాయకులు లేరు. ఉన్నవారు బయటకు రారు. వచ్చినా.. ప్రజలు గుర్తు పట్టే పరిస్థితి లేదు. దీనికి కారణం.. టీడీపీ మాదిరిగానో.. వైసీపీ మాదిరిగానో.. జనసేన నాయకులు జనంలో ఉండరు. అంతేకాదు.. ఏదైనా కీలక విషయాన్ని లేవనెత్తి.. ఆ విషయంపై సుదీర్ఘ పోరాటం చేసే వ్యూహం కూడా అనుసరించరు. దీంతో ప్రజలు జనసేన నాయకులను గుర్తు పట్టే పరిస్థితి కనిపించడం లేదు.
ఇక, పార్టీ తరఫున సభలు.. సమావేశాలు.. నాయ కులను క్షేత్రస్థాయిలోకి పంపించడం.. కార్యకర్తలను ప్రొత్సహించడం వంటివి లేకపోవడంతో పార్టీ గురించిన చర్చ .. ఎక్కడా జరగడం లేదు. అంతేకాదు.. నాయకులు సైతం పలచగా ఉండడం.. పార్టీ విధానపరమైన నిర్ణయాల్లో వారికి ఎలాంటి పాత్ర లేకపోవడం.. మరో విచిత్రం. దీంతో జనసేన పుంజుకుంటున్న దాఖలా మాట అలా ఉంచితే.. “పవన్ వస్తే..పార్టీ” అనే మాట వినిపిస్తోంది. ఇదే పరిస్తితి కొనసాగితే.. ప్రజల్లో నమ్మకం ఎలా కలుగుతుందనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. మరి ఏం చేస్తారో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates