వైసీపీకి ఎవరితోనూ పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదని పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. ఓటమి భయంతో.. ఎవరికైతే ప్రజల మద్దతు లేదనుకుంటున్నారో.. వాళ్లే పొత్తుల కోసం చూస్తున్నారంటూ టీడీపీ అధినేత చంద్రబాబుపై సెటైర్లు వేశారాయన.
“చంద్రబాబుకు ఎన్నికలలో గెలుస్తామన్న నమ్మకం లేదు. చంద్రబాబును ప్రజలు ఎప్పుడో తిరస్కరించారు. అసలు ప్రజల్లో ఆయన పట్ల విశ్వసనీయత లేదు. పైగా బాబుది దుర్మార్గపు ఆలోచన. ఎప్పుడూ ఇతరులపైనే ఆధారపడే తత్వం. పైగా వెన్నుపోటు పొడుస్తాడు” అంటూ వ్యాఖ్యానించారు. టీడీపీ కార్యకర్తలు చేస్తున్న హత్యలు, అత్యాచారాలను.. ప్రభుత్వానికి అంటగడుతూ బురద జల్లుతున్నారంటూ మండిపడ్డా రు. ఎవరెన్ని పొత్తులు పెట్టుకున్నా వైఎస్సార్‌సీపీ విజయాన్ని అడ్డుకోలేరన్నారు.
మరో పాతికేళ్లపాటు వైఎస్సార్‌సీపీనే అధికారంలో ఉంటుందని, రాబోయే ఎన్నికల్లో ఇంతకు ముందు సాధించిన సీట్లు, ఓట్లు కంటే ఎక్కువ సాధిస్తామని, వైఎస్ జగన్ సీఎంగా కొనసాగతారని ధీమా వ్యక్తం చేశారు ఎంపీ విజయసాయిరెడ్డి.
మంత్రి అంబటి కామెంట్స్ ఇవే..
చంద్రబాబు టూర్‌లో జన స్పందన లేకపోయినప్పటికీ అద్భుత ప్రజాదరణ అంటూ ఓ వర్గం మీడియా బాకాలు పలుకుతోందని జల వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. ప్రజల్లో అంత ఆదరణ ఉంటే చంద్రబాబు ఒంటరిగా ఎందుకు పోటీ చేయరని, అందరూ కలిసి రండి అని ఎందుకు ఆహ్వానిస్తున్నారని ప్రశ్నించారు.
సింగిల్‌గా పోటీ చేసే దమ్ము లేక కలిసి పోటీ చేయడానికి వేదిక సిద్ధం చేసుకుంటున్నారని దుయ్యబట్టారు. ‘పన్నులు లేకుండా ప్రభుత్వాలు నడుస్తాయా.. గతంలో చంద్రబాబు పన్నులు లేకుండానే ప్రభుత్వాన్ని నడిపారా’ అంటూ ప్రశ్నించారు. నవరత్నాలు, సంక్షేమ కార్యక్రమాలు అమలు కాకూడదని కుట్రలో భాగంగానే ఈ రాద్దాంతమంతా చేస్తుంటే, దానికి ఎల్లో మీడియా వత్తాసు పలుకుతోందని మండిపడ్డారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates