సామాజిక అసమానతలు పోవాలని రాజకీయాల్లోకి వచ్చానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న వైసీపీకి 2024 ఎన్నికల్లో 15 సీట్లు కూడా వచ్చే అవకాశం లేదన్నారు. తనను ఆర్థికంగా దెబ్బ తీసినా లెక్క చేయబోనని చెప్పారు. వ్యక్తిగత దాడులు చేసినా భరించేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు. చదువుకున్న యువతకు ఉద్యోగాలు రావాలని కోరుకుంటున్నట్టు పవన్ తెలిపారు. జాబ్ క్యాలెండర్ విడుదల చేసి ఉద్యోగాలు ఎందుకు భర్తీ చేయరని ప్రశ్నించారు.
“వృద్ధాప్య పింఛను పథకాన్ని ఆనాడు సంజీవయ్య తెచ్చారు. పింఛను పథకానికి దామోదరం సంజీవయ్య తన పేరు పెట్టుకోలేదు.” అని వైసీపీని ఎద్దేవా చేశారు. రాజకీయాల్లో పౌరుషాలు ఉండవని.. వ్యూహాలే ఉంటాయని పవన్ అన్నారు. మేం సింగిల్‌గా రావాలని అడిగేందుకు మీరు ఎవరని ప్రశ్నించారు. తనకు పదవులు అక్కర్లేదని.. డబ్బు పై వ్యామోహం లేదని చెప్పారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తాము సిద్ధంగా ఉన్నామన్నారు. తానేప్పుడూ ప్రజల క్షేమం గురించే ఆలోచిస్తానని.., ప్రజల కన్నీరు తుడవని ప్రభుత్వం ఎందుకని నిలదీశారు.
రాష్ట్ర విభజన దెబ్బలు ఇంకా తగులుతూనే ఉన్నాయన్న పవన్.. ప్రజలు రేపు అధికారం ఇచ్చినా బాధ్యతగా స్వీకరిస్తానని చెప్పారు. “నాపై కేసులు లేవు కనుకే ఢిల్లీలో ధైర్యంగా మాట్లాడగలిగా. మీ తరఫున పోరాడేందుకు నన్ను ఆశీర్వదించండి. ఇంత మెజారిటీ ఇచ్చినా ప్రజలను చిత్రహింసలు పెడుతున్నారు. ఇతరుల జెండాలు, అజెండాలు నేను మోయను. వైసీపీ ప్రభుత్వ వైఫల్యంపై బీజేపీ పెద్దలకు చెబుతా. మైనార్టీలకు జనసేన అండగా ఉంటుంది. చిన్న చిన్న పనులకు కూడా వైసీపీ నేతలకు లంచం ఇవ్వాల్సి వస్తోంది” అని పవన్ వ్యాఖ్యానించారు.
సిద్ధేశ్వరం-అలుగు ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్తామని నంద్యాల ప్రజలకు హామీ ఇచ్చారు. ఐదేళ్ల సమయం ఇవ్వండి.. రాయలసీమను రతనాలసీమ చేస్తామన్నారు. సమాజంలో మార్పు కోసం యువత ఆలోచించాలని పవన్ పిలుపునిచ్చారు. మద్యపాన నిషేధం అన్నారు.. అమలు చేయలేదు. జాబ్ క్యాలెండర్ అన్నారు.. ఇప్పటివరకూ లేదు. పరిశ్రమలు తెచ్చి ఉద్యోగాలు ఇస్తామన్నారు.. ఇవ్వలేదు. అని వైసీపీ సర్కారుపై విమర్శలు కొనసాగించారు.
పొత్తులపై చర్చలు జరగాలని పవన్ అభిప్రాయపడ్డారు. ప్రజలకు ఉపయోగపడేలా పొత్తులుండాలని ఆకాంక్షించారు. ఏపీ నిర్మాణానికి ప్రతిఒక్కరూ తోడ్పడాలని కోరారు. నేరుగా టీడీపీ అధినేత చంద్రబాబు పొత్తుల ప్రస్తావన తీసుకొస్తే చూద్దామని పవన్ అన్నారు. బీజేపీతో తమ సంబంధాలు అద్భుతంగా ఉన్నాయని తెలిపారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలితే మళ్లీ వైసీపీ అధికారంలోకి వస్తుందని జోస్యం చెప్పారు. రోడ్ మ్యాప్‌పై సరైన సమయంలో స్పందిస్తామని తెలిపారు. తన వ్యక్తిగత లాభం కోసం ఎన్నడూ పొత్తు పెట్టుకోలేదని పవన్‌కల్యాణ్ తెలిపారు.